సహకారంపై సందేహాలా?: చెక్కులతో ‘రైతు పెట్టుబడి’ పంపిణీ.. అన్నదాత దరికి ఆర్థిక సాయం చేరుతుందా?
హైదరాబాద్: రైతులకు సహకారం కోసమే ఏర్పాటైనవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్).. అవన్నీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అనుబంధ సంఘాలే మరి. ఒకనాడు దేశ ఆర్థిక వ్యవస్థను, అన్నదాతను బలోపేతం చేయడంలో 'సహకార రంగం' పాత్ర కొట్టి పారేయలేనిది. తర్వాత వాటిల్లోనూ రాజకీయ జోక్యం మితిమీరి పెరిగిపోయింది. అది వేరే సంగతి. ఇక వివిధ బ్యాంకుల్లో రైతులు పంట రుణాలు తీసేసుకున్నారు.
కొద్దీమంది అన్నదాతలు మాత్రమే అదీ సంపన్నులు మాత్రమే తీసుకున్న రుణాలు చెల్లించే వెసులుబాటు ఉంది. తొలుత రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు 'పంట పెట్టుబడి' ఇస్తామని ఆశలు ఊసులు రేకెత్తించిన సర్కార్.. విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనుకడుగు వేసింది. రైతు సమన్వయ సమితుల్లో చేరేందుకు పార్టీ శ్రేణులు పడటంతో అవి టీఆర్ఎస్ సమితులన్న అభిప్రాయం ఏర్పడింది.

15 రోజులపాటు గుట్టు చప్పుడు కాకుండా గ్రామాల వారీ సర్వే
ఈ రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించడానికి పాలనాపరమైన ఇబ్బందులు నెలకొనడంతో ‘ఆర్డినెన్స్' జారీ చేస్తామని, చట్టం చేస్తామని ఏలినవారు నమ్మ బలికారు. కానీ ఆచరణలో అదీ తుస్సుమంది. చివరకు ఎలా ఇవ్వాలో తేల్చు కోవడానికి గుట్టుచప్పుడు కాకుండా ‘గ్రామసభ'లు జరిపి నిర్ధారణకు వచ్చింది. రాష్ట్రంలో 15 రోజుల పాటు ఊరూరా సభలు నిర్వహించిన తీరు మీడియా ద్రుష్టి పడకుండా జాగ్రత్తలు పడిందా? తెలిసినా ప్రచురితం కాకుండా, ప్రసారం కాకుండా అడ్డుకున్నారా? అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బయటపడితే అనవసర ప్రచారం జరుగుతుందా? అన్న ముందుచూపుతో పాలకులు వ్యవహరించారా? అన్న మాటలు వినిపిస్తున్నారు.

పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతల అభ్యర్థనలు
ఇదిలా ఉంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక.. కుటుంబ జీవనంతో సతమతం అయ్యే అన్నదాత, రుణాల ఊబి నుంచి బయటపడలేక సతమతం అవుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఇంతకుముందు అమలైన రుణ మాఫీలో భాగంగా ముందుకొచ్చిన ప్రతిపాదనే ‘పంటకు సీజన్‌కు ఎకరానికి రూ.4000 పెట్టుబడి సాయం'. ఇది స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదన. రైతులెవ్వరూ ఈ పెట్టుబడి సాయం చేయమని అడుగనేలేదు. అన్నదాతలంతా కోరుకున్నదల్లా తాము పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర మాత్రమే చెల్లిస్తే చాలునని మొరబెట్టుకుంటే సంకెళ్లేసి కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పిన ఘనత సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానిది. చేసిన తప్పిదాలను దాటవేయడానికి పురుడు పోసుకున్న ఆలోచనే ‘రైతు పెట్టుబడి'.

తొలి నుంచి రైతు సమన్వయ సమితులపై గందరగోళమే
ఈ ఆలోచన 2017 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఏలిన వారి మది నుంచి బయట పడ్డా వెంటనే అమలు చేసేందుకు మనస్కరించలేదు. 2018 నుంచి అమలు చేస్తామని పదేపదే ప్రకటించారు. జిల్లాల నుంచి రైతులను ప్రగతి భవన్ బాట పట్టించి ప్రశంసలందుకున్నారు. నిజంగా రైతుకు మేలు చేస్తే.. ప్రగతి భవన్ బాట పట్టి వారు అభినందించాల్సిన పనే లేదు. అవసరమైనప్పుడు ఓటు ముద్ర వేస్తే సరిపోతుంది. అనవసర ప్రచారార్భాటానికి దిగి రైతులతో పదేపదే సమావేశాల ప్రశంసలు తెచ్చుకున్నా.. ఆచరణలో రైతుకు పెట్టుబడి అమలు ప్రక్రియ తొలి నుంచి గందరగోళంగా మారుతోంది.

రైతుల రాతపూర్వకంగా అభిప్రాయాల సేకరణ ఇలా
రెండు నెలల క్రితం రాష్ట్రమంతా ఒకరోజులో నిర్వహించిన సర్వే ప్రకారం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)పై రైతులకు నమ్మకం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎకరానికి రూ.4 వేలు ఎలా అందించాలనే అంశంపై వ్యవసాయ శాఖ నేరుగా రైతులతో సమావేశమై సర్వే చేసింది. మొత్తం 30 జిల్లాల్లో 551 మండలాల్లో 624 గ్రామాల్లో రైతులతో వ్యవసాయాధికారులు నేరుగా గ్రామసభలు నిర్వహించారు. ప్రతి గ్రామ సభలో కనీసం వందమందికి తగ్గకుండా రైతులుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం సుమారు 70 వేల మంది అన్నదాతల అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తీసుకున్నారు.

నగదు రూపంలో సాయం చేయాలని కోరిన 8 జిల్లాల అన్నదాతలు
రూ.4000 నేరుగా రైతుకి అందించాలంటే ప్రభుత్వం ఎలా పంపిణీ చేయించాలన్నది ఈ సర్వేలో వేసిన ప్రధాన ప్రశ్న. దీనికి అనేక మంది పలు రకాలుగా సమాధానాలిచ్చారు. మొత్తం 12 జిల్లాల్లో ఎక్కువ శాతం మంది చెక్కు రూపంలో ఇవ్వాలని అడిగారు. మరో 10 జిల్లాల్లో తమ బ్యాంకు ఖాతాలో వేయాలని సూచించారు. మిగిలిన 8 జిల్లాల రైతుల్లో అత్యధికంగా నగదు నేరుగా ఇవ్వాలని విన్నవించారు. అలా నగదు నేరుగా ఇవ్వాలని ప్రతిపాదించిన జిల్లాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్ ఉన్నాయి మరి.

నాలుగు జిల్లాల్లో ప్యాక్స్ ద్వారా పంపిణీ కోరని రైతు
మొత్తం రైతుల్లో 1.03 శాతం మంది మాత్రమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా పంపిణీ చేయమని అడిగారు. వాస్తవానికి సహకార సంఘాల ద్వారానే వందశాతం రైతులకిస్తే బాగుంటుందని తొలుత ప్రభుత్వం యోచించింది. కానీ అందుకు 99 శాతం అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదనను ఇక పక్కన పెట్టేసింది. గద్వాల, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కశాతం కాదుకదా .కనీసం ఏ ఒక్క రైతూ ప్యాక్స్ ద్వారా డబ్బు అందుకునేందుకు ఇష్టపడలేదు.

కార్డుల వినియోగం తెలియదని వైనం
బ్యాంకులు ఈ సొమ్మును అప్పు ఖాతాల్లోకి మళ్లించకుండా నేరుగా ‘ప్రీలోడెడ్ కార్డు'ను రైతుకు అందించాలనే ప్రతిపాదన కూడా చర్చకు వస్తున్నది. కానీ దీనికి 6.44 శాతం మంది మాత్రమే ఆమోదం తెలిపారు. పల్లెల్లో ఈ కార్డులను వినియోగించడం కష్టమవుతుందని, తమకు ఉపయోగపడవని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రీ లోడెడ్ కార్డు అంటే ఏమిటి? దానిని ఎలా వినియోగించాలో తెలియదని పలువురు తిరస్కరించారు.

అధిక శాతం రైతులు కార్డులకు ‘నో'
2016 నవంబర్ 8న కేంద్రం పాతనోట్లు రద్దు చేసినప్పుడు సిద్దిపేటను కార్డుల వినియోగంలో రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా మార్చాలని ప్రతిపాదించారు. కానీ ఈ జిల్లా రైతుల్లో 3.5 శాతం మంది మాత్రమే ప్రీలోడెడ్ కార్డు రూపంలో రూ.4వేలు తీసుకోవడానికి ముందుకొచ్చారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన వనపర్తి జిల్లా రైతుల్లో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 16.49 శాతం మంది ఈ కార్డులకు ఆమోదం తెలపడం విశేషం. ఇలాగే గ్రామీణ ప్రాంతాలెక్కువగా ఉన్న నిర్మల్‌లో 15.11, మంచిర్యాలలో 15.66, సిరిసిల్ల రైతుల్లో 10.35 శాతం మంది ప్రీ లోడెడ్ కార్డులడిగారు. మరే ఇతర జిల్లాలోనూ 10 శాతానికి మించి రైతులు ఈ కార్డులను అంగీకరించలేదు.

మూడు జిల్లాల్లో ఖాతాల్లో పంపిణీ చేయొద్దన్న రైతులు
బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అయితే తిరిగి నగదు ఇవ్వరని రైతుల్లో సగటున 62.45 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. కొన్ని జిల్లాల్లో ఇలా నమ్మేవారి శాతం 80 శాతానికన్నా ఎక్కువే ఉంది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 90 శాతం, మహబూబ్‌నగర్‌లో 88.02, వనపర్తిలో 86.85 శాతం మంది తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమచేయవద్దని చెప్పారు.

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు చెక్కులకు నో
సగటున రాష్ట్రవ్యాప్తంగా 31.58 శాతం మంది చెక్కు ఇవ్వమని అడిగినా దీనిని తిరస్కరించినవారూ కొన్ని జిల్లాల్లో ఎక్కువే. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 89.40, నిర్మల్‌లో 86.11, పెద్దపల్లిల్లో 81 శాతం మంది చెక్కు రూపంలో వద్దని గట్టిగా చెప్పారు. నగదు పంపిణీని తిరస్కరించినవారు సైతం కొన్ని జిల్లాల్లో ఎక్కువగానే ఉండటం అధికారులను ఆశ్చర్యపరిచింది. కరీంనగర్లో 93.40, సిరిసిల్లలో 91.67 శాతం మంది రైతులు నగదు ఇవ్వవద్దని చెప్పారు. ఈ జిల్లాల్లో చెక్కును ఎక్కువగా అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 26.59 శాతం మంది నగదు రూపేణా అడిగారు.

గ్రామాలకు వెళ్లి రైతులకు పంపిణీ
ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సొమ్మును చెక్కు రూపంలో అందజేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సంఘం సమావేశమైన తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే వానాకాలం నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేస్తామన్నారు. ఎక్కువమంది రైతులు చెక్కు రూపంలోనే సాయం అందజేయాలని కోరారనీ, దీనినే సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామన్నారు. ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాల వరకూ సాయం ఇవ్వాలన్న దానిపై పరిమితేమీ లేదన్నారు. రాష్ట్రంలో 97.2% మంది రైతులకు పది ఎకరాల్లోపే భూమి ఉందన్నారు. అవకతవకలు జరగకుండా పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామన్నారు. బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూసేందుకు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి, రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులతో మాట్లాడతామన్నారు. రెవెన్యూ పత్రాల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో 71 లక్షల మంది రైతులకు 1.42 కోట్ల ఎకరాల సాగు భూములున్నట్లు తేలిందన్నారు.