వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క పంటకూ అందని రుణం: కరీంనగర్ జిల్లాలో పరిస్థితి విడ్డూరం

రైతులందరికీ తప్పకుండా పంట రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, అందుకు సాక్షాత్ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: రైతులందరికీ తప్పకుండా పంట రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, అందుకు సాక్షాత్ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఆయనతోపాటు కీలకమైన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. కానీ పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు మాత్రం రైతులకు సరిపడా పంట రుణాలు మంజూరు చేయడంలో విఫలం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎకరం పొలంలో వరి సాగుచేస్తే ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.62 వేల రుణం అందజేయాల్సి ఉంటుంది.

రైతుల రుణ చెల్లింపుల తీరును బట్టి మరో 30 శాతం అదనంగా బ్యాంకులు రుణం మంజూరు చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. కానీ తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క బ్యాంకు కూడా ఈ నిబంధనను పాటించటం లేదని, రెండు పంటలకు కాదు కదా కనీసం ఒక పంటకు కూడా పూర్తిస్థాయిలో పంట రుణం ఇవ్వటం లేదని ఇటీవల జగిత్యాలలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో నాబార్డు ఏజీఎం రవికుమార్‌ పేర్కొనడం పంట రుణాల పంపిణీ తీరును వెల్లడిస్తోంది.

Crop loans not available in Karimnagar Dist

Recommended Video

Pawan Kalyan's Twitter War On BJP : Modi Focus On UP Only, Not Telugu States - Oneindia Telugu

రుణాల జారీపై కలెక్టర్, నాబార్డు ఏజీఎం అసంతృప్తి ఇలా

మరోవైపు బ్యాంకర్లు పనితీరు మార్చుకుని నిర్ధేశిత లక్ష్యం మేరకు పంటరుణాలను అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ బ్యాంకర్ల సమీక్షలో పేర్కొనటం ఇందుకు సరైన ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ పంటరుణాల పంపిణీలో ఏమాత్రం వేగం పెరగలేదు. జిల్లాలో రూ.784 కోట్ల పంటరుణం పంపిణీ లక్ష్యంగా కాగా, ఇప్పటి వరకు రూ.300 కోట్ల వరకే పంపిణీ, వరికి ఈ నెలాఖరుతో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తుండటంతో చాలా మంది రైతులు సున్నా వడ్డీకి, బీమా పథకానికి సుదూరంగానే నిలవనున్నారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారులే శరణ్యం

సాధారణంగా ఏప్రిల్‌ 1 నుంచి ఖరీఫ్‌ పంట రుణ పంపిణీని ప్రారంభిస్తారు. మే నుంచి జూన్‌లో పంటలను విత్తుకునే సమయం వరకు రైతులకు పంట రుణాలను ఇస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఆగస్టు నెలాఖరుకు వచ్చిన పంపిణీ నత్తనడకనే సాగుతోంది. రూ.784 కోట్ల ఖరీఫ్‌ రుణలక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్ల వరకే పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో కేవలం సహకార బ్యాంకు మినహా ఏ బ్యాంకు కూడా రైతులకు నిర్ధేశిత లక్ష్యం మేరకు రుణాన్ని ఇవ్వలేదు. సహకార బ్యాంకుల లక్ష్యం రూ.84 కోట్లకు రూ.105 కోట్లను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచింది. కొన్ని బ్యాంకుల్లో నైతే కనీసం 15 శాతం రుణాన్ని కూడా ఇవ్వకపోవటంతో రైతులు ప్రైవేటు పెట్టుబడులపైనే ఆధారపడాల్సి వచ్చింది.

Crop loans not available in Karimnagar Dist

కౌలు రైతుల ఊసెత్తని బ్యాంకర్లు

మరోవైపు జిల్లాలో వ్యవసాయ టర్మ్‌లోన్లు- 213.81 కోట్లు, సాగు మౌలిక సదుపాయాలకు రూ.117.04 కోట్లు, సాగు సహాయక టర్మ్‌లోన్లు రూ.37.13 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.41.10 కోట్లు రైతులకు రుణాలుగా ఇవ్వాలి. కానీ ఆచరణలో వీటిల్లో కనీసం 7 శాతం కూడా రైతులకు పంపిణీ చేయలేదు. జిల్లాలో 99,828 మంది రైతులకు ఇంకా పంటరుణ మాఫీకి చెందిన రూ.15.31 కోట్లను చెల్లించాలి. రైతు సమగ్ర సర్వేప్రకారం జిల్లాలో 1.54 లక్షల మంది రైతులు ఉండగా వీరిలో దాదాపుగా లక్షమంది వరకే పంటరుణాలను పొంది ఉన్నారు. మిగిలిన వారికి, 10 వేల మంది వరకు గల కౌలురైతులకు కూడా పంట రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తక్కువగానే రుణాలు మంజూరు

ప్రభుత్వం పంటరుణ పరిమితిని ఖరారు చేయగా ఈ మేరకు రుణాన్ని ఇవ్వాలి. వేరుశనగకు రూ.22 వేలు, మొక్కజొన్నకు రూ.27 వేలు, కందికి రూ.16వేలు, పెసరకు రూ.12 వేలు, మిర్చి పంటకు ఎకరానికి రూ.45వేలు, పత్తికి రూ.35 వేల వరకు, వరికి రూ.31వేలు, పసుపు రూ.55వేలు, సోయాబీన్‌కు ఎకరాకు రూ.16 వేల వరకు పంటరుణాన్ని ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఈ పరిమితి పాటించడం లేదు. రైతులు సక్రమంగా రుణం చెల్లిస్తే ఇంతకన్నా 30 శాతం పెంచి ఇవ్వవచ్చు కానీ ఇవ్వటం లేదు. జిల్లాలోని 23 బ్యాంకులు, 114 శాఖల ద్వారా ఖరీఫ్‌, రబీలలో పంటరుణాలను అందించాలని నిర్ణయించగా రుణాలందక, పంటరుణ పరిమితిని అమలు చేయగా రైతులు ప్రైవేటు అప్పులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి సాధ్యపడటం లేదు.

Crop loans not available in Karimnagar Dist

కౌల్దారులకు అందని రుణాలు

కౌలుదారులకు కార్డులు ఇస్తున్నా బ్యాంకర్ల నుంచి రుణాలందటం లేదు. గత ఖరీఫ్‌లో జిల్లాకు రూ.777.44 కోట్ల పంట రుణ పంపిణీ లక్ష్యంగా నిర్ధేశించగా 49,451 మంది రైతులకు రూ.340.52 కోట్లను మాత్రమే అందించారు. గత రబీలో రూ.484.32 కోట్ల పంటరుణం లక్ష్యంగా ఉండగా 39,099 మంది రైతులకు రూ.154.97 కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పటికయినా అధికారులు, బ్యాంకర్లు చొరవ తీసుకుని రైతులకు కౌలురైతులకు లక్ష్యంమేరకు పంటరుణాలను అందించేలా చర్యలు తీసుకోవాల్సిఉంది.

ఈ నెలాఖరు వరకే పంటల బీమా

రైతులు పండించే పంటలకు కాక బ్యాంకుల నుంచి తీసుకున్న 'పంటరుణాలకే బీమా'లా పథకం అమలవుతోందని పేర్కొంటూ సాక్షాత్తు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పార్లమెంట్‌కు నివేదించటం పథకం అమలు తీరును కళ్లకు కడుతోంది. 67 శాతం మంది రైతులకు పంటలబీమా పథకం ఉందనే విషయమే తెలియదని కాగ్‌ పేర్కొన్న పరిస్థితులు జగిత్యాల జిల్లాలోనూ అక్షర సత్యాలుగా ఉన్నాయంటే నిష్ఠూర సత్యమే మరి. జిల్లాలో జులై నెలాఖరుతోనే పత్తి, మిరప, మక్క, పెసర, సోయాబీన్‌, పసుపు పంటలకు పంటలబీమా ప్రీమియంను మినహాయించే గడువు ఉండగా పంటరుణాలను పంపిణీ చేయనందున చాలామంది రైతులకు బీమా ప్రయోజనం దరి చేరే అవకాశం లేదు.

ఈ నెలాఖరు వరకు వరికి బీమా ప్రీమియం చెల్లింపు గడువు ఉండగా లక్ష ఎకరాల్లో రైతులు వరి పండిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ మేరకు పంట రుణాలను పంపిణీ చేస్తారనేది సందేహంగా మారింది. ఈ నెలాఖరులోపు వీలు ఉన్నంత వరకు వరిని పండించే రైతుల రుణాలను నవీకరించి పంటల బీమా పథకానికి ప్రీమియం తీసుకోవాలని అధికారులు తలపోస్తున్నా బ్యాంకర్ల సహకారం అంతంతమాత్రమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. రైతులు సగం ప్రీమియం చెల్లిస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన సగం ప్రీమియంను కంపెనీకి చెల్లించాలి.

పంట నష్టంపై ఆలస్యంగా తనిఖీలతో రైతుకు నష్టం

గతంలో పంటలకు ప్రకృతి వైపరీత్యాలతో వాటిల్లిన నష్టాన్ని ఆలస్యంగా పరిశీలించటం, ఒకచోట పంట వందశాతం దెబ్బతిన్నా మరోచోట పంటకోత ప్రయోగాల్లో మంచి దిగుబడులు రావటంతో పరిహారాన్ని రైతులకు మంజూరు ఇవ్వలేదు. ఫిర్యాదుల యంత్రాంగం లేకపోవటం, ప్రభుత్వం వద్ద కొరవడిన సాగు సమాచారం, కంపెనీల ప్రతినిధులు అందుబాటులో లేనందున పరిహారం అతి తక్కువగానే వచ్చింది. ప్రతి సీజన్‌లో వర్షాలు, వరదలు, రాళ్లవానలు, కరవు, బెట్ట పరిస్థితులు, చీడపీడలతో రూ.వందలకోట్ల విలువైన పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినా కనీసం రైతులు చెల్లించిన మేరకు కూడా ప్రీమియం మంజూరు చేయలేదు.

పంటల బీమాపై రైతులకు అవగాహన పెంపొందించాలి

ఉమ్మడి జిల్లాలో 23 సీజన్లలో మొత్తం 7.43 లక్షలమంది రైతులు రూ.40.71 కోట్ల బీమా ప్రీమియంను చెల్లిస్తే ఇంతే సమానంగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఐనా కూడా 1.60 లక్షలమంది రైతులకు రూ.33 కోట్ల పరిహారం మాత్రమే వచ్చింది. నిరుడు రబీ సీజన్‌లో జగిత్యాల జిల్లాలో కేవలం 6 వేల మంది రైతులు మాత్రమే బీమాకు ప్రీమియంను చెల్లించటం పథకం నిరాదరణను వెల్లడిస్తోంది.

ఈ ఖరీఫ్‌లో రూ.784 కోట్ల పంటరుణాల లక్ష్యం కాగా పంటను బట్టి రూ.20 కోట్ల వరకు ప్రీమియంను రైతుల నుంచి మినహాయించాల్సి ఉన్నా రుణాల నవీకరణ, కొత్తగా మంజూరు లేనందున ప్రీమియంను తీసుకోవటం సాధ్యపడటం లేదు. కనీసం 50 శాతం రైతులను బీమా పరిధిలోకి తేవాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. బ్యాంకులు ఇచ్చే రుణాల కోసం వాటి చుట్టూ పలు సార్లు తిరుగాల్సి వస్తున్నదని రైతులు చెప్తున్నారు. ఏడాదికో సారి రెన్యూవల్‌ చేస్తే సరిపోతుందని కొందరు పేర్కొంటుండగా రెండు పంటలకు మార్చాలని మరికొందరు చెప్పటంతో ఏమీ పాలుపోవటం లేదంటున్నారు.

బీమా కోసం తాజా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నో

గత ఫిబ్రవరిలోనే పంట రుణం చెల్లించి కొత్తగా తీసుకున్న రైతులు బీమా కోసం ఇప్పటికప్పుడు చెల్లించి, రుణాలు తీసుకుందామన్న బ్యాంకర్లు అనుమతించరని రైతులు చెప్తున్నారు. పంటలబీమా ప్రీమియంను చెల్లించే అవకాశం రైతులకు కలగటంలేదన్న విమర్శ ఉంది.. రెండుపంటలకు రెన్యూవల్‌చేయాలి లేదంటే వారే నేరుగా ప్రీమియం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బ్యాంకుల్లో ఇచ్చిన మేరకు నగదును తీసుకోవటం తప్ప ఎంత ఇస్తున్నారు, ఎంత చెల్లించాలి, ప్రీమియంను ఎంత తీసుకుంటున్నారు, వడ్డీమాఫీ వస్తుందా, రీఎంబర్స్‌మెంట్‌ ఎందరికి ఇస్తున్నారనే సమాచారమే రైతులకు ఉండటం లేదు. కిసాన్‌క్రెడిట్‌ కార్డుల ఊసేలేదు. పంటల బీమా సంగతి ఏమాత్రం తమకు చెప్పడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Telangana Finance Minister Etela Rajender said that Bankers should give loans to all farmers. He and his collegue minister K T Ramarao also belongs to united Karim Nagar district. In fact bankers didn't ready to single season loan. At the same time tenant farmers not get any relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X