వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు నెలల క్రితమే స్కెచ్: టీడీపీతో మాధవరెడ్డి కుటుంబ బంధానికి తెర

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉమా మాధవ రెడ్డి @TRS : దానికే స్కెచ్, టీడీపీతో కటిఫ్ !

హైదరాబాద్: గురువారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకురాలు ఎలిమినేటి ఉమా మాధవ రెడ్డి అసలు పార్టీ మారాలని ఆరు నెలల క్రితమే నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశంపై టీడీపీలోని తన అభిమానులు, అనుచరులతో పదేపదే చర్చించారని తెలుస్తున్నది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి చేరారన్నది స్పష్టంగానే తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నానాటికి దిగజారుతున్న టీడీపీ ప్రతిష్టకు తోడు జిల్లా పార్టీలో

గ్రూపుల గోల తదితర అంశాలతో టీడీపీకి గుడ్ బై చెప్పేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరిగా ఎలిమినేటి మాధవ రెడ్డి ఇటు పార్టీకి, అటు రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తొలి నుంచి ఉమా మాధవరెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పార్టీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మారిన రాజకీయాల నేపథ్యంలో టీడీపీ నుంచి ఉమా మాధవరెడ్డి, ఆమె తనయుడు అధికార టీఆర్ఎస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు కావడంతో దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెదేపాతో ఉన్న ఆమె కుటుంబ అనుబంధానికి తెరపడనుంది.

 రేవంత్‌తో కలిసి వెళ్లాలనుకున్నా లభించని భరోసా

రేవంత్‌తో కలిసి వెళ్లాలనుకున్నా లభించని భరోసా

వాస్తవంగా ఆమె, సందీప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై అనుచరులతో పంచుకున్నప్పుడు మిశ్రమ స్పందన రావడంతో తన ఆలోచనకు ఆమె బ్రేకులు వేశారని సమాచారం. మరోవైపు టీటీడీపీలో మొన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి అండదండలు ఉమా మాధవరెడ్డికి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డికి పుష్కలంగా లభించాయి. రేవంత్ రెడ్డితోపాటు కలిసి ముందుకు వెళ్లాలని అనూహ్యంగా నిర్ణయం కూడా తీసుకున్నారని తెలుస్తున్నది. కానీ సందీప్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై భరోసా లభించకపోవడంతో చివరి క్షణంలో ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ‘హస్తం' అందుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న అంశాన్ని ఆమె బహిరంగంగానే కుండబద్ధలు కొట్టారు. దీనికి తోడు భువనగిరి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు పుష్కలంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాలుగా చీలిపోయాయి. కుంభం అనిల్ రెడ్డి వైపే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొగ్గు చూపారు. హామీ లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానున్నదనే ఆలోచనతోనే ఆమె రేవంత్ రెడ్డితో కలిసి ముందుకెళ్లేందుకు వెనుకంజ వేశారని వినికిడి.

 రాజ్యసభకు అవకాశమివ్వాలని కోరిన ఉమా మాధవరెడ్డి

రాజ్యసభకు అవకాశమివ్వాలని కోరిన ఉమా మాధవరెడ్డి

‘ఎలిమినేటి మాధవరెడ్డితో నాకు తొలి నుంచి అనుబంధం ఉన్నది. ఇది మన కుటుంబం. మీరు సొంత కుటుంబంతో కలిసి పని చేస్తున్నామని భావించండి. సొంత మనుష్యుల్లా చూసుకుంటా. ఎలాంటి ఇబ్బంది రానివ్వను' అని ఉమా మాధవరెడ్డికి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం. మాధవరెడ్డితో తనకు గల అనుబంధాన్ని ఆయన పదేపదే గుర్తు చేశారని తెలిసింది. కార్పొరేషన్ చైర్మన్‪గా క్యాబినెట్ ర్యాంకు హోదా పదవితో గౌరవిస్తామని సీఎం కేసీఆర్ తెలిపినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసే ఆలోచన ఉన్నదని సీఎం కేసీఆర్‌తో ఉమా మాధవరెడ్డి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆమె హామీ ఇచ్చారని తెలుస్తోంది. తనకు రాజ్యసభ సీటు ఇప్పించాలని ఆమె అభ్యర్థించారని వినికిడి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ ‘రాజ్యసభ ఎంపీ.. ఎంపీ కాదు.. అంతకన్నా మెరుగైన స్థానంలోనే కూర్చోబెడతా.. మీ రాజకీయ భవిష్యత్ భద్రంగా చూసుకునే భరోసా నాది' అని ఉమా మాధవరెడ్డికి సూచించారు. మీరు ముందు పార్టీలో చేరండి.. మనమంతా కుటుంబ సభ్యుల వంటి వారమని అన్నట్లు తెలుస్తున్నది. ఇరువురి భేటీలో మాధవరెడ్డితో తన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యపై చంద్రబాబుతో పోరాడుతున్నప్పుడు అన్న మాధవరెడ్డి తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఇలా నాలుగైదు అంశాల్లో తనకు బాసటగా నిలిచారని కేసీఆర్ గత జ్నాపకాలను నెమరు వేసుకున్నట్లు తెలుస్తున్నది.

భవిష్యత్‌పై ఖచ్చితమైన హామీ ఇస్తేనే చేరతామని స్పష్టీకరణ

భవిష్యత్‌పై ఖచ్చితమైన హామీ ఇస్తేనే చేరతామని స్పష్టీకరణ

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే శాసనసభలోనే సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉమా మాధవరెడ్డి.. ఖచ్చితమైన భరోసా ఇస్తేనే టీఆర్ఎస్ లో చేరతామని తేల్చి చెప్పారు. ఉమా మాధవరెడ్డికి రాజ్యసభ, సందీప్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని యాదాద్రి - భువనగిరి జిల్లాలో జోరుగా చర్చ జరిగింది. ఎట్టకేలకు టీఆర్ఎస్‌లో ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డి చేరికకు రంగం సిద్ధం కావడంతో భువనగిరి టీడీపీలో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందునా తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు సొంత జిల్లా కూడా. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లాల పార్టీ అధ్యక్ష పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో భువనగిరి టీడీపీలో మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయి.

 1995లో ఎన్టీఆర్‌కు ఇలా మాధవరెడ్డి దూరం

1995లో ఎన్టీఆర్‌కు ఇలా మాధవరెడ్డి దూరం

ఉమామాధవరెడ్డి భర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి 1984లో ఎన్టీఆర్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. తొలిసారి 1985లో భువనగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1989, 94, 99లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత టీడీపీ అంతర్గత పోరులో చంద్రబాబు పక్షాన నిలిచిన ఎలిమినేటి మాధవరెడ్డి.. 1999 వరకు హోంశాఖ మంత్రిగా సేవలందించారు. చంద్రబాబును సమర్థించినందుకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి.. బహిరంగంగానే మాధవరెడ్డిని విమర్శించారని అప్పట్లో వార్తలొచ్చాయి. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మాధవరెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకున్న ఎన్టీఆర్.. ఆరోగ్యశాఖ కేటాయించారు. పార్టీలో ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి జోక్యాన్ని నిరసిస్తూ జరిగిన చీలికలో మాధవరెడ్డి.. ఎన్టీఆర్‌కు దూరమయ్యారు.

 అదే ఏడాది ఉమా మాధవరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం

అదే ఏడాది ఉమా మాధవరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం

2000 మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా పాత రంగారెడ్డి జిల్లాలోని ఘట్‌కేసర్‌ వద్ద 2000 మార్చి 7న నక్సల్స్‌ అమర్చిన బాంబు దాడిలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. భర్త మాధవరెడ్డి జయంతిన అదే ఏడాది మే ఒకటో తేదీన రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉమామాధవరెడ్డి అదే ఏడాది జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వంలో భూగర్భగనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009ల్లోనూ భువనగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆమె 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. నాటి నుంచి రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా.. జిల్లాల పునర్విభజన తర్వాత పార్టీలో తిరిగి క్రియాశీలంగా పని చేస్తూ వచ్చారు. కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. యాదాద్రి - భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఇందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అడ్డుపడినా.. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ఆమె తనకు గల పరపతితో దీనిపై ప్రకటన చేయించుకున్నారు.

 కుమారుడి భవితవ్యం కోసమే టీఆర్ఎస్‌లోకి..

కుమారుడి భవితవ్యం కోసమే టీఆర్ఎస్‌లోకి..

తెలంగాణలో టీడీపీ ఉనికి లేకపోయినా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్‌, భువనగిరి ప్రాంతాల్లో ఆమెకు తమకంటూ వర్గం ఉంది. తమ వర్గం, కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఆమె అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమెను టీఆర్ఎస్‌లోకి తీసుకురావడానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో సహా ఆమె బావ, మాధవరెడ్డికి స్వయాన సోదరుడైన ప్రస్తుత ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి కొన్నాళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తనతోపాటు తన అనుచరులు కొమురెల్లి నర్సింహారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నోముల మాధవరెడ్డి, చెరకు శివయ్యగౌడ్, జంగారెడ్డి, జయరాములు, భువనగిరి వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్, భువనగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రమేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతోపాటు 2000 మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆమె వివరించారు.

English summary
Ex Home Minister & late Madhava Reddy's son Sandeep Reddy is all set to join TRS. Sandeep is going to join the TRS on Dec 14 in the presence of TRS supremo and CM KCR. While Sandeep's joining in TRS is confirmed, there had been speculations that Uma Madhava Reddy, wife of Madhava Reddy and Sandeep's mother, too following the suit. Confirming the speculations, Uma announced her future political plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X