కేసీఆర్ మాటలకు కోతలెక్కువ!: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు: బండి సంజయ్
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ తోపాటు మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో తెలంగాణ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రాజా సింగ్, సీనియర్ నేత లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. నాలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 35 ఏళ్ల రాజకీయ చరిత్రను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరగరాశారని బండి సంజయ్ అన్నారు. అవినీతి రహిత పాలన కావాలని యూపీ ప్రజలు భావించారని.. అందుకే మరోసారి యోగి ఆదిత్యనాథ్ సర్కారును గెలిపించారన్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ బీజేపీ కార్యకర్తలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. దేశంలో బీజేపీ పని అయిపోయిందని కొందరు చేసిన వ్యాఖ్యలకు ఇవాల్టి ఫలితాలే బుద్ధి చెబుతున్నాయని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారు: బండి
తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని, సెంటిమెంటుతోనే మరోసారి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి సీట్లు పెరగకపోయినా.. ఓట్ల శాతం పెరిగిపోతోందన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ సర్కార్ ఇంజిన్ దారుసలాంలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇందుకు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

చెల్లని రూపాయికి గీతలెక్కువ.. కేసీఆర్ మాటలకు కోతలెక్కువ: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్. అయితే, కేంద్రానికి సహకరించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడీల ప్రభుత్వం కాకుండా పేదలకు తోడుగా ఉండే ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. అవినీతి ప్రభుత్వం కోసం తెలంగాణను సాధించుకోలేదన్నారు బండి సంజయ్. చెల్లని రూపాయికి గీతలెక్కువ.. కేసీఆర్ మాటలకు కోతలెక్కువ.. అంటూ చురకలంటించారు.

తెలంగాణలోనూ బుల్డోజర్లంటూ రాజా సింగ్
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. యూపీతోపాటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ప్రజలదేనని అన్నారు. దౌర్జన్యాలు, అన్యాయాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారన్నారు రాజా సింగ్. అంతేగాక, ప్రజా సంక్షేమానికి కృషి చేసారని, యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందన్నారు. తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు. కేసీఆర్‌కి కలలో కూడా మోడీ వస్తున్నారని.. ఉలిక్కిపడుతున్నాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పని దేశంలో అయిపోయిందని, తెలంగాణలో కూడా ఈసారి ఖతం అవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఎంఐఎం బ్లాక్ మెయిల్ పార్టీ... డబ్బులు ఇస్తారా.. అభ్యర్థి ని నిలబెట్టాలా అని బెదిరిస్తుంది అంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ బుల్డోజర్లు తీసుకొస్తామని.. అవినీతి, ల్యాండ్, ఇసుక, టీఆర్ఎస్ మాఫియాను అణిచివేస్తామని రాజా సింగ్ అన్నారు.