trs leaders resign telangana telangana elections 2018 telangana elections nominations రాజీనామా టీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికలు 2018 తెలంగాణ ఎన్నికలు తెలంగాణ నామినేషన్లు rasamayi balakishan pidamarthi ravi
ఎన్నికల వేడి : ఆ నలుగురు రాజీనామా.. అసలేం జరిగింది

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. చేయి వీడి కారెక్కే నేతలు కొందరుంటే.. కారుకు బై బై చెప్పి హస్తం గూటికి చేరుతున్నవారు మరికొందరు. ఇటు మహాకూటమి, అటు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతలు ఎవరికివారు గెలుపు అవకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదలావుంటే లీడర్ల మాటల తూటాలతో రాజకీయ రణరంగం మరింత వేడెక్కుతోంది. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల తొలిఘట్టం నామినేషన్ల పర్వం మొదలయింది. దీంతో తెలంగాణ రాజకీయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కక అసంతృప్తులు అధిష్టానాలపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కొందరు నిరసనలకు దిగుతుంటే.. మరికొందరు పార్టీలకు గుడ్ బై చెబుతున్నారు. అదలావుంటే కీలక పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ కు చెందిన నలుగురు నేతలు రాజీనామా చేయాల్సి వచ్చింది.

పార్టీల పెద్దలకు తప్పని తిప్పలు
పార్టీలను నమ్ముకుని పార్టీల కోసం పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వరా అంటూ ఆందోళనలకు దిగుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ ఇలా ఎక్కడ చూసినా టికెట్ల పంచాయితీలే. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి పార్టీ పెద్దలది. అధిష్టానాల నిర్ణయాలు ఒంటెద్దు పోకడలు తలపిస్తున్నాయని కొందరు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు మహాకూటమిలో మిత్రపక్షాలకు సీట్లు సర్దుబాటు చేయాల్సిరావడం, సొంతగూటి నేతలకు సర్ది చెప్పడం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది.

ఆ నలుగురు రాజీనామా
నామినేషన్లు మొదలయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పదవుల్లో ఉన్న నలుగురు టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేశారు. కార్పొరేషన్ పదవులకు గుడ్ బై చెప్పారు.
పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ ఛైర్మన్ రసమయి బాలకిషన్ తమ పదవులకు రాజీనామా సమర్పించారు.

అసలేం జరిగింది
ఈసీ నిబంధనల మేరకు ఈ నలుగురు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఎన్నికల్లో వీరు పోటీచేస్తుండటమే ఈ రాజీనామాలకు కారణం. ప్రభుత్వ పదవుల్లో కొనసాగరాదనే ఆంక్షలతో వీరంతా తమ పదవులకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్తుపల్లి నుంచి పిడమర్తి రవి, బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, మానకొండూరు నుంచి రసమయి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు.