హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి: వచ్చే ఏడాదికి రామానుజ క్షేత్రం(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవత్ రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ప్రధానిని ఆయన ఆదివారం కలిశారు.

త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి చిన్నజీయర్ స్వామి విజ్ఞప్తి చేశారు. వచ్చే సంవత్సరం నవంబర్ 30వ తేదీన 216 అడుగుల ఎత్తయిన రామానుజ పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

ప్రధాని మోడీని కలిసిన చినజీయర్ స్వామి.. 45 నిమిషాల పాటు రామనుజస్వామి విగ్రహ విశిష్టత, ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నిర్మాణమవుతున్న ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాధాన్యం గురించి వివరించారు.

రామానుజుల వారి 1000 సంవత్సరాల జయంతి ఉత్సవాలు 2017లో జరగనున్నాయని, ఈ సందర్భంలో 216 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానితో భేటీ అనంతరం చినజీయర్ స్వామి మీడియాకు తెలిపారు. శంషాబాద్‌లో సమతాముక్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Chinna Jeeyar Swamy meets PM Narendra Modi

సమాజానికి ఇవాళ అవసరమైన దిశానిర్దేశాన్ని వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ప్రపంచానికి అందించారన్నారు. రామానుజాచార్యులు దళితులను తమతో పాటు ఆలయానికి తీసుకెళ్లి, వారందరికీ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఇచ్చారన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే దళితులను లక్ష మందికి సంకల్పం చెప్పి సమతా స్నానం చేయించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. సంస్కారం లేనప్పుడు సకల వేదాలు చదివినా ప్రయోజనం లేదని చినజియర్‌స్వామి చేప్పారు.

100 ఎకరాల విస్తీర్ణంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శ్రీరామనగరం పేరుతో నిర్మాణంలో ఉన్న శ్రీరామానుజ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతిష్ఠాత్మకంగా 216 అడుగుల ఎత్తులో రామానుజ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నామని, దాతల నుంచి ఇప్పటికే రూ.50 కోట్లు సేకరించామని, మిగిలినవాటి కోసం భక్తులకు విజ్ఞప్తి చేశామని ప్రధానికి వివరించారు.

సమతాముక్తి స్ఫూర్తి కేంద్రంగా పిలిచే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో 216 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్న రామానుజ పంచలోహ విగ్రహానికి సమతా విగ్రహం అని పేరు పెట్టినట్లు తెలిపారు. కులం, వర్ణం తదితర భేదాలు లేని సమాజం కోసం రామానుజుడు జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారని, క్రీ.శ. 1017లో తమిళనాడులోని శ్రీపెరంబుదూరు సమీపంలో జన్మించిన రామానుజుడు ఆధ్యాత్మిక స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేశారని వెల్లడించారు.

Chinna Jeeyar Swamy meets PM Narendra Modi

తాము తలపెట్టిన కార్యక్రమాలకు వస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక నాణాన్ని విడుదల చేయాలని కోరామన్నారు. దీనికి కూడా ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు.

దళితులకు ఆలయ ప్రవేశంలో ప్రస్తుతం ఇంకా చాలా ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయని, ఈ కారణంగా హిందువులు వివిధ మతాల్లోకి వెళ్లడం జరుగుతున్నదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దళితులను ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలకు తీసుకువస్తున్నామని తెలిపారు. ఆగస్టు 19న సమతాస్నానం పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు వెల్లడించారు.

కాగా, జీయర్ స్వామి వెంట ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, మైహోం, మహా సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందని, రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని జూపల్లి రామేశ్వరరావు తెలిపారు.

Chinna Jeeyar Swamy meets PM Narendra Modi

రామానుజ క్షేత్ర ప్రత్యేకతలు

శ్రీ రామానుజాచార్యుల విగ్రహం మొత్తం ఎత్తు 216 అడుగులు. విగ్రహం పీఠభాగంలో 36 ఏనుగు బొమ్మలు ఉంటాయి. వాటిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. దీనిలో 54 పద్మరేకులు చిత్రిస్తారు. పీఠంపైన 108 అడుగుల ఎత్తులో రామానుజ విగ్రహాన్ని నెలకొల్పుతా రు. ఆయన చేతిలోని త్రిదండం 135 అడుగులు ఉంటుంది.

రామానుజులవారు తొమ్మిది గ్రంథాలు రచించడంతో దానికి గుర్తుగా అన్నీతొమ్మిది అంకె వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని చైనాలో నాన్జింగ్‌లో తయారుచేయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత విగ్రహాలు తయారుచేసిన చరిత్ర ఆ సంస్థకు ఉంది. ఇందుకు ఐదు టన్నుల పంచలోహాన్ని వినియోగిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా విగ్రహం 200 భాగాలుగా శంషాబాద్‌కు చేరుకుంటుంది.

రామానుజాచార్యుల జీవితాన్ని వివరించేందుకు ప్రత్యేకంగా ఒక ఆడిటోరియంను నిర్మిస్తున్నారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ ఆడిటోరియంలో ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వెయ్యేండ్ల క్రితంనాటి రామానుజాచార్య జీవితాన్ని వర్చువల్ రూపంలో చిత్రీకరించనున్నారు. కాగా, ఈ ఆడిటోరియంలోకి ప్రవేశించగానే.. రామానుజులవారిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగనుంది.

English summary
Chinna Jeeyar Swami has met Prime Minister Narendra Modi in Delhi and he invited the Prime Minister for the 1000 th birth anniversary of Ramanuja Charya Swami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X