కాంగ్రెస్ పార్టీకి రాజీనామా: బీజేపీలోకి మాజీ మంత్రి చంద్రశేఖర్, ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు.
పార్టీలో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని, వెన్నుపోటుదారులకు పెద్దపీట వేస్తున్నారని చంద్రశేఖర్ మండిపడ్డారు. క్రమశిక్షణ కలిగిన తాను.. క్రమశిక్షణలేని కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. జనవరి 18న చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు.

కాగా, 1985 నుంచి 2008 వరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా డాక్టర్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారు.
గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు, పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యారంగానికి సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పట్నుంచో వర్సిటీలకు వీసీలను నియమించట్లేదని, తాము ఆందోళన చేస్తున్నామని సోమవారం రెండు వర్సిటీలకు వీసీల పేర్లు ప్రకటించారని తెలిపారు. గవర్నర్ ను కలిసినవారిలో బీజేపీ నేత లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.