దేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తామన్న కేసీఆర్ .. సస్పెన్స్ పెట్టిన తెలంగాణా సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజానీకమే కాదు, దేశం మొత్తం ఆశ్చర్యపోయే వార్త త్వరలో చెబుతానని పేర్కొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానన్నారు. కేసీఆర్ పడితే మొండిపట్టు పడతాడని ఆయన తన గురించి తాను చెప్పుకున్నారు. ఇక రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు త్వరలో రాబోతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.
కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు .. ప్రారంభించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ ట్వీట్

భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిది .. వారి పిల్లలకు ఉద్యోగాలు
తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ఒక ఉజ్వల ఘట్టం అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక కొండపోచమ్మ సాగర్ కోసం భూములిచ్చిన రైతులకు త్యాగం వెలకట్టలేనిది అని అలాంటి రైతులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక భూములిచ్చిన రైతులకు పిల్లలకు ప్రాసెసింగ్ యూనిట్ లో ఉద్యోగాలు ఇస్తామని,వారి పట్ల తమకు సానుభూతి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎండను సైతం లెక్క చెయ్యకుండా పని చేసిన కూలీలను ఆయన మెచ్చుకున్నారు.

దేశానికి తెలంగాణా వ్యవసాయం ఆదర్శం కావాలన్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతి సాధించామని కేసీఆర్ పేర్కొన్నారు.ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రైతాంగానికి కావాల్సిన సాగునీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం చేయాలని చెబుతున్న వ్యవసాయ విధానం నియంత్రిత సాగు మాత్రమే నియంతృత్వ సాగు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే నియంత్రిత సాగుకు చాలా గ్రామాల నుండి ప్రజల మద్దతు లభిస్తుందని,వేలాది గ్రామాలు తీర్మానం చేశాయని కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు దేశానికి మనం ఆదర్శం కావాలన్నారు తెలంగాణ సీఎం.

మల్టీ స్టేజ్ లిఫ్టింగ్ చాలా కష్టం .. అయినా సాధించాం
530 టీఎంసీల నీళ్లు వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సంతరించుకుందని ఆయన అన్నారు. అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించి మహారాష్ట్ర ఒప్పందం చేసుకుని మరి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని సీఎం తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మల్టీ స్టేజి లిఫ్టింగ్ చేయడం చాలా కష్టమని, ఏ ప్రభుత్వం ఇంత త్వరగా పూర్తి చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం సాధించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లక్ష కోట్ల పంటను తెలంగాణ రైతులు ఒకే ఏడాదిలో పండించే సువర్ణ అవకాశం రానుందని ఆయన అన్నారు.

దేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తా .. వారం ఆగండి
ఇక అంతే కాదు గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టులు త్వరలో పూర్తవుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక దేశమంతా ఆశ్చర్యపోయే విషయం త్వరలో చెబుతానని, మరో వారం రోజుల్లో ఆ విషయం ఏంటో అందరికీ చెప్తానని సస్పెన్స్ పెట్టారు తెలంగాణ సీఎం.