దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్మీట్
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా, ఆయన కుటుంబంలోని కీలక వ్యక్తి, మంత్రి అయిన హరీశ్ రావు అహర్నిషలు తీవ్రంగా శ్రమించిన నియోజకవర్గం దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ ఓటమిపాలైంది. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలో రెండో బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు అవతరించారు. మంగళవారం మధ్యాహ్నం ఫలితం వెలువడిన తర్వాత అందరికంటే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. టీఆర్ఎస్ ఓటమిపై అనూహ్య వ్యాఖ్యలుచేశారు..
బీహార్లో ఈవీఎంల ట్యాంపరింగ్ - షాకింగ్ ఆరోపణలపై ఈసీ వివరణ -ఫలితాలపైనా క్లారిటీ ఇచ్చేశారు

అసలేం జరిగిందంటే..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరిదైన 23వ రౌండ్ లో గానీ విజేత ఎవరో తేలలేదు. తుది ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 62, 772 ఓట్లు, టీఆర్ఎస్ సుజాతకు 61,302 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్ చెరుకు శ్రీనివాస రెడ్డికి 21,819 ఓట్లు దక్కాయి. మొత్తం 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
అమెరికా తరహాలో బీహార్ కౌంటింగ్ -రాత్రి దాకా తుది ఫలితాలు రావు -మధ్యాహ్నానికి 20శాతమే -కారణాలివే

అపజయాలకు కుంగిపోము..
‘‘2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఎక్కడ ఎన్నికలుగానీ, ఉప ఎన్నికలుగానీ జరిగినా టీఆర్ఎస్ అప్రతిహతంగా గెలుస్తూ వచ్చింది. ఏడాది కిందట సూర్యాపేట జిల్లా హూజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ విజయం సాధించాం. ప్రతి ఎన్నికల సందర్భంలో మేం ఒకటే చెప్పాం.. విజయాలకు మేం గర్వపడం.. అపజయాలకు కుంగిపోము. ఎదురుదెబ్బలకు ఇబ్బంది పడబోము. ఇవాళ దుబ్బాక ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62 వేల పైచిలుకు మందికి ధన్యవాదాలు చెబుతున్నా. పార్టీ పిలుపు మేరకు ఎన్నికల్లో శ్రమించిన పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కృతజ్నతలు. అంతేకాదు..

ఇది మేం కోరింది కాదు..
దుబ్బాక ఉప ఎన్నికలో మేం ఆశించిన ఫలితం రాలేదు. రాజకీయాల్లో ఎవరైనాసరే గెలవాలనే అనుకుంటారు. గత ఆరున్నరేళ్లలో మేం ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నాం. కానీ ఇవాళ్టి ఫలితం వేరుగా వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో కూర్చొని సమీక్షించుకుంటాం. దుబ్బాకలో ప్రజా తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నాం. దుబ్బాకలో మేం ఆశించినట్లు ఫలితాలు ఎందుకు రాలేదో కూర్చొని సమీక్షించుకుంటాం. ఈ ఫలితం..

టీఆర్ఎస్కు ప్రమాద హెచ్చరిక..
దుబ్బాక ఫలితం ద్వారా మాకొక విషయం అవగతం అయింది. టీఆర్ఎస్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని దుబ్బాక గుర్తు చేసింది. రాబోయే రోజుల్లో మేం ఇంకా అప్రమత్తంగా ఉండాలనే సంకేతాలు లభించాయి. ఉప ఎన్నిక ఫలితా ఎలా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మేం ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా పార్టీ పరంగా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళతాం. మా పని మేం చేసుకుంటూ పోతూ ప్రజల మెప్పును పొందే ప్రయత్నం చేస్తాం. అధ్యక్షుడు కేసీఆర్ సూచనల మేరకు ముందుకు వెళతాం'' అని మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ముగించారు. తన ఐదు నిమిషాల ప్రసంగంలో కేటీఆర్ ఎక్కడా బీజేపీ పేరెత్తకపోవడం, గెలిచిన అభ్యర్థికి అభినందనలు కూడా చెప్పకపోవడం గమనార్హం.