• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దమ్ముంటే బేగంపేట రా, ఆ పేపర్ తెస్తే రాజీనామా చేస్తా: ఉత్తమ్‌కు కేసీఆర్ సవాల్ (వీడియో)

By Nageshwara Rao
|

హైదరాబాద్: మహారాష్ట్ర ఒప్పందం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకుని హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేటలో సీఎం కేసీఆర్‌కు మంత్రులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయ‌న ర్యాలీ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఒకనాడు ఒక్కొక్క బొట్టు నీటి కోసం ఎంతో క‌ష్టప‌డ్డామ‌ని అన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం పచ్చగా, సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ ఒప్పందం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.

వ‌ర్షాలు రాక పంట‌లు ఎండిపోతున్నాయని, వ‌ర్షాల కోసం ముక్కోటి దేవుళ్ల‌కు రైతులు మొక్కుతున్నారని కేసీఆర్ అన్నారు. ఎంతో సంయ‌మ‌నం పాటించి ఒప్పందం చేసుకున్నామ‌ని అన్నారు. రైతులు వ‌ర్షం కోసం ఇక‌పై ఆకాశంవైపు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌బోద‌ని ఆయ‌న అన్నారు.

CM KCR reached begumpet airport and speech in begumpet airport

రైతులు సంబురాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ సన్నాసులు మాత్రం నల్లజెండాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. దానికి అవసరమైన పరిజ్ఞానం ఉండాలి. రంగారెడ్డి జల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్లు పరిపాలించారు. తమ్మిడిహట్టిపై 152 మీటర్లు ఒప్పందం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, ఆ ఒప్పందాన్ని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తాను ఒక అరగంట పాటు బేగంపేట విమానాశ్రంలోనే ఉంటానని, దమ్ముంటే ప్రాజెక్టుని సంబంధించిన పత్రాలను తీసుకుని రావాలని కేసీఆర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

తాను తప్పని నిరూపిస్తే బేగంపేట నుంచి ఇటే రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పిస్తానని అన్నారు. తమ్మడిహట్టి ప్రాజెక్టు 2008లో ప్రారంభమైతే, 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు సంవత్సరాల్లో ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా ఎందుకు తవ్వలేదని ప్రశ్నించారు.

మల్లన్నసాగర్‌ దగ్గర డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆంధ్రాతో తెలంగాణకు కలిపిందే కాంగ్రెస్సేనని నందికొండను నాగార్జునసాగర్‌గా మార్చి అన్యాయం చేశారని కేసీఆర్ ఆరోపించారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రజలకు అసత్యాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని అన్నారు. పైరవీలు చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా? మీ తర్వాత టీడీపీ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. 2001లో జూరాల ప్రాజెక్టును మహబూబ్ నగర్‌లో కడితే నీళ్లు నిలుపుకోలేని పరిస్థితిని కల్పించారు.

టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా స్థాపించిన తర్వాత మోకాళ్ల మీద పరిగెత్తి చంద్రబాబు పరిహారం చెల్లించారన్నారు. అదే విధంగా గులాబీ జెండా ఎగిరిన తర్వాతే ఏపీని ప్రశ్నించడంతో సాగర్ ఎడమ కాలవపై జీవోలు జారీ చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. అప్పటి వరకు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఆనాడే మీరు ప్రశ్నిస్తే గులాబీ జెండా ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఎమ్మెల్యేలను రాజశేఖరరెడ్డి ఆగం చేస్తుంటే, చంద్రబాబు పంచన బడి బ్రతికారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై టీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుంటే ఏనాడైనా మద్దతుగా నిలిచారా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో రెండేళ్లుగా అవినీతి రహిత పాలన జరుగతోందని అన్నారు. టీవీ ఛానెల్‌లో కూర్చుని మూడు నాలుగు గంటల్లో ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బండారం మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. రెండు సంవత్సరాలు మౌనంగా ఉన్నానని, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ టీడీపీ నేతలు వాటిని నిరూపించాలని అన్నారు.

లేని పక్షంలో జైళ్లలో చిప్పకూడు తింటారని ఆయన హెచ్చరించారు. లేనిపోని విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, కేసులు పెడతామని ఆయన తెలిపారు. మళ్లీ లేని పోని విమర్శలతో బురద జల్లితే బిడ్డా! జైల్లో చిప్పకూడే మీకు దిక్కు అని ఆయన హెచ్చరించారు.

'కేసీఆర్ జ‌గ‌మొండి, మీలా తోక‌లు ముడ‌వ‌లే. తెలంగాణ కోసం త్యాగాలు, రాజీనామాలు చేసిన పార్టీ టీఆర్ఎస్. ఆరు నూరైనా స‌రే తెలంగాణ రైతులకు నీరందిస్తాం. కాంగ్రెస్‌కి తెలివి లేదు. ఆలోచ‌న లేదు. ఏవేవో వాగుతోంది. ప‌చ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ గోస‌కు కార‌ణం కాంగ్రెసే కార‌ణం. ఒప్పందం వ‌ల్ల ఉప‌యోగం లేక‌పోతే నేను రాజీనామా చేస్తా. ఒప్పందం చేసుకోవ‌డంతో నా గుండెల నిండా ఎంతో సంతోషంగా ఉంది' అని కేసీఆర్ అన్నారు.

'రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్‌కి క‌న‌ప‌డ‌డం లేదు. ఈరోజు తెలంగాణకి పండుగ. తెలంగాణ తెస్తా అని ఆనాడు చెప్పాను, తెచ్చాను. కోటి ఎక‌రాల‌కు నీరందిస్తాన‌ని చెబుతున్నా, తెచ్చి తీరుతా. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ అడ్డువ‌చ్చినా వెన‌క్కి త‌గ్గ‌ను అని అన్నారు. త్వరలోనే బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాకు వస్తా. ప్రజల కష్టాలు తెలుసుకుంటా' అని కేసీఆర్ ఉద్వేగంగా అన్నారు.

English summary
CM KCR reached begumpet airport and speech in begumpet airport at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X