ప్లాన్ చూపించి మరీ: హైదరాబాద్‌లో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు
హైదరాబాద్: నగరంలోని నాలాల అక్రమణలపై ఉన్న నిర్మాణాల తొలగింపు రెండో రోజుకు చేరుకుంది. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేతలకు వెళుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదార్లన్నీ గోదారిని తలపించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు వీధులు, సెల్లార్లు, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఇటీవల నగరంలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో గుణపాఠం నేర్చుకున్న అధికారులు పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు నగరం నీట మునిగే ప్రమాదమున్నట్లు గుర్తించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు తొలిదశలో నాలాలపై ఉన్న నిర్మాణాలను కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు కూల్చివేతలు చేపట్టేందుకు నియమించిన బృందాలు రంగంలోకి దిగాయి.

డాక్యుమెంట్లు చూపించి మరీ కూల్చుతున్న అధికారులు
నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేతకు అడ్డు పడే వారికి డాక్యుమెంట్లు చూపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలుత నాలాలపై ఉన్న నిర్మాణాలపై దృష్టి పెట్టి, మలిదశలో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలను అడ్డుకునే నేతలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే సంకేతాలు పంపాయి. సోమవారం దీప్తి నగరలో కూల్చివేతలు అడ్డుకున్న ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నేతలు క్లాసులు పీకారు. మంగళవారం బాలాజీనగర్, ఆరాంఘర్, బేగంపేట, భగత్ సింగ్ నగర్, అల్వాల్, సుబాష్ నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూలుస్తున్నారు.

ప్రజా ప్రతినిధుల జోక్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు
అక్రమ నిర్మాణాల కూల్చివేతలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల జోక్యం ఉండకూడదని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది. గతంలో కూడా ఇదే తరహాలో ఒకటి రెండురోజుల పాటు కూల్చివేతలంటూ అధికారులు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ గతంలో ఆక్రమణలపై ధ్వంధ్వవైఖరిని ప్రదర్శిస్తూ రాజకీయనేతలు వీటి కూల్చివేతలను అడ్డుకునే వారు. ఇపుడు ఆ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులను సమన్వయం చేసుకుని, వారి బందోబస్తుతో మరీ జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు.

నాలాల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్
ఆక్రమణలపై సర్కారు సీరియస్‌గా ఉండటంతో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా వీటి తొలగింపునకు సంబంధించి తీర్పులివ్వటంతో కూల్చివేతలకు ఎక్కడా కూడా వ్యతిరేకతలు ఏర్పడలేదు. సోమవారం వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు పనులను కమిషనర్ జనార్దన్ రెడ్డి నేరుగా వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పాతబస్తీలోని మీరాలం చెరువును సందర్శించారు. మీరాలం చెరువుకు లీకేజీలుండట వల్ల జూపార్కులోకి నీరు ప్రవేశించటంతో కొద్దిరోజుల పాటు జూ పార్కును మూసివేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

తనిఖీలు నిర్వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్
ఇంజనీర్లతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్
ఈ క్రమంలో మీరాలం చెరువుకట్ట పటిష్టత అంశంపై ఆయన ఇంజనీర్లతో కలిసి ఈ తనిఖీ నిర్వహించారు. కట్టపై ఉన్న చిన్నచిన్న మొక్కలను తొలగించి ఏర్పడిన గోతులను పూడ్చివేయాలని ఆదేశించారు. మీరాలం చెరువు సర్‌ప్లస్ నాలాపై ఉన్న ఆక్రమణలను తొలగించే విషయంలో కఠినంగా వ్యవహారించాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువుకట్ట పటిష్టతకు చేపట్టాల్సిన పనులను అంచనాలతో సహా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జూ పార్కు క్యూరేటర్‌తో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఎల్‌పిజి గ్యాస్ నిర్మించిన అక్రమ కట్టడం కూల్చివేత
నాలాపై మహాలక్ష్మీ ఎల్‌పిజి గ్యాస్ నిర్మించిన అక్రమ కట్టడం కూల్చివేత
ఈ సమావేశంలో మీరాలం చెరువు పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలు, ప్రస్తుతం ఉన్న సమస్యలతో పాటు జూ పార్కులో పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వాహణ తదితర అంశాలపై చర్చించారు. కూల్చివేతల్లో భాగంగా సర్కిల్ 12లోని మదీనాగూడ రామకృష్ణానగర్‌లో నాలాపై ఎన్‌ఎస్‌కె బ్లిస్ మిడోస్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. అలాగే కాప్రా సర్కిల్‌లోని నల్లచెరువు నాలాపై మహాలక్ష్మీ ఎల్‌పిజి గ్యాస్ నిర్మించిన అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ పనులను పరిశీలించారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులను కూడా కమిషనర్ పరిశీలించారు.

స్వరూప్‌నగర్‌లోని నాలాపై అక్రమ నిర్మాణాల తొలగింపు
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని స్వరూప్‌నగర్‌లోని నాలాపై అక్రమ నిర్మాణాలను తొలగించారు. కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మించని ప్రహరీగోడలను అధికారులు నేలమట్టం చేశారు. సర్కిల్ ఎనిమిదిలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతాగేటు వద్దనున్న నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పోలీసు బందోబస్తుతో అధికారులు తొలగించారు. హస్తినాపురం దేవకమ్మతోట సమీపంలోని నాలాపై ఆక్రణలను అధికారులు తొలగించారు. బంజారాహిల్స్‌లోని నాలాపై ఓ ఫంక్షన్ హాల్ నిర్మించిన అక్రమ నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేశారు.

సోమవారం నగరంలోని 24 సర్కిళ్లలో 39 ఆక్రమణలు కూల్చివేత
సోమవారం ఒక్కరోజే జిహెచ్‌ఎంసి అధికారులు నగరంలోని 24 సర్కిళ్లలో 39 ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇందులో భాగంగా నాలాలకిరువైపులా వెలసిన నిర్మాణాలు 8, చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు 3, శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలు 13, నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అదనంగా చేపట్టిన మరో 15 నిర్మాణాలతో కలిపి మొత్తం 39 కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.