వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యంగా తెర పైకి 'అద్దంకి' పేరు... పీసీసీ పగ్గాలు,నాగార్జున సాగర్ టికెట్..? కాంగ్రెస్‌‌లో యువ నాయకత్వంపై కొత్త చర్చ..

|
Google Oneindia TeluguNews

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 'కారు' ఢీలా పడ్డ తర్వాత తెలంగాణ భవిష్యత్ రాజకీయంపై రకరకాల విశ్లేషణలు,అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఖతమ్ పట్టించిన కేసీఆర్... చేజేతులా తెలంగాణను బీజేపీకి అప్పగిస్తున్నాడన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం తమ కాళ్ల కింద పునాదులనే కదిలిస్తుందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి ఒకరి బలహీనతలతో పని లేదని... హిందుత్వ ఎజెండానే ఆ పార్టీకి కొండంత బలమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి బీజేపీని ఢీకొట్టాలంటే కమర్షియల్ పాలిటిక్స్ కాకుండా కల్చరల్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది యువ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని... కాంగ్రెస్ లాంటి పార్టీల్లో యువకులకు పగ్గాలు అప్పగిస్తే దీర్ఘ కాలంలో పుంజుకునే అవకాశం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు బలంగా తెర మీద కనిపిస్తుండగా... మరో పేరు కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా యువనేత...

తెర పైకి అద్దంకి దయాకర్ పేరు...

తెర పైకి అద్దంకి దయాకర్ పేరు...

కాంగ్రెస్ పార్టీ యువ నేత అద్దంకి దయాకర్‌కి పీసీసీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. మొన్నటి దుబ్బాక,నిన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇక పార్టీ ఉనికిలో ఉండాలంటే... మళ్లీ పుంజుకోవాలంటే... యువ నాయకత్వమే దిక్కు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సమకాలీన రాజకీయాల్లో దూకుడు మంత్రమే బాగా పనిచేస్తుండటంతో... అద్దంకి దయాకర్ లాంటి విద్యావంతుడు,వాక్చాతుర్యం,దూకుడు కలగలిసిన నేతకు పగ్గాలు అప్పగించాలని అంటున్నారు. రాష్ట్ర బీజేపీ బీసీ నాయకత్వానికి పగ్గాలు అప్పగించి మంచి ఫలితాలు పొందుతున్నందునా... ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కు పగ్గాలు అప్పగిస్తే బహుజనులను ఆయన కాంగ్రెస్ వైపు ఆకర్షించగలరని అంటున్నారు.

అద్దంకికి ఇవ్వడం సాధ్యమేనా..?

అద్దంకికి ఇవ్వడం సాధ్యమేనా..?

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌పై ఓటమి పాలయ్యారు. రెండు సందర్భాల్లోనూ అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో 2,379 ఓట్ల తేడాతో,2018లో 1,847 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఎమ్మెల్యేగా కూడా గెలవని అద్దంకి దయాకర్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించాలనే డిమాండును కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటుందా..అసలు ఇలాంటి డిమాండులు సోషల్ మీడియాను దాటి ఢిల్లీ అధిష్టానం దాకా వెళ్తాయా.. అంటే ప్రతికూల సమాధానాలే బదులవుతాయి. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకుడే సీనియర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పగ్గాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న వేళ... అద్దంకి దయాకర్‌కు పగ్గాలు అప్పగించడమనేది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని మాత్రం చెప్పవచ్చు.

నాగార్జున సాగర్ బైపోల్ టికెట్..?

నాగార్జున సాగర్ బైపోల్ టికెట్..?

ఇక ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో తెలంగాణలో మరో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దుబ్బాక,జీహెచ్ఎంసీ దూకుడుతో బీజేపీ నేతలు ఇప్పటికే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దిగ్గజ నేత జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బీజేపీలోకి లాగాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నాగార్జున సాగర్ కాంగ్రెస్ టికెట్‌ను అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు,అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. దుబ్బాకలో ప్రశ్నించే గొంతుక నినాదం రఘునందన్‌కి ఎలా వర్కౌట్ అయిందో... అద్దంకి దయాకర్‌కు కూడా నాగార్జున సాగర్‌‌లో ఆదరణ లభిస్తుందని ధీమాగా చెప్తున్నారు.

యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా?

యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా?

అద్దంకి దయాకర్ మద్దతుదారులు కావొచ్చు,ప్రశ్నించే గొంతులను ఆదరించాలని కోరుకునేవాళ్లు కావొచ్చు... నాగార్జున సాగర్‌లో ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుకోవడం సహజమే. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కి జననరల్ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతుందా అన్నది అనుమానమే. దానికి తోడు అద్దంకి మద్దతుదారులు చేస్తున్న ఈ డిమాండు పట్ల అప్పుడే సోషల్ మీడియాలో వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. అది జానారెడ్డి సీటు అని,అక్కడ మరొకరికి అవకాశం ఉండదని ఆయన మద్దతుదారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్న ఒక సంక్షోభ సందర్భానికి దూకుడైన,సమర్థులైన నేతల అవసరముందన్న వాదన ఆ పార్టీలోనే బలంగా వ్యక్తమవుతోంది. అదే సమయంలో అంతర్గత విబేధాలు ఇప్పటికీ ఆ పార్టీని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరుగుతుందా... యువ నాయకత్వానికి ప్రాధాన్యత పెరుగుతుందా అన్నది మున్ముందు వేచి చూడాల్సిందే.

English summary
After GHMC election results again it established that Congress is far away from peoples mindset,there is a demand strongly emerging that Congress should give PCC post to Addanki Dayakar to lead the party in Telangana.And his supporters even demanding congress to give him Nagarjuna Sagar by poll ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X