• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈటల బాటలో కోమటిరెడ్డి?: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డితో భేటీ: తెలంగాణ ఈక్వేషన్లు మారుతాయా?

|

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సరికొత్త రాజకీయ సమీకరణాలకు ఇది దారి తీసేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతి.. పార్టీ ఫిరాయింపుల దాకా వెళ్లే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. నిప్పు లేనిదే పొగరాదనే సామెతను తలపిస్తోన్నాయి. ఎటు తిరిగి.. ఎక్కడికెళ్తాయోననే ఆసక్తిని రేపుతోన్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథ్య బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించడం ఒకరకంగా అసమ్మతి అగ్గిని రాజేసినట్టయింది. సీనియర్లు ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నా.. సమయం కోసం వేచి చూస్తోన్నారని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.

YSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిలYSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిల

ఈటల బాటలో..

ఈటల బాటలో..

భూ ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని మంత్రివర్గం, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వైదొలగిన ఈటల రాజేందర్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరారు. తాను ఇదివరకు ప్రాతినిథ్యాన్ని వహించిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారు. ఆయన బీజేపీలో చేరిన కొద్దిరోజుల్లోనే- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈటల బాటలో నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

జీ కిషన్ రెడ్డితో భేటీ

జీ కిషన్ రెడ్డితో భేటీ

ఈ ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పనిచేసిన జీ కిషన్ రెడ్డికి పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. సహాయమంత్రి స్థానం నుంచి కేబినెట్ హోదాకు ఎదిగారాయన. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం, పైగా పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటాన్ని దృష్టిలో ఉంచుకుని కోమటిరెడ్డి ఆయనను కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. భువనగిరి కోటను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ.. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సి వస్తోందనే వాదనలు వ్యక్తమౌతోన్నాయి.

ప్రత్యామ్నాయంగా బీజేపీ..

ప్రత్యామ్నాయంగా బీజేపీ..

తెలంగాణ పీసీసీ పీఠం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశించిన విషయం తెలిసిందే. ఇది బహిరంగ రహస్యం. రేవంత్ రెడ్డికి బదులుగా తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలంటూ ఆయన స్వయంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యంలో.. ఆయన ఎన్ని పార్టీలు ఫిరాయించారనే విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చిన నేపథ్యం కావడం వల్ల అసలు సిసలు కాంగ్రెస్ వాదులకు పీసీసీ పగ్గాలను అప్పగించాలని, దానికి తాను అర్హుడనీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

అయినా నో..

అయినా నో..

ఇంతా చేసినప్పటికీ.. అధిష్ఠానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గ చూపడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన రోజే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అసలైన కాంగ్రెస్‌వాది కాదంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత... ఆయన తన నిరసన గళాన్ని వినిపించడం తగ్గించారే తప్ప.. పార్టీ నిర్ణయాన్ని సమర్థించట్లేదు. మొన్నటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి.. జీ కిషన్ రెడ్డిని కలవడానికి అటు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది.

English summary
Congress Lok Sabha member from Bhongir Komatireddy Venkat Reddy meets Union minister G Kishan Reddy and submitted a memorandum for development of Bhongir Fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X