హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొబైల్స్ తయారీ కేంద్రంగా టి: కెసిఆర్‌ను కలిసిన ఫాక్సికాన్ ప్రతినిధులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరం ఇక మొబైల్ ఫోన్లకు కేంద్రంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మొబైల్ క్లస్టర్ పట్ల సెల్‌ఫోన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రముఖ మొబైల్ ఫోన్లు, విడిభాగాల తయారీ సంస్థలు నగరంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి.

ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న రాష్ట్రం ఇక మొబైల్ ఉత్పత్తి కేంద్రంగానూ మారనుంది. హైదరాబాద్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నామని వీడియోకాన్ సంస్థ ఇదివరకే ప్రకటించగా, తాజాగా మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ సంస్థలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చాయి.

ఇది ఇలా ఉండగా, ఆపిల్ వంటి ప్రముఖ మొబైల్ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ గురువారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును క్యాంప్ కార్యాలయంలో కలుసుకొని పరిశ్రమ స్థాపనపై చర్చించింది. సంస్థ ప్రెసిడెంట్ కాల్విన్ ఛిన్, ఎఫ్‌ఐహెచ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్‌లు రాష్ట్ర మంత్రి కే తారకరామారావుతో కలిసి సీఎంతో సమావేశమయ్యారు.

Foxconn Chief Holds Talks with KCR Over iPhone Plant in Telangana

ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకువస్తున్న టీఎస్‌ఐపాస్ ఎంతో ఉదాత్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఐఫోన్‌లాంటి అత్యాధునిక ఫోన్లను తయారుచేసే తమ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.

ఇప్పటికే నగరంలో యూనిట్లు స్థాపించడానికి పలు సెల్‌ఫోన్ తయారీ సంస్థలు ముందుకు వచ్చాయని సీఎం ఈ సందర్భంగా వారికి వివరించారు. హబ్‌ కోసం అనువైన స్థలం కేటాయించడంతోపాటు, అన్ని విధాల పారిశ్రామిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆహ్వానించారు.

మొబైల్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి లభించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా తాము రూపొందించిన పారిశ్రామిక విధానం వల్ల ఇక్కడి యువతకు ఉపాధిని కల్పించడంతోపాటు రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రెసిడెంట్ విన్సెంట్ టాంగ్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు జూన్ 6న తైవాన్ పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించి, పరిశ్రమల స్థాపన వల్ల పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించాలని ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన సీఈఓ టాంగ్ వారం తిరగకుండానే హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకోవడం విశేషం. హైదరాబాద్‌లో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని టాంగ్ పేర్కొన్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మొబైల్ క్లస్టర్‌లో రూ.400-500 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సెల్‌కాన్ సీఎండీ వై గురు గురువారం తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ఐదు నుంచి పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌లో నెలకు 20 లక్షల మొబైళ్లు ఉత్పత్తి అవుతాయని గురు చెప్పారు.

ఈ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నెలకొల్పేందుకు మరో ఏడాది కాలం పట్టవచ్చని అన్నారు. అందువల్ల ప్రస్తుతానికి హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ యూనిట్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. వచ్చే వారం ఈ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ కేంద్రంలో నెలకు మూడు లక్షల మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేయవచ్చని చెప్పారు. తైవాన్, చైనా దేశాలనుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిమాండ్‌ను బట్టి ఈ యూనిట్ సామర్థ్యాన్ని వచ్చే రెండు నెలల్లో 6 లక్షల మొబైళ్లకు పెంచనున్నట్లు గురు పేర్కొన్నారు.

ఈ యూనిట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకం స్పూర్తితో ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సబ్సిడీ, పన్నుల్లో రాయితీలు లభించడం తమకు ఆసక్తి కలిగించాయని ఆయన తెలిపారు.

English summary
FIH Mobile CEO WH Tong and Foxconn Technology Group president Calvin Chin called on Chief Minister K Chandrasekhar Rao at the latter’s camp office here Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X