పీజేఆర్ బాటలోనే విష్ణువర్ధన్: లంచ్ భేటీకి సీనియర్ నేతలు హాజరు, అంతా క్లియర్
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే యాక్టివ్‌గా ఉన్నానంటూ దివంగత పీ జనార్ధన్ రెడ్డి(పీజేఆర్) తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపైనా యాక్టివ్‌గా ఉన్నానని తెలిపారు. పార్టీ పదవులు ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా, మంగళవారం ఏర్పాటు చేసిన విందు సమావేశానికి విష్ణువర్ధన్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ సీనియర్ నేతలను ఆహ్వానించారు.

విష్ణువర్ధన్ రెడ్డి లంచ్ మీట్‌కు కాంగ్రెస్ సీనియర్ల హాజరు
హైదరాబాద్ దోమలగూడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో.. పార్టీ ముఖ్యనేతలు వీహెచ్, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య మళ్లీ విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో ఈ లంచ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్టు వస్తున్న ప్రచారానికి.. ఈ విందుతో తెరదించారు. పార్టీ సీనియర్లతో అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చినందున వారిని లంచ్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలోనే విష్ణువర్ధన్ రెడ్డి
మంగళవారం ఉదయం నుంచే విష్ణు ఇంటి వద్ద కార్యకర్తల సందడి నెలకొంది. ఇక సీనియర్ నేతలంతా విందు సమయానికి నివాసానికి చేరారు. ఇక విందుకొచ్చిన నేతలను విష్ణు సాధరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్ని అందించారు. విందు అనంతరం వీహెచ్, మధుయాస్కీగౌడ్ మీడియాతో మాట్లాడారు. విష్ణువర్ధన్ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కుండబద్దలుకొట్టారు. చివరివరకు పార్టీలోనే విష్ణు కొనసాగుతారని.. దాన్ని బలపరించేందుకే సీనియర్లంతా విందుకు హాజరయ్యామని పేర్కొన్నారు.

పీజేఆర్ బాటలోనే విష్ణు: కలిసికట్టుగానేనంటూ వీహెచ్
కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని.. అందరూ కలిసి ఉంటేనే బలోపేతమవుతుందని సీనియర్ నేతలు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని మీరినట్టు తనపై వస్తున్న వార్తలకు ఇప్పుడే స్పందించనని.. సీనియర్లతో చర్చించాకే మాట్లాడతానని వీహెచ్ తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి పీజేఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ఉండాలని వీహెచ్ పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీలోనే ఉండటంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మాత్రం ఈ లంచ్ భేటీకి హాజరు కాలేదని తెలిసింది.

విజయారెడ్డి కాంగ్రెస్‌లోకి.. విష్ణువర్ధన్ రెడ్డి లంచ్ భేటీకి ప్రాధాన్యత
మరోవైపు, ఇటీవల పీజేఆర్ కూతరు, విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయారెడ్డి రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతల సమక్షంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ రెడ్డి లంచ్ భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై మాట్లాడేందుకు విష్ణువర్ధన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ సీనియర్లనే అడగాలన్నారు విష్ణు. అయితే, విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టికెట్ విషయంలో ఏదైనా సమస్య వస్తుందేమోనని విష్ణు భావించి సీనియర్ నేతలను కలిసినట్లు తెలుస్తోంది.