కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్.. నేను కోవర్ట్ అయితే రేవంత్ కోవర్టే.. జగ్గారెడ్డి ఫైనల్ వార్నింగ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేలరేగిన "రచ్చ"బండ రగడ ఇప్పట్లో చల్లారేలా కన్పించడంలేదు. టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన టీంను టార్గెట్ చేస్తూ ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ తయారయిందని ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ నంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన తాను కోవర్ట్ అయితే ఆయన్ను కలిసిన రేవంత్ రెడ్డి కూడా కోవర్టే అని దుయ్యబట్టారు.

అభివృద్ధికి నిధులు అడిగితే తప్పేంటి?
ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన ఓ అధికారి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. దీనిని కొందరు పనిగట్టుకోని తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులను నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిధులు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. నియోజవర్గ అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సఖ్యతతో మెలగాల్సిందేనని పేర్కొన్నారు.

నేను కోవర్ట్ అయితే రేవంత్ రెడ్డి కూడా కోవర్టే..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ తయారైందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌ను డిస్టర్బ్ చేస్తున్నది ఆ పిచ్చి అభిమాన సంఘాలవాల్లేనని విమర్శించారు. తాను టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే నేరుగా వెళ్తానని.. తననెవరూ ఆపలేరని చెప్పారు. తనను ఏజెంట్ అనడానికి తీన్మార్ మల్లన్న ఎవరు ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కలిసిన తాను కోవర్ట్ అయితే.. ఆయన్ను కలిసిన రేవంత్ రెడ్డి కూడా కోవర్టే అని దుయ్యబట్టారు. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను అడ్డంగా నరుక్కుంటూ మాట్లాడతా..
తాను ఏపార్టీలోకి మారేది లేదని కాంగ్రెస్ లోనే ఉన్నా.. ఉంటా.. జీవిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరికి బానిస కాదు.. నచ్చనివి మాట్లాడతానన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవసరం వచ్చినప్పుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను అడ్డంగా నరుక్కుంటూ మాట్లాడతానని హాట్ కామెంట్స్ చేశారు. జనవరి 5వ తేది జరిగే సమావేశంలో అన్ని మాట్లాడతానని చెప్పారు. పీసీసీ చీఫ్ కాంగ్రెస్‌కు డ్రైవర్ లాంటివారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కూడా తప్పా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ బలంగానే ఉంది..
కాంగ్రెస్ ఎప్పటి నుండో బలంగానే ఉందని.. ఎవడో వచ్చి పార్టీని లేపాల్సిన పని లేదని రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి చురకలు అంటించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలదే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. వ్యక్తిగత సినిమా చూపిస్తే ఊరుకోమని రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చారు. అధిష్టానానికి కూడా పూర్తి సమాచారం అందకుండా చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.