బీజేపీని ఆపలేరు, అందుకే అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదు: గుండెల్లో దడ అంటూ బీజేపీ నేతలు
మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఈటల రాజేందర్, విజయశాంతి, తరుణ్ ఛుగ్ విమర్శలు గుప్పించారు. గురువారం సాయంత్రం గద్వాల జిల్లా అలంపూర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతలు మాట్లాడారు.

బీజేపీని ఆపే శక్తి కేసీఆర్‌కు లేదు: ఈటల రాజేందర్
రాబోయే కాలంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీని ఆపగలిగే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.

అందుకే అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదు: విజయశాంతి
మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత విజయశాంతి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రులు కూడా రాజ్యాంగం మార్చాలని అనలేదని.. రాజ్యాంగం పాత బడిందని కేసీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డ కాబట్టే కేసీఆర్‌కు అంబేడ్కర్ అంటే ఇష్టం లేదని ఆమె ఆరోపించారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోందన్న విజయశాంతి.. అంబేడ్కర్ విగ్రహం ఏమైందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ భాష చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ఆర్థిక మూలలను దెబ్బకొట్టారన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ నేతలు దోపిడీ దొంగలని విజయశాంతి విమర్శించారు.

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి: తరుణ్ ఛుగ్
బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర 31 రోజులపాటు సాగుతుందన్నారు. ఈ యాత్రలో రైతులు, నిరుద్యోగులతో అన్ని వర్గాలకు చెంతకు వెళ్తామన్నారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు తెలంగాణ సాకారం కోసమే ఈ యాత్ర అని అన్నారు.

బండి సంజయ్ యాత్రతో టీఆర్ఎస్ గుండెల్లో దడ: బీజేపీ నేతలు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని ఆయన అన్నారు. ఎస్సీలను కేసీఆర్ అన్ని రకాలుగా మోసం చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీలను కేసీఆర్ రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే కేసీఆర్ ముందస్తు ఎన్నికల రాగం పాడుతున్నారని.. లోక్‌సభతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. బండి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్ గుండెల్లో దడ పుడుతోందని బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాలకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. నడిగడ్డను కేసీఆర్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇక్కడి ప్రజలు ఆయన క్షమించరన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే నడిగడ్డ సమస్యలు తీరతాయన్నారు జితేందర్ రెడ్డి.