వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్దెరకు ముద్దెర!: నోటు కన్నా.. నోటి మాటకే విలువ

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: నగరానికి చెందిన మాధవరావు, శ్రీలత దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. ఇద్దరి జీతం రూ. లక్షన్నర వరకు ఉంటుంది. హోదాకు తగ్గట్టే ఆదివారం కూతురు పెళ్లి ఘనంగా చేశారు. దుస్తులు, బంగారం, వస్తువులు ముందే కొన్నారు. ఇక్కడి వరకు ఇబ్బంది లేదు. కానీ, పెళ్లి తర్వాత ఫంక్షన్‌ హాల్‌, కేటరింగ్‌, పందిరి, పూల అలంరణ, ఫొటో, వీడియో గ్రాఫర్‌, పురోహితుడికి దక్షిణ, సన్నాయి మేళం వాళ్లకు చెల్లించాల్సిన ఖర్చులు రూ. లక్షల్లో ఉన్నాయి. వీరి వద్ద పాతవి పెద్ద నోట్లు రూ. పది లక్షల వరకు ఉన్నాయి.

అయినా ఏం లాభం? ఆ డబ్బులు ఎవరికిచ్చినా తీసుకోవడం లేదు. 'ఇప్పుడు డబ్బులు ఇవ్వకున్నా సరే, తర్వాత వచ్చి కొత్త నోట్లు తీసుకుంటాం సార్‌' అని చెబుతున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయల లావాదేవీలు నమ్మకంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. కరెన్సీ నోటు కన్నా నోటి మాటకే మార్కెట్‌లో ఎక్కువ విలువ ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లోని చిల్లర కొట్టు దగ్గర్నించి మొదలెడితే బంగారం దుకాణదారుల వరకు నమ్మకస్తులైన వినియోగదారులకు పెద్ద మొత్తంలో ఉద్దెర ఇస్తున్నారు.

గతంలో తమ వద్ద ఏవైనా వస్తువులు తీసుకుని తర్వాత నమ్మకంగా డబ్బులు చెల్లించిన వారికి కావాల్సినన్ని సరకులు, వస్తువులు వాయిదాల రూపంలో ఇస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా కిరాణ దుకాణాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా సాగుతోంది. కొందరు ఇప్పటికీ పాత నోట్లను తీసుకుంటున్నారు. గిరాకీ పోగొట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో పాత నోట్లను తీసుకుని తర్వాత మార్పించుకోవచ్చనే ఉద్దేశంతోనే సరకులు విక్రయిస్తుండడం గమనార్హం.

currency notes ban effect: cashless transactions in warangal district

వాయిదా పర్వం

ప్రజలు ఎక్కువగా అత్యవసర ఖర్చులు మాత్రమే పెడుతున్నారు. అవసరం లేనివి వాయిదా వేసుకుంటున్నారు. భూపాలపల్లికి చెందిన ఓ సింగరేణి ఉద్యోగి కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళదామని ప్రణాళిక రచించుకున్నారు. కానీ, ఇప్పుడు నోట్లు చెల్లకపోవడంతో అయోమయంలో ఉన్నారు. పెట్రోలు బంకుల్లో పాత నోట్లు చెల్లినా, భోజనాలు, గదులు, షాపింగ్‌ లాంటి అనేక ఖర్చులుంటాయని మరో నెలకు ప్రయాణం వాయిదా వేసుకున్నారు.
ఇలా చాలా మంది పనుల్ని వాయిదా వేస్తున్నారు. నర్సంపేటకు చెందిన ఒక ఉద్యోగి కొత్త బైక్‌ కొందామని డబ్బులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు అవి చెల్లకపోవడంతో చేసేది లేక కొనుగోల ఆలోచనను విరమించుకున్నారు. కేవలం నిత్యావసరాల కొనుగోలు తప్ప ప్రజలు అవసరం లేని ఖర్చులన్నీ పక్కకు పెడుతున్నారు. ఫలితంగా మార్కెట్‌లోని వస్త్రదుకాణాలు, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలు, వాహనాల కొనుగోళ్లు పెద్దమొత్తంలో తగ్గాయి.

హన్మకొండలోని ఒక ప్రముఖ వస్త్రాల దుకాణంలో గతంలోకన్నా దాదాపు 40శాతం వ్యాపారం తగ్గింది. ఉన్నత వర్గాల ప్రజలు, ఉద్యోగులు మాత్రం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడి కొనుగోళ్లు చేస్తుండగా, సామన్య ప్రజలు, రైతులు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి లాంటి వ్యాపార ప్రాంతాల్లో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రూ.2 వేల నోట్లతో చిక్కులు

ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రూ. 2000 నోట్లను దుకాణాల్లో తీసుకోవడం లేదు. ఎవరైనా రూ. రెండు వేలు ఇచ్చి ఏ వందో, రెండు వందల సరకులో కొనుక్కుంటే మిగతా చిల్లర తెచ్చివ్వడం కష్టం సాధ్యమని దుకాణ దారులు నిరాకరిస్తున్నారు. ప్రజలు ఎంతో శ్రమకోర్చి బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లు కూడా కరెన్సీ కష్టాన్ని తీర్చలేకపోతున్నాయి. ఇప్పుడు అందరూ కేంద్రం త్వరలో విడుదల చేస్తానని చెప్పి రూ. 500 నోటు కోసం ఎదురుచూస్తున్నారు.

పోస్టాఫీసుల్లో వంద కోత..

పాత నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం చెబితే కొన్ని పోస్టాఫీసుల్లో కొత్త మెలిక పెడుతోంది అక్కడి సిబ్బంది. జనగామ హెడ్‌ పోస్టాఫీసులో ఆదివారం ప్రజల నుంచి పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చే క్రమంలో నాలుగు వేలకు రూ. 100 కోత కోసి రూ. 3900 ఇచ్చారు. ఇలా చేయడమేంటని పలువురు ప్రశ్నించడంతో తమ పోస్టాఫీసులో ఖాతా తీయాలని సిబ్బంది డబ్బు మార్చడానికి వచ్చిన వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై సిబ్బందిని వివరణ కోరగా తమకు పై నుంచి ప్రత్యేకమైన ఆదేశాలేవీ లేవని, కాకపోతే పోస్టాఫీసులో ఖాతా తెరిపించడానికి ఇలా చేస్తున్నామని చెప్పడం గమనార్హం.

కోత పెట్టిన రూ. వందకు ప్రత్యేక రశీదు ఇచ్చారు. ఇలా వందలాదిమంది నుంచి రూ. వంద స్వీకరించారు. కాగా వరంగల్లోని ఒక పోస్టాఫీసులో శనివారం సిబ్బంది ఇలాగే చేసింది. దాదాపు పది మంది వద్ద రూ. వంద కోత కోసి ఇవ్వడంతో తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో సిబ్బంది ఖాతా తెరిపించే ప్రక్రియ ఆపేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

తప్పని పాట్లు

పెద్ద నోట్ల మార్పిడికి, కొత్త డబ్బు ఉపసంహరణకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హన్మకొండ, వరంగల్‌, జనగామ, ములుగు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, మహబూబాబాద్‌, డోర్నకల్‌ లో ఉదయం నుంచే ప్రజలు పాత నోట్ల మార్పిడికోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయడంలేదు. ఉన్న కొద్ది ఏటీఎంల వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసుకోవడానికి బారులు తీరి కనిపించారు.

English summary
Cashless transactions in warangal district due to currency notes ban effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X