‘బాహుబలి’ కాదు.. పెద్ద ‘బఫూన్’, కేసీఆర్ చేతకాని దద్దమ్మ.. కేకే ఓ సన్నాసి: సర్వే సత్యనారాయణ
మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. వరంగల్ లో నిన్న జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: సాధారణంగా 'దద్దమ్మ', 'సన్నాసి'.. అనే పదాలు కేసీఆర్ ఉపయోగిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం రివర్స్ అయింది. పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ రకమైన మాటలు అలవోకగా వాడేస్తున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్ పైనే ఇలాంటి మాటలతో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ విరుచుకుపడ్డారు. వరంగల్ లో నిన్న జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ చేతకాని దద్దమ్మ.. కేకే ఓ సన్నాసి. డీఎస్ లాంటి దద్దమ్మలను పార్టీలో చేర్చుకున్న పెద్ద దద్దమ్మ కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.
బాహుబలి కాదు.. పెద్ద బఫూన్. 'కబాలి' సినిమాలా.. వరంగల్ సభ పెద్ద ప్లాప్ షో..' అంటూ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించడం యాక్సిడెంటల్ గా జరిగిందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని సర్వే అన్నారు.
కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కు లు చేసినా 2019 లో కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశారు. వరంగల్ నుంచే కేసీఆర్ వినాశం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ సర్వే ఫలితాలు చూసి కేసీఆర్ కు వణుకు మొదలైందని చెప్పారు. కేసీఆర్ గద్దె దిగక తప్పదని సర్వే సత్యనారాయణ అన్నారు.