కేసీఆర్, కేటీఆర్‌లకు కరోనా నిబంధనలు లేవా? ఫాంహౌస్‌లో నరబలి?: ఈటల, విజయశాంతి ఫైర్
హైదరాబాద్/కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార పక్షానికి ఓ న్యాయం.. ప్రతిపక్షానికి ఓ న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మాస్కులు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అరెస్టులు, నిర్బంధం, కేసుల ద్వారా రాజ్యం నడపలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లకు కరోనా నిబంధనలు వర్తించవా?: ఈటల రాజేందర్
బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమన్నారు. అధికార పార్టీ కరోనా పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. నల్గొండలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, అప్పుడు అడ్డురాని కరోనా ఇప్పుడు అడ్డొచ్చిందా. అని ప్రశ్నించారు.

బండి సంజయ్ అరెస్టు దారుణం, కేసీఆర్ రాజ్యాంగం అంటూ ఈటల
జీవో 317తో టీచర్లకు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు ఈటల రాజేందర్. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సంజయ్ తన కార్యాలయంలో జాగరణ కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఏదో శత్రు సైన్యంతో ఘర్షణ పడినట్టుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిలబడిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో చెడు అనుభవాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత రాజ్యాంగం అమలు చేస్తూ.. ఒక చక్రవర్తిలా పాలన చేస్తున్నారని మండిప్డారు. బీజేపీ కేసులకు భయపడదని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్ ఆగమవుతోందని, కాళ్ల కింద భూమి కదులుతోందని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్‌కు ఇనుపకంచెలు, ఫాంహౌస్‌కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు.

కేసీఆర్ అరాచకాలు.. చంపినా ప్రజల కోసమేనంటూ విజయశాంతి..
మరో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. బీజేపీని అడ్డుకోవడానికి, ఉద్యమాలను అణచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మమ్మల్ని చంపినా.. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేస్తామని విజయశాంతి అన్నారు. కేసీఆర్‌ను గద్డె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, 317 జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫామ్ హౌజులో కూర్చోని రాత్రికిరాత్రి జీవోలు తీసుకువస్తున్నారని విమర్శించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ని లాక్కెళ్లడం, మహిళల చీరలు లాగేయడం, కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు విజయశాంతి.

కేసీఆర్ ఫాంహౌస్‌లో వ్యక్తి చనిపోయినా..?: విజయశాంతి
టీఆర్ఎస్కు లేని కరోనా నిబంధనలు, బీజేపీకి వర్తిస్తున్నాయా? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విజయశాంతి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయాయన్నారు. తాము దీక్షలకు పిలుపునిచ్చినప్పడే కాంగ్రెస్ చేత దీక్షలు పెట్టిస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాలు కూడా త్వరలోనే ప్రజలకు తెలుస్తాయన్నారు. కేసీఆర్ ఓ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాడని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో బావిలోపడి మనిషి చనిపోయినా.. అది బయటకు రావడం లేదంటూ ధ్వజమెత్తారు. ఏమైనా నరబలి ఇస్తున్నాడా..? అని ప్రశ్నించారు. నువ్వు ఎక్కువ ఏళ్లు బతికేందుకు నరబలులు ఇస్తున్నావా? అంటూవిజయశాంతి తీవ్రంగా స్పందించారు.