కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్:మార్కెట్ నిండా కల్తీ ఆహార వస్తువులు. ప్రాణాంతక వ్యాధులు తప్పవంటున్న నిపుణులు.

మార్కెట్‌లో కల్తీ రక్కసి కరాళనృత్యం చేస్తోంది. నిత్యం వినియోగదారులు ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్:మార్కెట్ నిండా కల్తీ ఆహార వస్తువులు. ప్రాణాంతక వ్యాధులు తప్పవంటున్న నిపుణులు.నిత్యం టాస్క్ ఫోర్స్ దాడులు జరుపుతున్నా ఆగని దందా.

మార్కెట్‌లో కల్తీ రక్కసి కరాళనృత్యం చేస్తోంది. నిత్యం వినియోగదారులు ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి. కొందరు వ్యాపారులు ధనార్జనే లక్ష్యంగా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా వ్యాపారులు ప్రతీ వస్తువును కల్తీ మయం చేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తరుచూ దాడులు నిర్వహించి కల్తీ సరకులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. హుజూరాబాద్‌, జమ్మికుంట ప్రాంతాల్లో విచ్చలవిడిగా కల్తీ దందా సాగుతోంది.

ఆగని కల్తీ వంటనూనె దందా

ఆగని కల్తీ వంటనూనె దందా

వంట నూనెలో యథేచ్ఛగా కల్తీ దందా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు ధర ఎక్కువగా ఉండే నాణ్యమైన నూనెలో నాసిరకం నూనె కలుపుతున్నారు. సన్‌ఫ్లవర్‌(లీటర్‌ రూ.90), పల్లినూనె(లీటర్‌ రూ.110) మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి నూనెలో నాసిరకం నూనె, ఎక్కువ రోజులు నిల్వ చేసిన నూనె కలిపి అమ్ముతున్నారు. హుజూరాబాద్‌, జమ్మికుంట కేంద్రంలో ఇలాంటి కల్తీ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రెండు దఫాలుగా దాడులు నిర్వహించి ఓ మిల్లులో 2,000 లీటర్ల కల్తీ ఆయిల్‌, మరో మిల్లులో 2,100 లీటర్ల ఆయిల్‌ను పట్టుకున్నారు. జమ్మికుంటలోని ఓ మిల్లులో పటిక వేసిన పల్లీనూనెను పట్టుకున్నారు. అయినప్పటికి కల్తీ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి పొందిన వివిధ కంపెనీలకు చెందిన ఆయిల్‌నే మార్కెట్‌లో విక్రయించాలి. లేదా ప్యాకింగ్‌ చేసిన ఆయిల్‌ను మాత్రమే విక్రయించాలి. విడి అమ్మకాలకు అనుమతి లేదు. కానీ కొందరు వ్యాపారులు స్థానికంగా మిల్లులో మరపట్టిన పల్లీ నూనెలో ఫామాయిల్‌, ఇతర నాసిరకం ఆయిల్‌ కలిపి విక్రయిస్తున్నారు. మరికొందరు వివిధ కంపెనీల పేరిట ముద్రించిన ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నట్లు తెలిసింది. నాణ్యమైన బ్రాండ్ల పేరిట మరికొందరు టిన్నులలో (15 కిలోలు) నింపి జనానికి అంటగడుతున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా టిన్నులపై పేరొందిన కంపెనీల స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఇలా ప్రతీరోజు వందలాది క్వింటాళ్ల కల్తీ నూనె మార్కెట్‌లో అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీ వల్ల వ్యాపారులు రూ.లక్షలు ఆర్జిస్తుండగా, వినియోగదారులు మాత్రం రోగాల బారిన పడుతున్నారు.

తినే బియ్యమూ కల్తీ

తినే బియ్యమూ కల్తీ

మనం తినే బియ్యంలోనూ కల్తీ జరుగుతోంది. సన్న బియ్యంలో ఇతర రకాలు కలిపి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వినియోగదారులు గుర్తు పట్టని విధంగా మాయ చేసి బీపీటీ, సోనామసూరి పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెండు రకాల బియ్యం ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యతను బట్టి క్వింటాలు రూ.4,000 నుంచి రూ.4,300 చొప్పున ధర పలుకుతోంది. ఇదే బియ్యంలో తక్కువ ధరకు లభించే ఇతర సన్నరకాలను కలిపి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన సన్నరకాల వంగడాలను రైతులు పండిస్తుండగా, వీటికి మార్కెట్‌లో అంతగా డిమాండ్‌ లేదు. ఈ బియ్యాన్ని బీపీటీ, సోనామసూరి బియ్యంలో కలిపి సన్నరకాలుగా నమ్మించి విక్రయిస్తున్నారు.

కారంలోనూ కల్తీ

కారంలోనూ కల్తీ

ప్రతీ వంటకంలో వినియోగించే కారంలో కూడా కల్తీ జరుగుతోంది. విడిగా అమ్మే కారం పొడితో పాటు వివిధ కంపెనీల పేరిట ప్యాకెట్లలో అమ్మే కారం కల్తీదే. వినియోగదారులు అత్యధికంగా ఎరుపు రంగులో ఉండే కారం పొడినే వాడుతారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు రంపపు పొట్టుతో పాటు మిర్చిలో వచ్చే వ్యర్థాలు, తొడిమెలు, మిర్చి గింజలు పట్టించి కారం పొడిలో కలుపుతున్నారు. ఎర్రగా కనిపించే విధంగా ఎరుపు రంగు కలిపి నాణ్యమైన కారం పొడిగా నమ్మించి వినియోగదారులకు అంటగడుతున్నారు. క్వింటాలు కారం పొడిలో దాదాపు 30 కిలోలకు పైగా నాసిరకం పొడి కలిపి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కారం పొడి రూ.160 చొప్పున లభిస్తుండగా, వ్యాపారులు కల్తీ చేసి డబ్బులు మిగిల్చుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల జమ్మికుంటలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో ఓ పిండిగిర్నిలో 300 కిలోల కల్తీ కారం పట్టుకున్నారు. ఇలాంటి కల్తీ కారం తింటే క్యాన్సర్‌ వంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

పప్పులకూ తప్పలేదు...

పప్పులకూ తప్పలేదు...

ప్రతీ ఇంట్లో ప్రతి నిత్యం వండుకుని తినే పప్పుల్లో కూడా కల్తీ జరుగుతోంది. మార్కెట్లో కందిపప్పు కిలో రూ.90కి లభిస్తుండగా, తక్కువ ధరకు లభించే కేసరిపప్పు కలిపి కల్తీ చేస్తున్నారు. దీంతోపాటు పెసరపప్పు, శనగపప్పులో నాసిరకం పప్పులు కలిపి నాణ్యతగా ఉండేలా పసుపు రంగు కలుపుతున్నారు. నూనెలో పసుపు రంగు వేసి కలిపితే పప్పు నాణ్యతగా కనబడుతుంది. ఇలా మార్కెట్‌లో కల్తీ పప్పులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. క్వింటాలు నాణ్యమైన పప్పులో 25 కిలోల నాసిరకం పప్పు కలిపి విక్రయిస్తున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో ఇలాంటి కల్తీ గుట్టు బట్టబయలైంది. కేసరిపప్పును కలిపిన కందిపప్పును తరుచూ తింటే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

టీ పొడిలో...

టీ పొడిలో...

కల్తీ రాయుళ్లు టీ పొడిని కూడా వదలటం లేదు. నాణ్యత కల్గిన టీపొడిలో నాసిరకం కలిపి అమ్ముతున్నారు. విడి అమ్మకాల్లో ఇలాంటి కల్తీ ఎక్కువగా జరుగుతోంది. మార్కెట్‌లో నాణ్యమైన టీపొడి కిలో రూ.260 నుంచి రూ.450 వరకు ధర పలుకుతోంది. ఇలాంటి టీ పొడిలో రూ.150లకు లభించే నాసిరకం పొడిని కలిపి వినియోగదారులకు అంటగడుతున్నారు. అలాగే వాడి పడేసిన టీ పొడికి రంగు వేసి మళ్లీ కొత్త పొడిలో కలుపుతున్నారు. హోటళ్లలో వాడిపడేసిన టీపొడిని సేకరించి కొందరు వ్యాపారులు ఇలాంటి దందా చేస్తున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇటీవల హుజూరాబాద్‌లోని ఓ హోటల్‌లో దాడులు నిర్వహించి రెండు బస్తా సంచుల్లో వాడిపడేసిన టీపొడిని స్వాధీనం చేసుకున్నారు. మరో హోటల్‌లో కల్తీ చేసిన నాసిరకం టీ పొడిని పట్టుకున్నారు. ఇలాంటి టీపొడిని వాడటం వల్ల వూపిరిత్తులు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెపుతున్నారు.

పసుపు కూడా అంతే

పసుపు కూడా అంతే

ప్రతీ వంటకంలో వాడే పసుపు కూడా కల్తీ అవుతోంది. నాణ్యత కల్గిన పసుపు కొమ్ములు పట్టిస్తే పొడి మంచి పసుపు వర్ణంలో కనిపిస్తుంది. అదే నాసిరకం పసుపు కొమ్ములు పట్టిస్తే తెలుపు, పసుపు రంగులో పొడి వస్తుంది. ఇలాంటి నాసిరకం పసుపుతో పాటు బియ్యం పొడిలో మొటానిల్‌ ఎల్లో రసాయనాన్ని కలిపి పసుపు రంగు వచ్చేలా చేస్తున్నారు. దీన్ని చూడగానే నాణ్యమైన పసుపుగా కనబడుతుంది. ఇలాంటి కల్తీ పసుపును గుర్తించడం కష్టం. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జమ్మికుంటలో దాడులు నిర్వహించి 20 కిలోల కల్తీ పసుపు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.150 ధర పలుకుతున్న విషయం తెలిసిందే. విడిగా అమ్మే పసుపులో 30 శాతానికి పైగా బియ్యం పిండి కలిపి మొటానిల్‌ ఎల్లో రసాయనం కలిపి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పసుపు తింటే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విడి అమ్మకాల్లోనే ఎక్కువ

విడి అమ్మకాల్లోనే ఎక్కువ

మార్కెట్‌లో విడి అమ్మకాల్లోనే అత్యధిక శాతం కల్తీ జరుగుతోంది. నూనె నుంచి మొదలుకుని ప్రతీ నిత్యావసర వస్తువు విడిగా అమ్మవద్దనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. కిరాణా దుకాణాలు, రిటైల్‌, హోల్‌సేల్‌ షాపుల్లోనూ విడి అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జిల్లాలో జరిపిన దాడుల్లో విడిగా అమ్ముతున్న నిత్యావసర వస్తువులే ఎక్కువగా పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. వందలాది క్వింటాళ్ల ఆయిల్‌తో కారం, పసుపు, టీపొడి, ఇతర సరకులు పట్టుబడ్డాయి. నిబంధనల మేరకు ప్యాకింగ్‌ చేసిన సరకులే విక్రయించాలి. కానీ ఇదెక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఉప్పు నుంచి మొదలుకుని ఇతర నిత్యావసర సరకులు అధిక శాతం విడిగానే అమ్ముతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి విడిగా అమ్ముతున్న సరకులను పట్టుకుని కేసులు నమోదు చేసినా ఈ కల్తీ వ్యాపారానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

కల్తీ వ్యాపారాన్ని కట్టడి చేస్తాం: అమృతశ్రీ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు

కల్తీ వ్యాపారాన్ని కట్టడి చేస్తాం: అమృతశ్రీ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు


నిత్యావసర సరకులు విడిగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరకులు ప్యాకింగ్‌ చేసినవి మాత్రమే విక్రయించాలి. ప్యాకింగ్‌ తేదీ, నాణ్యత, వివరాలను లేబుల్‌పై ముద్రించి ప్యాకింగ్‌పై అతికించాలి. అలాగే లాట్‌ నంబర్‌తోపాటు క్రయ,విక్రయాలకు సంబంధించిన వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలి. ఈ విషయంపై వ్యాపారులకు పలుమార్లు సూచనలు చేశాం. విడి అమ్మకాల్లోనే కల్తీ ఎక్కువ జరుగుతున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైంది. అందుకే వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రజలు కూడా విడిగా అమ్మే సరకులను కొనవద్దు. ఎవరైనా విడిగా అమ్మితే తమకు ఫిర్యాదు చేయవచ్చు. హుజూరాబాద్‌, జమ్మికుంటలో వంటనూనె విడి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు మా దృష్టికి; వచ్చింది. కల్తీ వ్యాపారంపై నిఘా తీవ్రతరం చేస్తాం. దాడులు మరింత ముమ్మరం చేసి కల్తీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు ప్రతీ వస్తువుకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు. కల్తీ అమ్మకాలను పూర్తిగా నియంత్రించాలన్నదే తమ లక్ష్యం.

English summary
Fake food items in Karimangar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X