ఎమ్మెల్సీ కవిత పేరుతో రూ. 6.5 లక్షల టోకరా: ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి ఇద్దరు యువకులు ఓ వ్యక్తికి రూ. 6.5 లక్షల టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణానికి చెందిన మహేశ్ గౌడ్, వినోద్ అనే యువకులు ఎమ్మెల్సీ కవిత పేరుతో న్యూస్ ఛానల్ పెడుతన్నామని మహ్మద్ అలియాస్ స్వామిని నమ్మించారు.
మొదట స్వామి వద్ద నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఛానల్ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి వేరే ఛానల్లో కెమెరామెన్‌గా అవకాశం కల్పిస్తామని మరో రూ. 50 వేలు తీసుకుని ఐడీ కార్డు ఇచ్చారు. ఆపై కవితతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పి రెండు పడక గదుల ఇంటి కోసం మరో రూ. 4 లక్షలు తీసుకున్నారు.


నెలలు గడిచినా డబుల్ బెడ్రూం ఇళ్లు, ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వమనడంతో మరో వారం ఆగాలని కోరారు. దీంతో వీరిద్దరి మోసాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు మహేశ్ గౌడ్, వినోద్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహమ్మద్ ఇటీవల ఖతర్ నుంచి రావడంతో ఎమ్మెల్సీ కవిత శాలువా పంపించారంటూ అతడికి అందజేశారు మహేష్ గౌడ్, వినోద్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధిచిన తాళాలు అంటూ అతడి చేతిలో రెండు తాళం చెవిలి కూడా పెట్టారట.. దీనికి తోడు ఎమ్మెల్సీ కవితతో సీక్రెట్ గా మాట్లాడ వచ్చంటూ వాకీటాకీ కూడా అందజేశారట.. ఇదంతా మోసం అని గ్రహించిన మహమ్మద్ చివరకు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
లంచం తీసుకున్న రూ. 6 లక్షల తగలబెట్టేశారు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో లంచం డబ్బులు తగలబెట్టిన మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు, తహసీల్దార్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలో క్రషర్ ఏర్పాటుకు తహసీల్దార్ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. వాటిని మధ్యవర్తిగా ఉన్న మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటాయ గౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. ఈ క్రమంలో కల్వరుర్తిలోని విద్యానగర్‌లో ఉన్న తన నివాసం వద్ద వెంకటాయగౌడ్ నగదు తీసుకున్నారు. అయితే, ఇదంతా ఏసీబీ అధికారులు చూస్తున్నారనే విషయాన్ని గ్రహించిన వెంకటాయగౌడ్ వెంటనే తన ఇంట్లోకి వెళ్లి లంచగా తీసుకున్న రూ. 6 లక్షల నగదును కాల్చివేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక హైదరాబాద్ ఎల్బీనగర్లోని తహసీల్దార్ సైదులు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.