• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇటు స్వైన్ ఫ్లూ ఫీవర్ అటు డెంగ్యూ దాడి:‘అమ్మఒడి’ పేరిట సర్కార్ ఆర్భాటం

By Swetha Basvababu
|

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై మూడేళ్లు దాటింది. ఉమ్మడి ఏపీ నుంచి అదనపు ఆదాయంతో విడివడిన తెలంగాణ కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతోంది. మహబూబ్ నగర్ జిల్లాను డెంగ్యూ.. జగిత్యాల, సంగారెడ్డి జిల్లాలు స్వైన్ ఫ్లూ జ్వరం వెంటాడుతున్నాయి.

ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నామని అంటున్నా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సర్కారీ దవాఖానల్లో ప్రసవం చేసుకున్న బాలింతలకు 'కేసీఆర్ కిట్లు' పేరిట ప్రచారార్భాటం చేస్తోంది.

గత నెలలో పాలమూర్ జిల్లాలో 25 డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి ఉమ్మడి జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ పట్టణంలోనే కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అనూహ్యంగా డెంగ్యూ జ్వరాలు బయటపడటంతో మహబూబ్‌నగర్‌ వాసులు వణికిపోతున్నారు. గత నెలలో అత్యధిక కేసులు నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు వాటి కారణాల విశ్లేషణ పనిలో నిమగ్నమయ్యారు. గ్రామీణ ప్రాంతాలకంటే కూడా మహబూబ్‌నగర్‌లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పనలో నిర్లక్ష్యం

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పనలో నిర్లక్ష్యం

ఆగస్టు నెల గతేడాదితో పొలిస్తే పాలమూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధితో బాధ పడుతున్న బాధితుల సంఖ్య బాగా పెరిగింది. వ్యాధి నివారణ కోసం పారిశుద్ధ్యం, వ్యాధులపై అవగాహన కల్పనలో మున్సిపాల్టీ, వైద్యారోగ్యశాఖల మధ్య సమన్వయం లోపించడంతో సామాన్యులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు సత్వరం స్పందించి డెంగ్యూ జ్వర బాధితుల ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సకాలంలో చర్యలు చేపట్టకపోతే మాత్రం మున్ముందు రోగుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా 41 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కేసులే 80 శాతం వరకు ఉంటున్నాయి.

 పాలమూరులో ఇలా 41 కేసులు నమోదు

పాలమూరులో ఇలా 41 కేసులు నమోదు

ప్రధానంగా పాత పాలమూరు, జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్‌లో ఓ యువకుడు డెంగ్యూ జ్వరంతో మృత్యువాత పడ్డాడు. అతడి కుటుంబం నిరుపేదదైనా బతికించుకునేందుకు చివరిదాకా పోరాడింది. పరిస్థితి విషమించడంతో అతను మృతిచెందాడు. అదే ప్రాంతంలో సుమారు ఆరుగురు డెంగ్యూ జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. గతేడాది కూడా ఇద్దరు చిన్నారులు ఈ మహమ్మారి బారీనపడి మృతిచెందారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎవరికి మామూలు జ్వరం వచ్చినా డెంగ్యూ జ్వరమా? అని తల్లడిల్లే పరిస్థితి ఏర్పడింది. శివశక్తినగర్‌, షాసాబ్‌గుట్ట, రామయ్యబౌళి, ప్రేమ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో అధిక కేసులు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ కేసులు వస్తున్నాయి. జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఈ సమస్యలతో వైద్యసేవలు పొందుతున్న బాధితులు ఎక్కువగా ఉన్నారు. గతేడాది కేవలం 30 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇంకా పూర్తికాకముందే 41 కేసులు నమోదు కావడం ఆందోళన కలుగుతున్నది. పరిస్థితులు విషమించినా జిల్లా మున్సిపల్ అధికారులు గానీ, వైద్యారోగ్యశాఖ గానీ ప్రతిస్పందించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డెంగ్యూ జ్వరం వచ్చేది ఇలా

డెంగ్యూ జ్వరం వచ్చేది ఇలా

ఈడిస్‌ ఈజిప్షై దోమతోనే డెంగ్యూ జ్వరం సోకుతుంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటి మీద తెల్లని చారలు ఉంటాయి. దీన్నే టైగర్‌ దోమ అంటారు. దోమ శరీరంలోకి డెంగ్యూ వైరస్‌ ప్రవేశించిన 7-8 రోజులకు మనుష్యుల్లో వ్యాపిస్తున్నది. అప్పుడే హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. ఇది ఎక్కువగా పగటి వేళలోనే కుడుతుంది. ఈ దోమ శుభ్రమైన నీటిలో వృద్ధి చెందుతుంది. మూతల్లేని నీళ్లట్యాంకులు, సిమెంటు, తారు రోడ్ల మీద నిలిచి ఉండే వర్షపునీటిలో, ఇంట్లో పూలకుండీలు, కూలర్లు, పాత టైర్లు, వాడకుండా వదిలేసిన పాత్రలు, కొబ్బరి చిప్పల వంటి వాటిల్లో ఈ దోమలు పెరుగుతాయి. చీకటిగా ఉండే మూలల్లో, కర్టెన్ల వంటి వేలాడే వస్తువుల్లో, గొడుగుల్లో ఇవి దాక్కుని ఉంటాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ఈ దోమల సమస్య ఇపుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. డెంగ్యూ వ్యాధి సోకిన వారి కాళ్లు కదిలించలేని పరిస్థితుల్లో ఎముకల్లో, కండరాల్లో భరించలేని నొప్పి. శరీరంపై పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన, కడుపునొప్పి ఉంటాయి. రక్తపోటుతోపాటు రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. కొన్నిసార్లు అన్ని అవయవాలు విఫలమై ప్రాణాపాయం కూడా ఉండవచ్చు.

ఇప్పటివరకు 1330 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

ఇప్పటివరకు 1330 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే 34 మందిని కబళించిన స్వైన్‌ఫ్లూ తాజాగా మరో ఇద్దరిని బలి తీసుకున్నది. నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్‌ జిల్లా వాసి కమలమ్మ(55)తో సహా సోమాజిగూడలోని యశోద ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి(45) గురువారం మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో ఆరుగురు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,330 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే, వాటిలో ఎక్కువగా హైదరాబాద్ నగర పరిధిలోనే నమోదయ్యాయి. స్వైన్‌ఫ్లూ బాధితులకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినా గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో తప్ప ఇతర ఆస్పత్రుల్లో చికిత్సలందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

పరిస్థితి భేష్షుగ్గా ఉన్నదన్న మంత్రి లక్ష్మారెడ్డి

పరిస్థితి భేష్షుగ్గా ఉన్నదన్న మంత్రి లక్ష్మారెడ్డి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఎక్కల్‌దేవి ప్రకాష్‌ (42) అనే వ్యక్తి స్వైన్‌ఫ్లూతో గురువారం మృతిచెందాడు. 20 రోజుల కింద స్వైన్‌ఫ్లూ సోకిన ప్రకాష్‌ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి రెండు రోజుల క్రితం మరణించాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ధర్మపురి మండలం నక్కలపేటకు చెందిన ఓ మహిళా రైతు కూడా స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించడంతో ఆగమేఘాలపై రాష్ట్రంలో పరిస్థితులపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి లక్ష్మారెడ్డి రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ అదుపులోనే ఉన్నదన్నారు. సకాలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చికిత్సకు అవసరమైన పరికరాలు, మందులను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. బాలింతలకు కేసీఆర్‌ కిట్‌ పథకం జాతీయాంశంగా మారిందని, వివిధ రాష్ట్రాలు ఈ పథకం గురించి తెలుసుకుంటున్నాయని తెలిపారు.

గతంలో కార్పొరేట్ దవాఖానల్లో ప్రసవాల తీరిది..

గతంలో కార్పొరేట్ దవాఖానల్లో ప్రసవాల తీరిది..

రాష్ట్రమంతా అంటు వ్యాధులు, సీజనల్ జ్వరాలతో సతమతం అవుతుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రం ‘అమ్మఒడి' పథకం పేరిట ప్రచారార్భాటం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ హయాంలో రాష్ట్రంలో వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించారన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేట్ దవాఖానల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయకుండా.. ఆపరేషన్లు చేస్తూ వేల రూపాయలు గడిస్తున్నారన్న ఆరోపణలు సర్వ సాధారణంగా మారాయి. తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల తర్వాత 'అమ్మఒడి' పేరిట ‘కేసీఆర్ కిట్' పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఈ కిట్లు అందజేస్తున్నారు. గత జూన్ మూడో తేదీన ప్రారంభమైన ఈ పథకంపై మూడు నెలల తర్వాత కూడా అదే ప్రధానం అన్న రీతిలో ప్రచారార్భాటానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్తున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఇతర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు ఇందులో పూర్తిగా నిమగ్నమయ్యారంటే అతిశయోక్తి కాదు మరి. ఇప్పటికైనా స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

English summary
Swine Flu and Dengue fever affected in Mahaboob Nagar, Sanga Reddy and Jagityal distticts. Dengue fever in Mahaboob Nagar town's slums and colonies. Because it has spreaded sanitation failure. There is allegations that coordination failure with in the medical and health as well as muncipal departments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X