షాకింగ్: హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతికి కరోనా.. తెలంగాణలో కొత్తగా 1676 కొత్త కేసులు, 10 మరణాలు..
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1676 మంది కరోనా కాటుకు గురయ్యారు. 24 గంటల వ్యవధిలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,018కి, మృతుల సంఖ్య 396కు పెరిగింది.

పకడ్బందీ లెక్కలు..
కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ హైకోర్టు చేత చివాట్లు, సామాజిక మాద్యమాల్లో విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సర్కారు.. కొవిడ్ సంబంధిత లెక్కలను అత్యంత పకడ్బందీగా రూపొందించింది. జిల్లాల వారీగా కేసుల వివరాలతోపాటు కొవిడ్ చికిత్స అందిస్తోన్న ఆస్పత్రుల జాబితా, ప్రధాన ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నవి తదితర అంశాలను బులిటెన్ లో పొందుపర్చారు.

జిల్లాల వారీగా ఇలా..
గురువారం కొత్తగా 1676 కేసులురాగా, అందులో మెజార్టీ కేసులు 788 ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం గమనార్హం. అయితే కొద్ది రోజులుగా వెయ్యికిపైగా నమోదైన కేసుల ఉధృతి ఇప్పుడు కొద్దిగా తగ్గడం ఊరటనిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 224, మేడ్చల్160, కరీంనగర్ లో 92, నల్గొండలో 64, సంగారెడ్డి 57, వరంగల్ అర్బన్ 47, నాగర్ కర్నూల్ 30, మెదక్ జిల్లాలో 26 కొత్త కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ కలెక్టర్ కు కరోనా..
కరోనా విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మొదటి నుంచీ మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉంటూ వస్తోంది. రాష్ట్రంలో నమోదవుతోన్న కేసులు, మరణాల్లో 60శాతం పైచిలుకు ఇక్కడి నుంచే ఉంటుండటం గమనార్హం. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కూడా కరోనా బాధితుల జాబితాలో చేరడం గమనార్హం. గడిచిన 5 రోజులుగా లక్షణాలతో బాధపడుతోన్న ఆమెకు గురువారం నాటి పరీక్షల్లో కొవిడ్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. కలెక్టర్ తోపాటు ఆమె డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ సహా కార్యాలయంలోని మొత్తం 15 మంది వైరస్ బారినపడినట్లు తెలిసింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.

67 శాతం రికవరీ..
కొన్ని సర్వేల్లో తెలంగాణ.. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రంగా తేలింది. అయితే, ఇక్కడ రికవరీ రేటు జాతీయ సగటు(63శాతం) కంటే మెగుగ్గా ఉండటం గమనార్హం. తెలంగాణలో కొవిడ్-19 రికవరీ రేటు 67 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 41,018 కేసుల్లో ఇప్పటికే 27,295 మంది డిశ్చార్జ్ అయ్యారు. 13,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణపై కొన్ని

అందుబాటులో వేలాది బెడ్లు..
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 14, 026 శాంపిల్స్ టెస్టులు చేశామని, మొత్తం 2,22,693 శాంపిల్స్ పరీక్ష చేశామని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం మొత్తం 61 ఆస్పత్రులు పని చేస్తున్నాయని, అన్నీ కలిపి మొత్తం 17,081 బెడ్లు సిద్ధం చేయగా, ప్రస్తుతం 1692 మంది పేషెంట్లు చికిత్స పొందుతుండగా, 15389 బెడ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇక గాంధీ ఆస్పత్రిలో మొత్తం బెడ్ల సంఖ్య 1890కాగా, ప్రస్తుతం 635 మంది చికిత్స పొందుతున్నారని, 1255 బెడ్లు ఖాళీగా ఉన్నాయని బులిటెన్ లో పేర్కొన్నారు.