పవన్ కళ్యాణ్-జూఎన్టీఆర్ని వాడుకోవడం తప్ప: బాబుపై తలసాని, రేవంత్‌కు వార్నింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం మరోసారి మండిపడ్డారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు.
సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు చాలా సంతోషం కానీ, తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో, ఎంత చేశారో చెప్పాలని సవాల్ చేశారు.
సినీ పరిశ్రమలోని ప్రముఖులను తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నారన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణను ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని విపక్షాల పైనా ఆయన మండిపడ్డారు. పండుగలు, పబ్బాలపై కూడా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్ పండుగల్లో వేటిని ప్రభుత్వం నిర్వహించినా వివాదం చేస్తున్నారన్నారు.

ఇవన్నీ సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్న పండుగలన్నారు. పండుగలను ప్రభుత్వం నిర్వహించ కూడదా అని ప్రశ్నించారు. తెలంగాణలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా పరిష్కరించాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వాళ్లు పండించిన ధాన్యాన్ని దాచుకోవడానికి ప్రతీ మండలానికో గిడ్డంగిని నిర్మిస్తున్నామన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయన్నారు.
టీడీపీ నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాము ఊరుకున్నా ప్రజలు, వ్యవస్థ తిరగబడతారన్నారు.
నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటవద్దని, టీవీల్లో కనిపిస్తామని గింతగింతోడు కూడా అడ్డందుడ్డంగా మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు తెలంగాణ సమస్యలే కనిపిస్తాయి కానీ, ఏపీలోని పట్టిసీమ కనిపించదా అన్నారు.
ఒకాయన పత్రిక చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్టు కూస్తున్నాడని, ముందు ఆయన చరిత్ర చూసుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వ పథకాలపై అనుమానాలుంటే ప్రతిపక్షాలు చెప్పాలి కానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.