సిగ్గుమాలిన చర్య అంటూ కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్: పోలీసుల తీరుపై రఘునందన్ రావు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు. వేర్వేరుగా మీడియా సమావేశాల్లో శుక్రవారం టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనకుంటే సీఎం కేసీఆర్ అధికారం నుంచి తప్పుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

కేసీఆర్, హరీశ్ తప్పు చేస్తే.. సూపరింటెండెంట్‌కు శిక్షా?: ఈటల
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..
పెంచిన విద్యుత్, ఛార్జీల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 17వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో ఛార్జీల సిగ్గుమాలిన చర్య అని ఈటల మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రి వ్యవహారంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తప్పుచేస్తే ఎంజీఎం సూపరింటెండెంట్ శిక్ష అనుభవించాలా? అని ప్రశ్నించారు ఈటల. నిధులు కేటాయించకుండా ఆస్పత్రుల అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు.

బీజేపీపై కోపాన్ని రైతులపై చూపిస్తున్నారు: కేసీఆర్‌పై ఈటల ఫైర్
బీజేపీ నేతలపై కోపాన్ని రైతులపై చూపిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ఈటల మండిపడ్డారు. పంజాబ్‌లో రెండో పంట గోధుమలు వేస్తారని తెలిసి కూడా సీఎం అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతి గింజనూ కొంటామంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కారు ధాన్యం సేకరిస్తోందన్న ఆశతో రైతులు కోతకు సిద్ధమవుతున్నారని అన్నారు. కోటి మందికి రైతు బంధు ఇస్తే 35 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట రావడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.

పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు: రఘునందన్ రావు ఫైర్
మరోవైపు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడికందులలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభానికి వెళితే టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. స్వయంగా తాను ఫోన్ చేసి బందోబస్తు కల్పించాలని సిద్దిపేట ఏసీపీని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపై మహిళలు తిరుగుబాటు చేశారని తెలిపారు. టీఆర్ఎస్ నిర్వహించే సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఆందోళనలు చేస్తే పోలీసులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తనపై భౌతికదాడి చేసేందుకు వస్తే పోలీసులు నియంత్రించలేదని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం డీజీపీని కలిసి పోలీసులు వ్యవహరించిన తీరును వివరించనున్నట్లు తెలిపారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో తాను ఉంటే.. గేటు బయట టీఆర్ఎస్ నేతలతో ఏసీపీ సంప్రదింపులు జరిపారని రఘునందన్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేదు కానీ, కూల్చేసిన శిలాఫలకం కడుతుంటే 50 బంది పోలీసులు భద్రత కల్పించారని దుయ్యబట్టారు. శిలాఫలకం కూల్చిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో సిద్దిపేట ఏసీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. తనై దాడికి యత్నించిన వారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అధికార కార్యక్రమానికి వెళ్లిన తనపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించానని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.