
బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో TRS ఎంపీ నామాకు ED సమన్లు, 25న విచారణ, KCRపై కేంద్రం ఉచ్చు?
దేశంలోనే పేరెన్నిక గల మధుకాన్ నిర్మాణ సంస్థ పలు బ్యాంకుల నుంచి భారీగా లోన్లు పొంది, వాటిని దారిమళ్లించి మోసానికి పాల్పడినట్లుగా నమోదైన అభియోగాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలకు ఉపక్రమించింది. మధుకాన్ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది.
బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు ఈనెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లలో పేర్కొంది. నాలుగు రోజుల కిందటే ఈడీ బృందాలు ఎంపీ నామా సహా మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయడం తెలిసిందే. ఖమ్మం, హైదరాబాద్ సహా మొత్తం 6 చోట్ల జరిపిన సోదాల్లో కీలకమైన ఆధారాలు లభ్యమైన మేరకే ఇప్పుడు ఎంపీకి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

నామాకు చెందిన ఇళ్లు, ఆఫీస్, మధుకాన్ కాంపెనీ, డైరెక్టర్ల ఇళ్లల్లో 20 గంటల పాటు సోదాలు చేసిన ఈడీ.. కీలక పత్రాలు, కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిందని, నగదు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారని, రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డు చేశారని వెల్లడైంది.
ఎంపీ నామాకు చెందిన మధుకాన్ సంస్థపై ఈతరహా అభియోగాలు కొత్త కానప్పటికీ, రాష్ట్రంలో బీజేపీ విస్తరణ చురుగ్గా సాగుతోన్న సందర్భాల్లోనే ఇలా ఈడీ సోదాలు చేసి, సమస్లు జారీ చేయడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ లో నంబర్ 2గా ఉండి, సీఎం కేసీఆర్ తో విభేదాల వల్ల బయటికొచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సమయంలో గులాబీ దళంలో ధనికనేత అయిన నామాను ఈడీ టార్గెట్ చేయడాన్ని.. కేసీఆర్ కట్టడికి కేంద్రం పన్నిన ఉచ్చుగానూ కామెంట్లు వస్తున్నాయి.