టీఆర్ఎస్కు షాక్: కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే, భారీగా చేరికలుంటాయన్న రేవంత్ రెడ్డి
ఖమ్మం: అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేతలు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడ జడ్పీటీసీ కాంతారావులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితోపాటు తాటి వెంకటేశ్వర్లు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్లో చేరడంపై రేవంత్ రెడ్డి
పోడు భూముల్లో దుక్కి దున్ని.. సాగు చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్టులు చేసి హింసిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందన్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్లోకి భారీగా చేరికలుంటాయన్నా రేవంత్
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలైతే.. అన్నదాతల జీవితాలే మారిపోతాయన్నారు.
తాము అధికారం చేపట్టాక పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తొందరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుపాను రాబోతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు పెరుగుతాయని రేవంత్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్పై తాటి వెంకటేశ్వర్లు విమర్శలు
అనంతరం తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రుణమాఫీ హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేశారన్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వలేదన్నారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే చాలదని.. ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ధరణి వల్ల ప్రతి రైతూ ఇబ్బంది పడుతున్నారన్నారు తాటి వెంకటేశ్వర్లు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భద్రాచలం వచ్చి పోడు రైతులకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. నిరుపేదలు, గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు తాటి వెంకటేశ్వర్లు.