బీజేపీలోకి వైసీపీ మాజీ ఎంపీ : టీఆర్ఎస్ కీలక నేత సైతం - అమిత్ షా సమక్షంలో..!!
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. అధికార పార్టీలో అంతర్గత సమస్యలతో ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకొనే ప్రక్రియ వేగవంతం చేసింది. తెలంగాణలో రాజకీయ జంపింగ్ లు మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది పైనా సమయం ఉన్నా.. పార్టీలు ముందుగానే ఎన్నికలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ అనేక మంది టీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లింది. చాలా రోజులుగా...తెలంగాణ బీజేపీలో కీలక నేతల చేరికలు ఉంటాయని కేంద్ర మంత్రులు..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ కేంద్రం పైనా..బీజేపీని లక్ష్యం చేసుకుంటూ పోరాటం చేస్తున్న వేళ..తమ కార్యాచరణ వేగవంతం చేయాలని బీజేపీ నిర్ణయించింది.

పొంగులేటి పై కొంత కాలంగా ప్రచారం
తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఈ నెలాఖరులో ఆయన తెలంగాణలో పర్యటించేందుకు దాదాపుగా నిర్ణయం జరిగింది. అందులో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ముఖ్య నేతలు చేరికలు ఉండేలా రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో బాగంగా గులాబీ పార్టీలో ప్రాధాన్యత దక్కక..అంతర్గతంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి..వారిని ఆకర్షించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా.. ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ..ప్రస్తుత టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి కొద్ది కాలంగా పార్టీ మారుతారనే ప్రచారం సాగింది.

మరో కేంద్ర మాజీ మంత్రి సైతం..
ఆయన కొద్ది కాలం క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తోనూ భేటీ అయ్యారు. అయితే, పొంగులేటి షర్మిల పార్టీలో చేరుతారని భావించాన..ఆయన రాజకీయంగా తన నిర్ణక్ష్ం పైన అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే, ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి జూపల్లి సైతం పొంగులేటితో భేటీ అయ్యారు. తాజాగా..పదవులు ఎవరికీ శాశ్వతం కాదంటూ పొంగులేని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. ఇక, ఆయన బీజేపీలో చేరటం ఖాయమైందని జోరుగా ప్రచారం సాగుతోంది. అదే విధంగా అదిలాబాద్ కు చెందిన సీనియర్ పొలిటీషియన్ పేరు సైతం ప్రచారంలోకి వచ్చింది. ఆయన టీఆర్ఎస్ వీడి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్దమైందని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

ఆపరేషన్ ఆకర్ష్ తో బీజేపీ దూకుడు
బీజేపీ కండువా కప్పుకొనేందుకు వీరు దాదాపుగా సిద్దమైనట్లు తెలుస్తోంది. దీని పైన ఈ ఇద్దరు నేతలు త్వరలోనే అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఆయన పర్యటన ఖరారు అయితే ఆ సమయంలో..లేకుంటే ఢిల్లీలో షా సమక్షంలో వీరి చేరికలు ఉంటాయని తెలుస్తోంది. వీరితో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మరో సీనియర్ నేత పేరు సైతం ప్రచారం లో ఉంది. దీంతో..బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా..ఇంకా ఎవరి పైన ఫోకస్ పెట్టిందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. అయితే ప్రచారంలో ఉన్న సీనియర్ నేత దీనిని ఖండించారు. తనకు పార్టీ మారే యోచన లేదని స్పష్టం చేశారు