హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ భయం .. బ్రిటన్ నుండి వచ్చిన 15 మందికి పాజిటివ్
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ పెద్ద ఎత్తున సాగుతోంది. భారతదేశంలోనూ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది . ఒకపక్క వాక్సినేషన్ కొనసాగుతున్నా , కరోనా కేసులు కూడా బాగా తగ్గినా, కరోనా టెన్షన్ మాత్రం ఇంకా వదలడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వందల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు కావడం కాస్త ఊరటనిస్తున్నా , తాజాగా హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పెడుతోంది.
10 కోట్లకు చేరిన కేసులు .. కరోనా వ్యాక్సిన్ వచ్చినా కొత్త వేరియంట్లతో ప్రపంచానికి పెను సవాల్

యూకే నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణీకులకు కరోనా పాజిటివ్
యూకే నుంచి హైదరాబాద్ వస్తున్న చాలామంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడం హైదరాబాద్ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. మొన్నటి వరకు హైదరాబాద్ లో కరోనా పంజా విసిరింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక మరణాలు కూడా హైదరాబాద్ లోనే సంభవించాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో తాజాగా బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఐదు విమానాలలో 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది.

బ్రిటన్ నుండి హైదరాబాద్ కు వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్
అయితే వీరికి సోకింది కరోనా కొత్త స్ట్రెయినా .. లేక మ్యూటేట్ కాని పాత కరోనావైరస్ నా అన్నది నిర్ధారణ కావలసి ఉంది.
ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో, వారు కూర్చున్న సీట్లకు ముందు వెనక మూడు వరుసలలోని ప్రయాణికులను కూడా అధికారులు క్వారంటైన్ చేశారు. బ్రిటన్లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకున్న ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చింది .

పాజిటివ్ వచ్చిన వారితో పాటు ప్రయాణించిన వారికి క్వారంటైన్
కానీ ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలటం కలకలం రేపుతోంది. దీంతో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన మరో ముప్పై మందిని కూడా క్వారంటైన్ లో ఉండాలని సూచించారు అధికారులు. అయితే బ్రిటన్ నుంచి ప్రయాణం చేయడంతో కొత్త స్ట్రెయిన్ పై తీవ్ర ఆందోళన నెలకొంది.