
మరో బీజేపీ ఎమ్మెల్యేకు షాక్: ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు.. ఎందుకంటే!!
కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై తాజాగా ఓ కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. రాజాసింగ్ కు ఊహించని ఈ పరిణామంతో షాక్ తగిలినట్టయ్యింది. ఇప్పటికే రఘునందన్ రావుపై కేసు నమోదు కాగా ఇప్పుడు రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఒక నిర్దిష్ట సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు మరియు మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల రాజా సింగ్ చేసిన వీడియో సందేశంలో ఒక ప్రముఖ మతానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యేపై ఫిర్యాదు నమోదైంది. ఆయన మాట్లాడిన ఒక వీడియోలో హిందువులు దర్గాలకు వెళ్లకూడదని ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ రాజును అవమానించిన చోటుకు హిందువులు ఎందుకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఇక రాజా సింగ్ వ్యాఖ్యలపై హిందూ మత పెద్దలు చేసిన ఫిర్యాదు మేరకు, ఆయన వ్యాఖ్యలు మత విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని ఐపిసి సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

రాజాసింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న తర్వాతనే ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశామని ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నూపుర్ శర్మ ని సస్పెండ్ చేసినట్లు రాజాసింగ్ ను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు తేల్చి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై ఆమ్నీషియా పబ్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో వీడియోలను రిలీజ్ చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు మళ్లీ మత విశ్వాసాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.