రిపేర్ మోడ్ లో సీఎం కేసీఆర్ : కొత్త నిర్ణయాలు..శైలిలోనూ మార్పు : పదవుల భర్తీ - పార్టీలో జోష్..!!
కొద్ది నెలల క్రితం జరిగిన గ్రేటర్.. బై పోల్స్ లో సానుకూల ఫలితాలు రాకపోవటంతో..ముఖ్యమంత్రి కేసీఆర్ రిపేర్ మొదలు పెట్టారు. హుజూరాబాద్ ఎన్నిక ఫలితం తరువాత రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ - ఫాం హౌస్ దాటి బయటకు రారనే విమర్శ ఉండేది. కానీ, కొంత కాలంగా కేసీఆర్ తీరులో మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు..పార్టీ నేతలకు సైతం అందుబాటులో ఉండేవారు కాదనే విమర్శలు వినిపించేవి. కానీ, ఇప్పుడు ఎక్కువగా పార్టీ నేతలకు సమయం కేటాయిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా పెళ్లిళ్లకు హాజరవుతున్నారు.

బై పోల్ తరువాత కేసీఆర్ లో మార్పు
రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ పెద్ద సవాల్ గా మారింది. దుబ్బాక..గ్రేటర్ హైదరాబాద్...హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించింది. కేసీఆర్ వేసే ప్రతీ అడుగు వెనుక వ్యూహం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీని చూసి భయపడి కాదని...పరిస్థితి మరింతగా దిగజారకుండా జాగ్రత్తల్లో భాగంగానే..తన కార్యాచరణ మార్చుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయానికి పరిస్థితులు తనకు అనుకూలంగా మలచుకోవటంతో కేసీఆర్ అనేక వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు.

బీజేపీతో ప్రధాన పోటీగా భావిస్తున్నారా
తాజాగా.. ఎమ్మెల్సీల నియామకంలోనూ కేసీఆర్ భవిష్యత్ రాజకీయాలకు పరిగణలోకి తీసుకొని సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసారు. ఇక, ఈ మధ్య కాలంలో వివాహాలు..పరామర్శలకు ముఖ్యమంత్రి ఎక్కువగా హాజరయ్యారు. ఇక, తెలంగాణలో తన పార్టీకి బీజేపీ పోటీగా మారుతుందని గుర్తించిన కేసీఆర్.. ముందుగా ఆ పార్టీని తెలంగాణలో రాజీకయంగా దెబ్బ తీయటం పైన వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా.. తొలి సారి కేంద్రానికి వ్యతిరేకంగా వరి సేకరణ సమస్య పైన ధర్నా చేసారు. తాను మాత్రమే కాకుండా.. వేదిక పైన పలువురు మాట్లాడే అవకాశం ఇచ్చారు.

సంస్థాగత మార్పుల పై ఫోకస్
కేసీఆర్ శైలిలో వచ్చిన మార్పులు గమనిస్తే..రానున్న రోజుల్లో ఆయన పార్టీ పరంగా..సంస్థాగతంగా మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని గులాబీ పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.గత నెల చివర్లో, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇద్దరు సీనియర్ టీఆర్ఎస్ నేతలు పార్టీని వీడారు. వారిలో ఒకరైన కరీంనగర్ మాజీ మేయర్ ఎస్. రవీందర్ సింగ్ రాజీనామా చేస్తున్న సమయంలో కేసీఆర్కు ఉద్వేగభరితమైన గమనికను రాశారు, కొంతమంది "అహంకార" నాయకుల వైఖరి పార్టీ పనితీరును ఎలా దెబ్బతీస్తుందో ఎత్తి చూపారు. ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించడంతో సింగ్ పార్టీని వీడారు.

విమర్శలకు సమాధానంగా కొత్త శైలితో
రాజీనామా చేసిన మరో నేత గట్టు రామచంద్రరావు, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీని వీడారు. పార్టీని వీడి వెళ్లే సమయంలో అహంకార ధోరణి గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇక, మంత్రి పదవి నుంచి బహిష్కరణకు గురైన ఈటల..హుజూరాబాద్ లో గెలిచి..కేసీఆర్ కు సవాల్ గా నిలిచారు. దీంతో..ఇప్పుడు రానున్న రోజుల్లో కేసీఆర్ వ్యవహార శైలి.. నిర్ణయాల్లో మరింత మార్పులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.