మంత్రి మల్లారెడ్డికి తగినశాస్తి జరిగింది; టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ల్యాండ్ బ్రోకర్లు: నాయిని ఫైర్
రెడ్ల సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అక్కడినుండి వెళుతున్న క్రమంలో ఆయన కాన్వాయ్ పై నిరసనకారులు దాడి చేశారు. అయితే తనను చంపడం కోసం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే తనపై దాడి జరిగిందని మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి పై పలువురు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి మల్లారెడ్డి కి తగిన శాస్తి జరిగిందని చెబుతున్నారు . తాజాగా అడ్డదిడ్డంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి కి తగిన శాస్తి జరిగిందని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులపై ప్రజలు తిరగబడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు అంటూ పేర్కొన్న నాయిని రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఈ ఘటన పునాది వేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ పై మండిపడిన నాయిని రాజేందర్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తీరని నష్టం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూములను రాజ్యాంగబద్ధంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దీంతో రైతులు తమ పూర్వీకుల నుండి సాగుచేసుకుంటున్న భూములను కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ జీవో ని ఎందుకు రద్దు చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
24 గంటల్లో ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని, రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోరని నాయిని రాజేందర్ రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఉన్నది ఎమ్మెల్యేలు కాదు ల్యాండ్ బ్రోకర్లు అంటూ మండిపడిన నాయిని రాజేందర్ రెడ్డి రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మా నాయకులను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. కార్మికుల నాయకులను జైల్లో పెట్టిన నువ్వు కార్మిక నాయకుడివా అంటూ వినయ్ భాస్కర్ ను నిలదీశారు. మల్లారెడ్డి ఘటన ముందు ముందు మంత్రుల విషయంలో రిపీట్ కాబోతుంది అంటూ నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.