మంత్రి పువ్వాడ అజయ్, ఆ పోలీసులపై హత్య కేసు పెట్టాలి: కేసీఆర్ సర్కారుకు డీకే అరుణ వార్నింగ్
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు, పోలీసుల తీరుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల మృతికి కారకులవుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ పోలీస్ యూనిఫాం వదిలేసి గులాబీ కండువా కప్పుకోవాలని డీకే అరుణ ధ్వజమెత్తారు.
రామాయంపేట్లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై డీకే అరుణ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న అరాచకాలను వెలుగులోకి తెస్తుండటంపై బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మీద కక్ష పెంచుకున్నారన్నారు. మంత్రి పోలీసులను వాడుకొని సాయి గణేష్పై అక్రమంగా 16 కేసులు నమోదు చేసి వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడన్నారు.

మూడు వారాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన సాయి గణేష్ పోలీసు స్టేషన్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడం విచారకరమన్నారు డీకె అరుణ. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నిమ్స్ కి తరలించినప్పటికి సాయి గణేష్ మృతి చెందడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతూ సాయి గణేష్ మీడియా కు ఇచ్చిన వాంగ్మూలంలో తన ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులు కారణమని స్పష్టం చేశాడన్నారు డీకే అరుణ. దీని ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులపై హత్యనేరం కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి కొడుకుల ఆత్మహత్యలకు కారణమైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, రామయంపేట్ మాజీ సీఐ తో పాటు ఆత్మహత్యకు కారణమైన ఏడుగురిపై కూడా హత్యానేరం కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని డీకే అరుణ హెచ్చరించారు.
ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులే వారి మృతులకు కారణమవ్వడం సిగ్గుమాలిన చర్య అని.. ముఖ్యమంత్రి కేసీఆర్, తన కుమారుడు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే తన పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షించ వద్దని, సహనానికి కూడా హద్దులు ఉంటాయని టీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని డీకే అరుణ హెచ్చరించారు.