రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ .. ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇటీవల ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న జంగా రాఘవరెడ్డి కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా జ్వరంతో, జలుబుతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు వైద్యం అందించారు. ఆయనకు కరోనా టెస్ట్ నిర్వహించిన వరంగల్ సెంట్రల్ జైల్ కి సంబంధించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం కరోనా సోకడంతో ఆయనను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఒక భూ తగాదా విషయంలో ఒక వ్యక్తిని బెదిరించి చంపేస్తానన్న ఆరోపణలతో నవంబర్ 4వ తేదీన మడికొండ పోలీస్ స్టేషన్లో జంగా రాఘవ రెడ్డి పై కేసు నమోదైంది ఇక అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన జంగా రాఘవరెడ్డిని డిసెంబర్ 31వ తేదీన టేకులగూడెం లోని ఆయన ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు . భూ తగాదా విషయంలో కిడ్నాప్ కు జంగా రాఘవరెడ్డి పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలతో ఇటీవల పోలీసులు ఆయనను అరెస్టు చేశామని ప్రకటించారు.

అయితే జంగా రాఘవ రెడ్డి ని కుట్రపూరితంగా పోలీసులు అరెస్టు చేశారని, రాఘవ రెడ్డి అరెస్టు వెనుక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తముందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. సెంట్రల్ జైలు ముందు జంగా రాఘవరెడ్డి అక్రమ అరెస్ట్ పై నిరసన కొనసాగించి, టిఆర్ఎస్ పార్టీపై, పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు .