తెలంగాణాలో కరోనా కల్లోలం: 12రోజుల్లో 5రెట్లు పెరిగిన యాక్టివ్ కేసులు; రోజువారీ కేసులు ఎంతగా పెరిగాయంటే!!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గత 12 రోజుల్లో యాక్టివ్ కోవిడ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రోజువారీ కేసుల పెరుగుదల కారణంగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

12 రోజుల్లో 5 రెట్లు పెరిగిన యాక్టివ్ కేసులు, ఏడు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు
గడిచిన 12 రోజుల్లో, కరోనా యాక్టివ్ కేసులు తెలంగాణా రాష్ట్రంలో దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1, 2022న యాక్టివ్ కేసుల సంఖ్య 3,733గా ఉంది, ఇది జనవరి 12, 2022 నాటికి 18, 339కి పెరిగింది. అదే సమయంలో, రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య ఏడు రెట్లు పెరిగాయి. ఇది జనవరి 1న 317కరోనా కేసులు నమోదు కాగా, జనవరి 12న 2,319కి కరోనా కేసుల సంఖ్య పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ, మరణాల రేటు 0.5 శాతంగా ఉంది.

హైదరాబాద్లో అత్యధిక కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. నగరంలో కూడా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. జనవరి 1న గ్రేటర్ హైదరాబాద్ లో 217 కొత్త కేసులు నమోదైతే, గ్రేటర్ హైదరాబాద్ లో జనవరి 12న కొత్త కేసులు 1275కి పెరిగాయి. ప్రస్తుత నెలలో, హైదరాబాద్లో రోజువారీ కేసులు జనవరి 8న అత్యధికంగా 1583 నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అనేక జిల్లాలలో కరోనా కేసులు బాగానే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

రాష్ట్రంలో ఆసుపత్రులలో బెడ్స్ పరిస్థితి ఇలా
జనవరి 12 నాటికి, రాష్ట్రంలో కోవిడ్ రోగుల కోసం ప్రభుత్వం సిద్ధం చేసిన మొత్తం 1338 ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో 112 ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో, కోవిడ్ రోగుల కోసం 56,038 బెడ్లు ఉన్నాయి. మొత్తం పడకలలో, 1673 ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించబడ్డాయి. 1673 మంది రోగులలో, 564 మంది సాధారణ పడకలను ఆక్రమించగా, 654 మంది ఆక్సిజన్ సపోర్టుతో, 455 మంది ఐసీయూలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ సారి భారీగా కేసుల నమోదు ఉన్నా ఆస్పతుల్లో భారీగా చేరికలు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికే కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని మూడో వేవ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ప్రజల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 10 ఏళ్లలోపు మరియు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆరుబయటకు వెళ్లకూడదని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్క్ ధరించని వ్యక్తికి జరిమానా విధించవచ్చు. ప్రతి ఒక్కరూ మార్కులను ధరించడం, సామాజిక దూరాన్ని పాటించటం ద్వారా కరోనా వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా ను కట్టడి చేయడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు ప్రజలందరి బాధ్యత అని చెబుతున్నారు.

కరోనా థర్డ్ వేవ్ .. అలెర్ట్ అంటున్న నిపుణులు
ఇదిలా ఉంటే రాష్ట్రంలో థర్డ్ వేవ్ కొనసాగుతుందని తాజా లెక్కలతో అర్ధం అవుతుంది. ఈ సమయంలో అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటి లక్షణాలనే చూపిస్తున్న కారణంగా ప్రజలు ప్రస్తుతం కరోనా కేసుల ఉప్పెనను సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి కనిపించటం లేదు. కానీ భవిష్యత్ లో కరోనా వ్యాప్తి ఉధృతంగా సాగితే దారుణ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కరోనా సోకకుండా నియంత్రణా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.