కేసీఆర్..వాట్ నెక్స్ట్?: కథ కంచికేనా?
హైదరాబాద్: దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో తలమునకలుగా ఉంటోన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏ, ఎన్డీఏలకు సమదూరాన్ని పాటిస్తూ కొత్తగా మూడో కూటమిని తెర మీదికి తీసుకుని రావడానికి పావులు కదుపుతున్నారు.

దూకుడుగా..
ఇదివరకే ఆయన దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీ, ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్‌తో భేటీ అయ్యారు కేసీఆర్. ఆ తరువాత దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. అక్కడే మకాం వేశారు. జాతీయ పార్టీల నాయకులను కలుసుకునే ప్రయత్నం చేశారు. జార్ఖండ్‌కు సైతం వెళ్లారు. జార్ఖండ్ ముక్తిమోర్చా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు.

తప్పిన అంచనాలు..
అంతకుముందే- రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర వామపక్ష నేతలను హైదరాబాద్‌లో కలుసుకున్నారు. ఇవన్నీ కూడా 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా అన్ని ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలను కూడగట్టుకునే ప్రయత్నాలే. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతాయనే అంచనాలను వేశారాయన.

మూడింట్లో విజయదుందుభి..
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలవుతుందని, ఫలితంగా- మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయవచ్చిన భావించారు. ఇప్పుడు ఆ అంచనాలు తప్పినట్టే అయింది. అయిదు రాష్ట్రాల్లో మూడింట్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం వీచింది. 2017 తరహాలోనే వార్ వన్‌సైడ్ అయిపోయిందక్కడ. భారీ మెజారిటీతో బీజేపీ దూసుకెళ్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోంది.

గోవాలోనూ ఖాయమే..
403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 202 సీట్లను ఇప్పటికే దాటేసింది బీజేపీ. 240కి పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి రావడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అందుకోవడం దాదాపు లాంఛనప్రాయమే అయింది. గోవాలో ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సమాయాత్తమౌతోంది. పూర్తిస్థాయి మెజారిటీకి ఒకట్రెండు సీట్ల దూరంలో మాత్రమే ఉంది బీజేపీ. స్వతంత్ర అభ్యర్థులు లేదా మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.

కేసీఆర్‌పై దృష్టి..
తన నాలుగు రాష్ట్రాలను నిలబెట్టుకుంది బీజేపీ. తన ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకోగలిగింది. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ ఎలాంటి అడుగు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి పరాభవం తప్పదంటూ ఆయన వేసిన అంచనాలు తప్పాయి. ఎప్పట్లాగే- థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను దూకుడుగా కొనసాగిస్తారా? లేక- తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు- కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ ప్రయత్నాలపై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పైగా- ఆయన మరింత దూకుడుగా వ్యవహరించవచ్చని అంటున్నారు.