బీఆర్ఎస్ నాదే..: ఎన్నికల సంఘానికి వరంగల్ వ్యక్తి లేఖతో ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన రోజే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పేరుతో తాను పార్టీని ప్రారంభిచానని వరంగల్ జిల్లాకు చెందని ఓ వ్యక్తి చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదించవద్దంటూ వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రేమ్ నాయక్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో సెప్టెంబర్ 5న ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు.

అయితే, అక్టోబర్ 5న ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పేరును అధికారికంగా ప్రకటించారని ప్రేమ్ నాయక్ తెలిపారు. మొదటగా తాను దరఖాస్తు చేసుకున్నందున బీఆర్ఎస్ పార్టీ పేరును తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న క్రమంలో ప్రేమ్ నాయక్ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన లేఖపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కాగా, టీఆర్ఎస్ పేరు ఇక అధికారికంగా బీఆర్ఎస్గా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా బదలాయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అంగీకరించారు. పేరును మార్చడానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేశారు. గురువారంనాడే దేశ రాజధానిలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఆర్ఎస్ జెండా ఆవిస్కరించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలందరికి ఆహ్వానాలు అందడంతో ఢిల్లీలోని నేతలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.