తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి పీక్ -టార్గెట్ రేవంత్ : నేతల భేటీ- హైకమాండ్ సీరియస్..!!
తెలంగాణలో కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో ఇరకాటంలో పడింది. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస నిర్ణయాలు..ప్రకటనలతో వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. మరో వైపు బీజేపీ నేతలు ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేస్తూ..పార్టీ అగ్రనేతలను రాష్ట్రంలో పర్యటనలకు తీసుకొస్తూ..టీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకంతో పార్టీలో కొత్త జోష్ వస్తుందని అంచనా వేసిన పార్టీ అధినాయకత్వానికి ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడు పడటం లేదు.

అసమ్మతి రాజకీయాలు
రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా మరి కొందరు నేతలు అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. ఇక, రేవంత్ నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి మంతనాలు చేయటంతో వారిద్దరి మధ్య సంధి కుదిరిందని పార్టీ నేతలు భావించారు. పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓపెన్ గానే రేవంత్ పైన విమర్శలు చేసారు. ఆయన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం తో తాను పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. సీనియర్లు సూచనతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారు. ఇక, గత వారం పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో పార్టీలోని కొందరు నేతలు సమావేశం నిర్వహించారు. పార్టీలోని అందరినీ కలుపుకుపోవటంతో రేవంత్ విఫలమవుతున్నారనే అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తం అయింది.

రేవంత్ లక్ష్యంగా పావులు
ఇక, ఈ రోజు తిరిగి పార్టీలోని అసమ్మతి నేతలు మరోసారి సమావేశానికి నిర్ణయించారు. మర్రి శశిధర్ నివాసంలోనే పార్టీ సీనియర్ నేతలు వీహెచ్ హనుమంతరావు.. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ టార్గెట్ గానే ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. దీంతో..రేవంత్ వర్గం ఏఐసీసీకి సమాచారం అందించింది. ఈ సమావేశం పైన ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఫోన్ చేసారు. పార్టీని ఇబ్బంది పెట్టే సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. సమావేశాలు నిర్వహిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీకి రావాలని..తమతో సమస్యలు చెబితే పరిష్కారాని కి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ మారుతారనే వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయనతో వీహెచ్ భేటీ అయ్యారు. వచ్చే వారం ఢిల్లీలో పార్టీ అధినాయకత్వాన్ని కలిసేందుకు వీహెచ్ అప్పాయింట్ మెంట్ కోరారు.

హైకమాండ్ ఆదేశం.. మాట వింటారా
అయితే, వరుసగా రేవంత్ లక్ష్యంగా పార్టీలోని కొందరు నేతలు సమావేశాలు నిర్వహించటం.. వ్యాఖ్యలు చేయటంతో పార్టీ సమిష్టిగా ముందుకెళ్లే పరిస్థితి తెలంగాణలో కనిపించటం లేదు. దీని పైన కార్యకర్తలు వాపోతున్నారు. టీఆర్ఎస్ - బీజేపీ వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో కాంగ్రెస్ లో ఇంటి పోరుతో అడుగు ముందుకు వేయలేకపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎవరికి వారు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ నేతల సమావేశం మరోసారి పార్టీలో చర్చకు కారణమైంది. ఏఐసీసీ కార్యదర్శి ఫోన్.. హెచ్చరికతో ఈ సమావేశం జరుగుతుందా లేక, రద్దు చేసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.