ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
హైదరాబాద్: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జ్యోతిష్యులుగా విశేష సేవలందించారు. రాశి ఫలాలతోపాటు ఆయన చెప్పే జ్యోతిష్యాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా విశ్వసిస్తుంటారు. ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తులు.. ఇలా పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన అంచనాలను తెలియజేశారు.

ములుగు సిద్ధాంతి మృతి పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు మలక్పేట రేస్ కోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, వాస్తవ జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియ చేసిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ములుగు సిద్ధాంతి.. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించారు.
ఇదిలావుంటే ,ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మ జీవితాన్ని ప్రారంభించేకంటే ముందు సిద్ధాంతి ఎమ్ఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. సీనీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో లోక కళ్యాణం కోసం ములుగు సిద్ధాంతి ఇటీవల యాదాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాల్లో ఆయుష్య హోమాలు నిర్వహించినట్లు ఆయన కుమారుడు సోమేష్ తెలిపారు.