అలాంటివాడు దండనీయుడు.. ప్రభుత్వం ఏమైపోయినట్లు.. 'రామతీర్థం'ఘటనపై చిన్నజీయర్ సంచలన వ్యాఖ్యలు...
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు,రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. జగన్ పాలన చూసి ఓర్వలేకనే ఆలయాలపై దాడులతో టీడీపీ కుట్రలకు తెరలేపిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సున్నితమైన మత అంశంపై చెలరేగుతున్న ఈ దుమారం ఏపీలో రాజకీయాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చివేసింది. హిందూ సంఘాలు కూడా ఈ దాడులపై భగ్గుమంటుండగా... తాజాగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఈ వివాదంపై స్పందించారు.

ప్రభుత్వాలు ఎక్కడున్నాయో తెలియదు... : చిన్నజీయర్
'దేవుడు విగ్రహ రూపంలో వచ్చింది మనకోసం... రెండు రోజుల క్రితం విజయనగరంలోని రామతీర్థంలో రాముడి విగ్రహం తీసేశారు... కాపాడాల్సిన ప్రభుత్వాలు ఎక్కడున్నాయో తెలియదు. చూడాల్సిన రక్షణ వ్యవస్థ ఏమైపోయిందో తెలియదు. దానికోసం పెద్ద డిపార్ట్‌మెంట్ ఉంది... అందులో కొందరు మనుషులు ఉన్నారు... వాళ్లంతా దానికోసమే ఉన్నారు... దాని పైనే బతుకుతున్నారు... దాని నుంచే జీతాలు తీసుకుంటున్నారు.. మరి ఆ వ్యవస్థంతా నిద్రపోయిందో ఏమో తెలియదు...' అని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు.

అలాంటివాడు దండనీయుడు : చిన్నజీయర్
'మనకోసం విగ్రహ రూపంలో వచ్చిన దేవుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది... మన బతుకు ఎలా ఉందంటే... మా ఇంటికొస్తే నువ్వేం తెస్తావు.. మీ ఇంటికొస్తే ఏమిస్తావన్నట్లుగా తయారైంది. మనం కోరుకుంటే మన మధ్య ఉండి మన అవసరాలను తీర్చేందుకు ఆయన విగ్రహ రూపం ధరించి వస్తే... ఆయన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. వచ్చింది మన కోసం గనుక ఆ బాధ్యతను తీసుకోవాలి. అలా చూడకపోతే వాడు ఆ బాధ్యతను విస్మరించాడని అర్థం. అలాంటివాడు దండనీయుడు... వాడిని మనం దండించాలని అర్థం.' అని చిన్నజీయర్ అభిప్రాయపడ్డారు.

మెజారిటీలు ఎక్కడ పోయినా ఫర్వాలేదన్నట్లుగా.. : చిన్నజీయర్
'దేవుడు విగ్రహ రూపంలో వచ్చింది మనకోసం... ఆయన మాట్లాడితే,కదిలితే నువ్వు భయపడిపోతావు గనుక మాట్లాడట్లేదు,కదలట్లేదు. నీకే శ్రద్ద లేకపోతే ఆయనేం చేస్తాడు. ఆయనకు చేతగాక కాదు. అవసరమైతే చేసుకోగలడు.కానీ నీ శ్రద్ద ఎంత ఉందో నీకు తెలియాలి. వద్దనుకుంటున్నావనుకో దూరంగా ఉండాలి. పట్టుకుంటానని పాడు చేసే ప్రయత్నం చేయకూడదు. అందుకు ఆయన విగ్రహంగా వచ్చి ఉంటాడు. ఆ విగ్రహాన్ని రక్షించుకో.. నీకూ మంచిది... సమాజానికి మంచిది.' అని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇప్పటి ప్రభుత్వాలు మైనారిటీలనే కాపాడవలెను.. మెజారిటీలు ఎక్కడ పోయినా ఫర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.