జాతీయ రహదారిపై రైతులధర్నా.. వరంగల్ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్, డిమాండ్ ఇదే!!
కేసీఆర్ సర్కారు తీసుకువచ్చిన ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు కోసం రైతన్నలు కదంతొక్కారు. వరంగల్ జిల్లా రైతులు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ నుండి హైదరాబాదుకు వెళ్ళు 163జాతీయ రహదారిపై ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన రైతులు జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా నష్కల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర భారీ వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైతులు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు ఆందోళనను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జీవో 80ఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం కోసం పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినవోలు, జఫర్ గడ్, ధర్మసాగర్ మండలాల్లో చాలా మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జాతీయ రహదారిపై రైతులధర్నా.. వరంగల్ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్, డిమాండ్ ఇదే!!
— oneindiatelugu (@oneindiatelugu) May 25, 2022
#farmersprotest, #highway pic.twitter.com/86Z5IG92CO
జాతీయ రహదారిపై రైతులధర్నా.. వరంగల్ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్, డిమాండ్ ఇదే!!
— oneindiatelugu (@oneindiatelugu) May 25, 2022
#farmersprotest, #highway pic.twitter.com/f7CZFXLuIQ
ఇక ఈ అరెస్టులను రైతు ఐక్యకార్యాచరణ సమితి తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆందోళన చేసే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించింది. ఇక రాజ్యాంగబద్దంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన రైతులను అరెస్టు చేయడాన్ని వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన ల్యాండ్ పూలింగ్ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నష్కల్ స్టేజ్ వద్ద నిర్వహించిన ధర్నాలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొని రైతులకు తన సంఘీభావం తెలియజేశారు. బిజెపి నేతలతో పాటు వామపక్ష పార్టీల నేతలు కూడా రైతుల పోరాటానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.