తెలంగాణాను కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల దందా: దేశవ్యాప్తంగా లింకులు; వరంగల్ లో మరోముఠా అరెస్ట్!!
తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ సర్టిఫికెట్ల దందా కుదిపేస్తోంది. రాష్ట్రంలో వివిధ కన్సల్టెన్సీలు, ప్రైవేటు విద్యా సంస్థలలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. కొందరు రాష్ట్రంలోనే నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి దందా చేస్తుంటే, మరికొందరు దేశంలోని వివిధ ప్రైవేటు యూనివర్సిటీలతో కుమ్మక్కై నకిలీ సర్టిఫికెట్ల దందాకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలతో ఏది అసలు ఏది నకిలీ అనేది తెలుసుకోవడం పెద్ద కష్టంగా మారింది.

మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు
నిన్నటికి నిన్న భోపాల్ లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్, మాజీ వైస్ ఛాన్స్ లర్ తోపాటు ఓ విభాగానికి అధిపతి కూడా నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇక తాజాగా మరో నకిలీ ముఠా గుట్టు రట్టు చేసింది వరంగల్ పోలీస్ కమిషనరేట్. దేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ల నుండీ ఇంటర్, డిగ్రీ, పీజి, బి.టెక్ మరియూ చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకొని నకిలీ దందాకు తెరతీశారు ఈ ముఠా.

ఎడ్యుకేషనల్ అకాడమీల పేరుతో నకిలీ సర్టిఫికెట్ల దందా
వీరి నుండి పోలీసులు వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 153 నకిలీ సర్టిఫికేట్లు, 7 రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన హన్మకొండ కి చెందిన నారెడ్ల రమేష్, దేవరాజు సుధాకర్, దాస బిక్షామయ్య అనే ముగ్గురు వేరు వేరు గా ఎడ్యుకేషనల్ అకాడమీలను ఏర్పాటు చేసి యువకుల అవసరాలను అసరాలను అసరగా చేసుకొని ఎలాంటి పరీక్షలు రాయకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా నెట్ వర్క్.. 30 యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్ల విక్రయం
దేశంలో వివిధ విశ్వవిధ్యాలయాలకు చెందిన యాజమాన్యంతో నిందితులు చేతులు కలిపి కావల్సినవారికి ఇంటర్, డిగ్రీ, పీజి, బి.టెక్ మరియూ చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి నకిలీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను ఒక లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ నకిలీ ముఠాకు దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంది. దేశంలోని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, సిక్కిం, జార్కండ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సూమారు ముప్పైకి పైగా విశ్యావిధ్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను వారు విక్రయిస్తున్నట్లు గా గుర్తించారు.

నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్న యూనివర్సిటీల జాబితా ఇదే.. లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్వామి వివేకానంద యూనివర్సిటీ మధ్యప్రదేశ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన హిమాలయ యూనివర్సిటీ, మహారాష్ట్రకు చెందినమహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ, ఐ ఐ ఈ యూనివర్సిటీ ఢిల్లీ, వైజాగ్ గీతం యూనివర్సిటీ, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన నెఫ్ట్, ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ తదితర విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు వీరు తయారు చేసే నకిలీ సర్టిఫికెట్లు జాబితాలో ఉన్నాయని సిపి తరుణ్ జోషి వెల్లడించారు. ఇక ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.