పూర్తికాని ఆస్తుల నమోదు .. దసరాకు ధరణి పోర్టల్ లేనట్టే ... రిజిస్ట్రేషన్ ల కోసం నిరీక్షణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ఆన్ లైన్ లో నమోదుచేసి దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే దసరాకు ఇంకా రెండు రోజులు టైమ్ మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంతవరకు ధరణి పోర్టల్ ప్రారంభం విషయంలో ప్రగతి భవన్ నుండి అధికారులకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రజల ఆస్తుల నమోదు కార్యక్రమం సగం కూడా కాలేదు. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు వరదల కారణంగా ఆస్తుల ఆన్లైన్ నమోదును తాత్కాలికంగా నిలిపివేసింది సర్కార్.
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్

దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం లేనట్టే
తెలంగాణా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఆన్లైన్ లో ఆస్తుల నమోదు జరగలేదు. దీంతో దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం లేనట్టే అని భావిస్తున్నారు అధికారులు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణీ పోర్టల్లో నమోదు చేసుకున్న ఆస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . దీంతో సెప్టెంబరు 7 నుండి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను నిలిపి వేసింది. ధరణి పోర్టల్ ను దసరా రోజున ప్రారంభిస్తామని, అప్పటినుండి రిజిస్ట్రేషన్ సేవలను తిరిగి కొనసాగిస్తామని సీఎం ప్రకటించారు. కానీ దసరాకు ధరణి పోర్టల్ ప్రారంభమయ్యే అవకాశం కనిపించటంలేదు.

మున్సిపల్ కార్పోరేషన్ ప్రాంతాల్లో సగం కూడా పూర్తి కాని ఆస్తుల నమోదు
ఆన్లైన్లో ఆస్తుల నమోదు గ్రామ స్థాయిలోనే ఎక్కువగా జరిగినా, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలలో సగం కూడా పూర్తి కాలేదు. జిహెచ్ఎంసి పరిధిలో 20 శాతం మాత్రమే ఆస్తుల నమోదు కొనసాగింది. ఆస్తులు నమోదు పూర్తికాకుండానే పోర్టల్ ప్రారంభించడం మంచిది కాదు అన్న అభిప్రాయం లో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. ఇక ధరణి పోర్టల్ కోసం రిజిస్ట్రేషన్ లు ఆపడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

ధరణి పోర్టల్ కోసం నిలిపివేసిన రిజిస్ట్రేషన్ లు
అమ్మకాలు కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తద్వారా వచ్చే ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోయింది. ఇల్లు, ఇళ్ల స్థలాలు కొనుక్కోవడం కోసం, అపార్ట్ మెంట్ లో ప్లాట్లు కొనుగోలు చేయడం కోసం డబ్బులు చెల్లించిన చాలామంది రిజిస్ట్రేషన్ ల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని శాసన సభలో, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్ కు పంపడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కొత్త చట్టం ఫలానా రోజు నుండి అమల్లోకి వస్తుందని నోటిఫై చేస్తూ జీవో జారీ చేయాలి.

దసరాకు ధరణి కష్టమే .. రిజిస్ట్రేషన్ ల కోసం తప్పని నిరీక్షణ
దసరా రోజున ధరణి పోర్టల్ ను ప్రారంభించాలని అనుకుంటే ఇప్పటికే ప్రభుత్వం కొత్త చట్టాన్ని నోటిఫై చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి ఎలాంటి సంకేతం ఇవ్వకుండా ఉండడం దసరాకు ధరణీ లేనట్టే అన్న అభిప్రాయానికి కారణమౌతుంది. దసరాకు కాకుంటే మరి ఇంకెప్పుడు ధరణి పోర్టల్ ప్రారంభం అవుతుందో .. రిజిస్ట్రేషన్ ల కోసం నిరీక్షిస్తున్న వారి కష్టాలు ఎప్పటికి తీరేనో !!