కేబినెట్ ప్రక్షాళనకు కేసీఆర్ ఫిక్స్ : కేటీఆర్ ఇన్..హరీష్ డౌట్ : నలుగురు మంత్రులు ఔట్..!!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. వారంలోగా కేబినెట్ విస్తరణ కాదు..ప్రక్షాళన ఖాయమని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దీని పైన తుది కసరత్తు చేస్తున్నట్లు వివ్వసనీయ సమాచారం. ఇందుకు సెప్టెంబర్ 4వ తేదీ ముహూర్తం గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవటం ఖరారు అయింది. అదే విధంగా హరీష్ కు ప్రాధాన్యత తగ్గుందనే భావన ఎక్కువ కాలం కొనసాగించకూడదని భావించి..ఆయన్ను కూడా కేబినెట్ లోకి తీసుకొని కీలక పోర్టు ఫోలియో కట్టబెట్టే విధంగా అడుగులు వేస్తున్నారని కొందరు చెబుతుంటే..మరి కొందరు ముఖ్య నేతలు మాత్రం హరీష్ కు మంత్రి పదవి డౌట్ అని చెబుతున్నారు. అయితే..ప్రస్తుత మంత్రుల్లో నలుగురి పదవుల మీద కత్తి వేలాడుతున్నట్లుగా సమాచారం. ఇక, మహిళా మంత్రి లేని కేబినెట్ గా విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో..ఇద్దరు మహిళలకు ఛాన్స్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమాచారంతో ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీలో రాజకీయంగా హడావుడి మొదలైంది.

కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందు కోసం ఆయన సెప్టెంబర్ 4 లేదా 12 వ తేదీలను పరిశీలించారని..అందులో సెప్టెంబర్ 4వ తేదీ నాడే కేబినెట్ విస్తరణ...ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న నలుగురు మంత్రులను తప్పిస్తారని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో ఒక సీనియర్ మంత్రి పేరుత సైతం వినిపిస్తోంది. అయితే ఉద్యమం నాటి నుండి కేసీఆర్ కు విధేయుడిగా ఉంటూ.. గత టర్మ్ లో బాగా పని చేసారనే పేరున్న ఆ మంత్రిని తప్పిస్తారా లేదా అనేది సందేహమే. అదే సమయంలో సామాజిక.. జిల్లాల సమీకరణాలు..భవష్యత్ రాజకీయాలను పరిగణలోకి తీసుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కేబినెట్ స్థానం దక్కని మహిళలకు..అదే విధంగా ఎస్టీ, మున్నూరు కాపు, కమ్మ సామాజిక వర్గాలు, ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. తాజా విస్తరణలో వీటిని పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం కేబినెట్ కొత్తగా ఆరుగురికి అవకాశం ఇచ్చే విధంగా వెసులుబాటు ఉంది. ప్రచారం జరుగుతున్నట్లుగా నలుగురిని తప్పిస్తే మొత్తంగా 10 మందికి అవకాశం దక్కనుంది. అయితే, ప్రస్తుతం ప్రక్షాళన దిశగా కేసీఆర్ ఉన్న వారిలో కొందరి పైన వేటు వేస్తారా లేక కొత్త వారికి చోటు ఇవ్వటానికి కేబినెట్ విస్తరణగా చేపడుతారా అనేది తేలాల్సి ఉంది.

కేటీఆర్ కు స్థానం ఖాయంగా...
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. సహజంగానే ప్రజల సమస్యలపై స్పందించడంలో చురుగ్గా ఉండే కేటీఆర్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రొటోకాల్ అడ్డం వస్తోంది. గతంలో ఆయన నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ తదితర శాఖలు ఇప్పుడు సీఎం కేసీఆర్ వద్దే ఉన్నాయి. ఆయా శాఖలకు సంబంధించి లోగడ కేటీఆర్ పనితీరుతో సంతృప్తి చెందినవారు ఇప్పుడు కూడా ఆయననే మంత్రిగా భావిస్తూ సంప్రదిస్తున్నారు. దీంతో..తాజాగా సీఎం కేసీఆర్ కూడా కేటీఆర్‌ను కేబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారనే సమాచారం మేరకు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనను మంత్రిని చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగానే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా కేటీఆర్‌ను ప్రభుత్వంలో చూడాలని ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇక, పార్టీ పరంగా గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. గత ఎన్నికల్లో సమర్ధవంతంగా పని చేసిన కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మేలు జరుగుతుందనేది తాజా ఆలోచన. ఇక, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఐటీకి మంత్రి లేకపోవటం చర్చకు కారణమైంది. తిరిగి కేటీఆర్ కు ఐటీ శాఖ అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది.

హరీష్ కు డౌట్... మిగిలిన లిస్టులో...
రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత హరీష్ కు కేబినెట్ లో స్థానం దక్కలేదు. కేటీఆర్ కు పార్టీ కీలక పదవి ఇచ్చి..హరీష్ కు ప్రాధాన్యత ఇవ్వపోవటం పైన పలు చర్చలు విమర్శలు మొదలయ్యాయి. అయితే, హరీష్ మాత్రం కేసీఆర్ మీద తన విధేయత ప్రదర్శిస్తూనే ఉన్నారు. దీంతో..ఇప్పుడు తన కుమారుడుతో పాటుగా హరీష్ ను కేబినెట్ లోకి తీసుకోవాలనే విషయం పైన కేసీఆర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. హరీష్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇక, తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి చోటిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ నుంచి ప్రస్తుతం జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. అదే జిల్లా నుంచి గుత్తాను తీసుకుంటే, ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవుతారు. దీనిని ఎలా సర్దుబాటు చేస్తారు అనేది తేలాల్సి ఉంది. కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదనే విమర్శలపై సీఎం కేసీఆర్ ఒక సందర్భంలో అసెంబ్లీలో స్పందిస్తూ, ఈసారి ఒక్కరు కాదు.. ఇద్దరు మహిళలను కేబినెట్లోకి తీసుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు సబిత, సత్యవతి రాథోడ్‌ను కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. సత్యవతిని తీసుకుంటే, మహిళా కోటాతోపాటు ఎస్టీ కోటా కూడా కలిసి వస్తుంది. తొలి ప్రభుత్వంలో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి జోగు రామన్న మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక, సండ్ర వెంకట వీరయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు చోటుతో ఇటు మాదిగలకు చోటు ఇచ్చినట్టే కాకుండా.. ఖమ్మం జిల్లాకూ ప్రాతినిధ్యం లభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. అయితే, కేసీఆర్ ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.