వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దూకుడు: కోదండరాం జీరో అవుతారా, ఎవరూ లేరా...

కెసిఆర్ లేకుండా తెలంగాణ సాధ్యమయ్యేదా అంటే, బహుశా కాదనే చెప్పాల్సి వస్తుంది. కానీ తాను తప్ప మరొకరు లేరనే పద్ధతి సరి కాదు. కోదండరామ్ పాత్ర లేదని చెప్పడం సరి కాదు. క్రెడిట్ అంతా తనదేనని వ్యాఖ్యానించడం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

CM KCR Attacks JAC Chairman Professor Kodandaram And Congress Leaders Jana Reddy | Oneindia Telugu

హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు అంతా మంచిగానే కనిపిస్తుంది. పవర్‌లో ఉంటే అవసరార్థం వచ్చే వారు చేసే అనుకూల వ్యాఖ్యలు హాయినిస్తాయి. కానీ తెలంగాణ విషయానికి వస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మలి విడత తెలంగాణ పోరాటంలో దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ ఆందోళనల తర్వాతే 'తెలంగాణ' కల సాకారమైంది.

ప్రత్యేకించి 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన 'తెలంగాణ' ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని అప్పటి కేంద్ర హోంమంత్రి పీ చిదంబరం ప్రకటించిన తర్వాత అనుకూల వాతావరణం నెలకొల్పడంలో టీఆర్ఎస్ అధినేతగా ప్రస్తుత సీఎం కేసీఆర్ ఉద్యమానికి నాయకత్వం వహించారనడంలో సందేహం లేదు.

కెసిఆర్ లేకుండా తెలంగాణ సాధ్యమయ్యేదా అంటే, బహుశా కాదనే చెప్పాల్సి వస్తుంది. కానీ తాను తప్ప మరొకరు లేరనే పద్ధతి సరి కాదు. క్రెడిట్ అంతా తనదేనని వ్యాఖ్యానించడం తెలంగాణ ఉద్యమకారులను చులకన చేయడమే అవుతుంంది తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ ఐకాస, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాల పాత్ర వారికే క్రెడిట్‌గా మిగులుతుంది. కానీ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం తర్వాత సీఎం - టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించిన తీరు వాస్తవాలను దాచిపెట్టేందుకు.. తన ప్రత్యర్థులపై ఎదురు దాడి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తున్నదని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

ఉద్యమంలో ఎవరి క్రెడిట్ వారిదే

ఉద్యమంలో ఎవరి క్రెడిట్ వారిదే

తెలంగాణ ఉద్యమానికి నాయకుడు కేసీఆర్ అన్నది వాస్తవమే. ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదు. కానీ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ జేఏసీతోపాటు ఉద్యోగ సంఘాల జేఏసీ, వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు పాల్గొన్నాయి. ఉద్యమంలో ఆయా శక్తుల పాత్రకు అనుగుణంగా ఎవరి క్రెడిట్ వారికే ఉంటుంది. ప్రత్యేకించి తెలంగాణ రాజకీయ జేఏసీ, దాని చైర్మన్‌గా కోదండరాం పాత్ర పేర్కొనదగిపదనడంలోనూ సందేహానికి తావు లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కనుక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో, జేఏసీ తరఫున సబ్బండ వర్ణాల్లో రాజకీయ, సామాజిక వేడి రగల్చడంలో ముఖ్య పాత్ర పోషించిన కోదండరాం పాత్ర, ఆయనకు గల క్రెడిట్ అలాగే ఉంటుంది. కానీ ఆ క్రెడిట్‌ను బలవంతంగా లాగేసుకోవాలని ఎవరైనా ప్రయత్నించినా వారికే ఎదురు తిరుగుతుంది సుమా. CM KCR & Kodandaram

దాదాపుగా అన్ని పార్టీలకూ, సంఘాలకు జేఏసీలో చోటు

దాదాపుగా అన్ని పార్టీలకూ, సంఘాలకు జేఏసీలో చోటు


2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించిన కేంద్రం తర్వాత వెనుకడుగు వేసింది. కేంద్రం మడత పేచీలను నిలదీసేందుకు ఏర్పాటైన తొలి జేఏసీకి అసెంబ్లీలో ప్రస్తుత విపక్ష నేత జానారెడ్డి, తర్వాత తెలంగాణ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగాలన్న సదుద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఏర్పాటైంది. ప్రారంభంలో జేఏసీలో దాదాపు అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉన్నది. తర్వాతర్వాత టీడీపీ బయటకు వెళ్లిపోయింది. అది వేరే సంగతి. 2010 ప్రారంభంలో కేంద్రం.. తెలంగాణ ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న విషయమై జస్టిస్ శ్రీక్రుష్ణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఒకింత స్తబ్దత ఏర్పడింది.

ఉద్యమ వేడిని రగిల్చిన మిలియన్ మార్చ్

ఉద్యమ వేడిని రగిల్చిన మిలియన్ మార్చ్

తదుపరి ఎలా ముందుకెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో రాజకీయం నాయకత్వం ఉన్నప్పుడు తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం ‘మిలియన్ మార్చ్'కు పిలుపునిచ్చారు. 2010లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయమై చేష్టలుడిగి నిమ్మకుండిపోయినప్పుడు ‘మిలియన్ మార్చ్‘కు పిలుపుతో తెలంగాణ వాదుల్లో రాజకీయ ప్రేరణ కలిగించింది జేఏసీ. తీరా మిలియన్ మార్చ్ అంతా సజావుగా ముగుస్తుందనగా ఒక బ్యాచ్ ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ పై ప్రస్తుత సీఎం కేసీఆర్ అభిమాన నాయకుడు.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన విగ్రహాలను ఇష్టానుసారం కూల్చేసింది. ఇప్పటికీ ఆ విగ్రహాలను కూల్చేసిందెవ్వరన్న విషయం బయటకు రాలేదు. కానీ కేసులు మాత్రం సంధ్య, సీపీఐఎంఎల్ పీపుల్స్ డెమొక్రసీ పార్టీ నేతలపై నమోదయ్యాయి. ఇలా మిలియన్ మార్చ్ నిర్వహణ ద్వారా తెలంగాణ ఉద్యమ వేడిని సజీవంగా నిలుపడంలో జేఏసీ, దాని చైర్మన్‌గా కోదండరాం ఎంతో కీలక పాత్ర పోషించారనడంలో సందేహాలకు తావు లేదు.

కోదండరాం ఇలా వ్యూహాత్మకంగా

కోదండరాం ఇలా వ్యూహాత్మకంగా

తర్వాతీ దశలో నెక్లెస్ రోడ్డు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాగరహారం' ఎంతో విజయవంతమైంది. కానీ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా డుమ్మా కొట్టిన నేపథ్యం టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత సీఎం కేసీఆర్‌ది. అయినా ఇతర పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాగర హారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి, నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరిన నేపథ్యం ఎవరూ మరిచిపోలేనిది. వాస్తవాలిలా ఉంటే అధికారం అండగా ఉన్నదన్న భావనతో ‘సాగరహారం'తోపాటు అన్ని కార్యక్రమాలను టీఆర్ఎస్ జయప్రదం చేసిందని ప్రకటిస్తే విజ్నులు హర్షించరని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

సమ్మెలో 45 రోజులు ఇలా ఉద్యోగులు

సమ్మెలో 45 రోజులు ఇలా ఉద్యోగులు

ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికే హైలెట్ సకల జనుల సమ్మె. దీనికి సన్నాహకంగా కొన్ని నెలల పాటు వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో నిరంతర చర్చలు, సంప్రదింపులతో వ్యూహ రచన జరిగింది. ఆ వ్యూహ రచనలో జేఏసీ చైర్మన్ కోదండరాం ఎంతో బిజీబిజీగా నిమగ్నమయ్యారు. కానీ అప్పుడు కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సకల జనుల సమ్మె సందర్భంగా జరిగిన ఆందోళనల్లో ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, జూపల్లి క్రుష్ణారావు తదితరులు మాత్రమే సకల జనుల సమ్మె సందర్భంగా జరిగిన ఆందోళనా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. దాదాపు 45 రోజుల పాటు నిర్విఘ్నంగా జరిగిన సకల జనుల సమ్మె ఇటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి సుతిమెత్తని హెచ్చరికగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ సకల జనుల సమ్మెలో తెలంగాణలోని అన్ని శాఖలు, సంస్థల ఉద్యోగులు స్వచ్ఛందంగానే పాల్గొన్నారు.

వ్యూహ రూపకల్పనలో ఇలా టీఆర్ఎస్

వ్యూహ రూపకల్పనలో ఇలా టీఆర్ఎస్


2010 తర్వాత తెలంగాణ జేఏసీ వివిధ ఆందోళన కార్యక్రమాలతో రాజకీయ వేడి, ప్రేరణ యధాతథంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటే.. రాజకీయ వ్యూహాల రూపకల్పనలో.. నిమగ్నమైన నేపథ్యం టీఆర్ఎస్ అధి నాయకత్వానిది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత తెలంగాణలో ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, రాజకీయంగా ఉప ఎన్నికల వాతావరణం కల్పించి.. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకున్నారు తప్ప.. జేఏసీకి సమాంతరంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

2006, 2008ల్లో ఇలా ఉప ఎన్నికలు

2006, 2008ల్లో ఇలా ఉప ఎన్నికలు

2001లో టీఆర్ఎస్ స్థాపించిన కొన్ని నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్నది. 2002లో సిద్దిపేట అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెర వెనుక చర్చలే తప్ప 2004 వరకు టీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణే లేదు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 5 లోక్ సభ స్థానాలు, 25 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ రెండుచోట్ల క్యాబినెట్‌లో చేరింది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం తాత్సారం చేయడం, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకత కారణంగా 2006లో ఉద్యమ వేడి రగిల్చేందుకు కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికను ముందుకు తెచ్చారు. వైఎస్ వంటి బలమైన నేత ప్రచారాన్ని ఎదుర్కొని నిలిచిన టీఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ 2008లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో సగం స్థానాలను కోల్పోయింది. నాడు టీఆర్ఎస్ నాయకత్వంపైనే తిరుగుబాటు జరుగుతుందా? అన్న రీతిలో పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అంతర్గత సమస్యలు సద్దుమణిగిన తర్వాత.. ఈనాడు వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు.

2014 ఫిబ్రవరి తర్వాత వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు

2014 ఫిబ్రవరి తర్వాత వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రం ఏర్పాటుచేస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని పదేపదే హామీలు గుప్పించారు. కానీ తర్వాత ఫ్లేట్ ఫిరాయించారు. 2014 ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. తొలి నుంచి తెలంగాణను వ్యతిరేకించిన కొండా సురేఖ.. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ లో చేరి వరంగల్ తూర్పు స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర పడిన తలసాని శ్రీనివాస యాదవ్, టీడీపీలో ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వర్ రావును టీఆర్ఎస్ లో చేర్చుకుని తన క్యాబినెట్‌లో మంత్రి పదవులు కల్పించిన నేపథ్యం సీఎం కేసీఆర్‌ది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఒత్తిడి ప్రారంభించడం సీఎం కేసీఆర్‌కు, అధికార టీఆర్ఎస్ పార్టీకి కంటగింపుగా మారింది. వివిధ దశల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోదండరాంపై విమర్శలు గుప్పించినా.. సీఎం కేసీఆర్ స్పందించలేదు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర పేరుతో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కోదండరాం పర్యటనలు.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ ఆందోళనలో భాగస్వామి కావడం సీఎం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది.

ఇలా కోదండరాం ఇంట్లో విధ్వంసం

ఇలా కోదండరాం ఇంట్లో విధ్వంసం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని బహిరంగ సభకు పిలుపునిచ్చిన కోదండరాంను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించడానికే పరిమితం కాలేదు. ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేసి విధ్వంస కాండ స్రుష్టించారు. దీనిపై రెడ్డి సామాజిక వర్గంలో కాక రేపింది. కాల క్రమేణా రెడ్లలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రెడ్డి హాస్టల్ విస్తరణకు భూమి, భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు తదితర పరిణామాల తర్వాత ఒక టీవీ చానెల్‌లో పాల్గొన్న వక్తలు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, నీటి పారుదల సంస్థ చైర్మన్ ప్రకాశ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్.. రెడ్డి సామాజిక వర్గంపై దాడి చేసి.. వారే అంతా కుట్ర చేస్తున్నారన్న వాతావరణం కల్పించేందుకు పూనుకున్నారు. పదేపదే అధికారం కోసం కుట్ర చేస్తున్నదని ‘రెడ్డి' సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం ఆయా సామాజిక వర్గానికి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నా సదరు సామాజిక వర్గం అడ్డుకుంటున్నదన్న వాతావరణం కల్పించేందుకు విఫలయత్నం చేశారు. ఈ చర్చాగోష్టిలో రాష్ట్రంలోని సామాజిక వర్గాల్లో కమ్మలు 20 లక్షల మంది ఉన్నారని భవిష్యత్ వ్యూహాలను బయటపెట్టడం గమనార్హం.

కిరణ్ కుమార్ పాలన పేరుతో సీఎం కేసీఆర్ ఇలా దబాయింపు

కిరణ్ కుమార్ పాలన పేరుతో సీఎం కేసీఆర్ ఇలా దబాయింపు

తాజాగా సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ కు ఓటేయొద్దని కోదండరాం పిలుపునివ్వడమే సీఎం కేసీఆర్ కు కోపం తెప్పించినట్లుంది. అందుకే సింగరేణి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నేరుగా కోదండరాం లక్ష్యంగా విమర్శలకు పూనుకున్నారు. అదే క్రమంలో కులాల సమీకరణాల గురించి సీఎం హోదాలో ఉన్న నేత మాట్లాడటం హుందాగా కనిపించడం లేదని అంటున్నారు. ఆ క్రమంలోనే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపైనా దాడి పెంచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పైసా ఇవ్వనంటే ఏం చేశారని దబాయింపులకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నదనే తెలంగాణ కల సాకారం చేసుకుని మూడేళ్లయిన తర్వాత కూడా పాతకథను తిరగదోడటం తాను ఇచ్చిన హామీల అమలు నుంచి, తన పాలన తీరు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది.

వివిధ సంక్షేమ పథకాల అమలులో సాచివేత ధోరణి ఇలా

వివిధ సంక్షేమ పథకాల అమలులో సాచివేత ధోరణి ఇలా

అందునా రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. రాష్ట్రంలోని మిగతా సామాజిక వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలను అక్కున జేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి కేటాయింపు పథకం ‘పంచ పాండవుల్లా మంచం కోళ్లు...' అన్న చందంగా వేలల్లో అర్హులు ఉంటే మూడేళ్ల కాలంలో పంపిణీ చేసింది రెండంకెల్లోపే. ఇక కల్యాణలక్ష్మి పథకం అమలు మాటెలా ఉన్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో సాచివేత ధోరణి రాష్ట్ర ప్రజలందరిలోనూ వ్యతిరేకతను తెచ్చి పెడుతుందన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే కుల వ్రుత్తులకు ప్రోత్సాహం పేరుతో గొల్లకుర్మలకు గొర్రెలు, మేకల పంపిణీ చేపట్టారు. మత్స్యకారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చెరువుల్లో చేపల పెంపకం ప్రారంభించారు. తాజాగా మహిళా లోకాన్ని అక్కున చేర్చుకునేందుకు బతుకమ్మ పండుగ సందర్భంగా చేపట్టిన చీరల పంపిణీ పథకం అట్టర్ ప్లాపయిందని దాని అమలు తీరు, దానిపై మహిళల నిరసన తీరే తెలియజేస్తున్నది.

హద్దు మీరితే చర్యలు తప్పవని ఇలా సీఎం

హద్దు మీరితే చర్యలు తప్పవని ఇలా సీఎం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్ పోస్టులు పెడుతున్నదని, హద్దు మీరితే చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు సీఎం కేసీఆర్. అంటే సోషల్ మీడియా ఉన్నదే ప్రభుత్వ, రాజ్య వ్యవస్థల్లో లోపాలను ఎత్తిచూపి, తమ ఆకాంక్షలను తెలియజేయడానికి. ఆ సంగతి విస్మరించి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోస్టింగ్‌లు, వ్యాఖ్యలపై ప్రతికూలంగా స్పందిస్తే ఎలా? ఇదే సోషల్ మీడియాలో 2014కు ముందు తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రం ఏర్పాటు కోసం సబ్బండ వర్ణాలు పోస్టులు పెట్టాయి. కనుక ఈ పోస్టింగ్ ల్లో సారాంశాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుని, ప్రజానుకూల విధానాలు అమలు జేయడంతో ఉపయోగం తప్ప.. హద్దుమీరితే చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు జారీ చేయడం నియంత్రుత్వ విధానాన్నే సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

భవిష్యత్ రాజకీయ సమీకరణాల వ్యూహం దాగి ఉందా?

భవిష్యత్ రాజకీయ సమీకరణాల వ్యూహం దాగి ఉందా?


ఇటీవల అనంతపురం జిల్లా వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర తనయుడు శ్రీరాం వివాహానికి తెలంగాణ సీఎంగా కేసీఆర్ హాజరయ్యారు. దానిపై ఎవరికీ సందేహాలు, అనుమానాలు లేవు. కానీ తిరుగు ప్రయాణంలో ఏపీలో అధికార టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో రహస్యంగా మంత్రాంగం జరపాల్సిన అవసరమేమిటన్నదే అసలు సమస్య. దాన్ని సహజంగానే తెలంగాణ వాదులు ప్రశ్నిస్తారు. 2009 తర్వాత 2014 వరకూ తెలంగాణకు వ్యతిరేకంగా గట్టిగా ప్రతిస్పందించిన సీమాంధ్ర నేతల్లో ఒకరు పయ్యావుల కేశవ్. ఆయనతో సీఎం కేసీఆర్ రహస్య మంతనాలు చేయాల్సిన అవసరమేమిటని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్తగా సామాజిక సమీకరణాలను అక్కున చేర్చుకోబోతున్నారనడానికి సంకేతమా? అని పలువురు అనుమానిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా కేసీఆర్, నాటి చంద్రబాబు కేబినెట్ నిర్ణయాల్లో కీలక పాత్రధారి. చంద్రబాబు ప్రభుత్వం 1996 - 98 మధ్యే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని రద్దు చేసింది. కానీ ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మొదలు టీబీజీకేఎస్ నాయకత్వం అంతా డిపెండెంట్ ఉద్యోగాల విధానం రద్దు కావడానికి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలే కారణమని పేర్కొనడం వాటిపై బురద చల్లే కార్యక్రమం తప్ప మరొకటి కాదని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

English summary
Telangana CM KCR attacks JAC Chairman professor Kodandaram and Congress leaders Jana Reddy, Uttam Kumar Reddy and Damodhar Raja Narasimha. CM KCR fired on particularly on Kodandaram for his political campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X