ఖమ్మం, రామాయంపేట ఘటనలపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలి: బండి సంజయ్
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ వద్ద శిబిరంలో మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి అరాచకాలను టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మంలో టీఆర్ఎస్ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ పోరాడారని చెప్పారు. పోలీసుల వేధింపులు తాళలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సాయిగణేశ్ వాంగ్మాలాన్ని పోలీసులు ఎందుకు తీసుకోలేదని సంజయ్ ప్రశ్నించారు. అతడికి ఆత్మహత్య కాదు ప్రభుత్వ మత్యేనని.. పోలీసులు ప్రణాళిక ప్రకారమే చేశారన్నారు.
రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడి ఆత్మాహుతి, కోదాడ అత్యాచార ఘటన, వామనరావు దంపతుల హత్య వెనుక ఉన్నది టీఆర్ఎస్ నేతలేనని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సీఎం కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని, ఆయనే బయటకు వచ్చి వీటిని ఖండించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తరపున న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాగా, సాయిగణేశ్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేతలు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.

ఖమ్మంలో బీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ఖమ్మంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి గణేశ్ ఆత్మహత్యపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సాయి గణేశ్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఆందోళన నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.