
మేడ్చల్ సర్వసభ్య సమావేశంలో మంత్రిని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీటీసీ.. మల్లారెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా నిర్వహించిన మేడ్చల్ మండల సర్వసభ్య సమావేశంలోనూ మల్లారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ వార్ కొనసాగింది. మేడ్చల్ మండల సర్వసభ్య సమావేశం అధికార ప్రతిపక్ష పార్టీ నేతల వాగ్యుద్ధాలతో రసాభాసగా మారింది. ఒకరిని మించి ఒకరు విమర్శలతో సమావేశంలో గందరగోళం సృష్టించారు.
మేడ్చల్ మండల సర్వసభ్య సమావేశంలో డబీల్ పూర్ ఎంపిటిసి హేమలత, మంత్రి మల్లారెడ్డి మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. ఎంపీటీసీ నిధులపై మంత్రి మల్లారెడ్డిని హేమలత నిలదీయడంతో సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. గ్రామాలలో ఎంపిటిసి లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, నిధులు కేటాయించడం లేదని మంత్రి మల్లారెడ్డి ని, కాంగ్రెస్ ఎంపిటిసి హేమలత నిలదీశారు. డబిల్ పూర్, లింగాపూర్, బర్మాజీగూడాలో నిధుల లేమితో తాను ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం అంటూ ఎంపిటిసి హేమలత మంత్రిని ప్రశ్నించింది.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు కావాలనే నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఎంపీటీసీ హేమలత అసహనం వ్యక్తం చేశారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ ఎంపీటీసీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం.. మీకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించిన మల్లారెడ్డి, రాష్ట్రంలో అనేక పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని, నగదు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఎంపిటిసి లకు ఇస్తేనే నిధులా? సర్పంచులకు ఇస్తే నిధులు కావా? అంటూ మంత్రి మల్లారెడ్డి ఎంపీటీసీ హేమలత పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ఎంపిటిసి హేమలత మంత్రి మల్లారెడ్డి తో గొడవకు దిగడంతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన డబిల్ పూర్ సర్పంచ్ గీత భాగ్యరెడ్డి హేమలతతో గొడవకు దిగారు. వారిద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఎంపీటీసీగా తాను ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతే తనకు ఈ పదవి ఎందుకు అంటూ హేమలత ప్రశ్నించారు. మేడ్చల్ మండల సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకున్న రగడతో మల్లారెడ్డి మరోమారు వార్తల్లోకెక్కారు.