కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..
వాగులో గర్భిణి గల్లంతైన ఉదంతం విషాదాంతంగా ముగిసింది. బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూ రెడ్డి(28) చివరికి విగత జీవిగా తేలారు. శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా, మూడో రోజైన సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. సింధు గల్లంతైన వాగుకు సమీపంలోనే తుంగభద్ర నది ఉండటం, మూడు రోజులైనా ఆమె ఆమె ఆచూకీ దొరక్క పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంతలోనే..

కర్నూలు వరకు కొట్టకుపోయి..
శనివారం తెల్లవారుజామున.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలోని వాగులో సింధూ రెడ్డి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అంచనా వేసినట్లుగానే.. వాగుకు సమీపంలోని తుంగభద్ర నదిలోకి ఆమె కొట్టుకుపోయారు. కర్నూలులోని తుంగభద్ర బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది.
కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠ

అసలేం జరిగిందంటే..
ప్రమాదం నుంచి సింధు భర్త శివశంకర్ రెడ్డి, అతని స్నేహితుడు జిలానీ బాషా ప్రాణాలతో బయటపడినా, ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమాచారం తెలిసిన వెంటనే గద్వాల జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. ప్రమాద స్థలం నుంచి 500 మీటర్ల దూరంలో కారును ముళ్లపొదల్లో గుర్తించారు. కొద్ది దూరంలో సింధు హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా గుర్తించారు. కానీ ఆమెను మాత్రం కనిపెట్టలేకపోయారు.
పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?

క్వారంటైన్ భయంతో..
హైదరాబాద్ కు చెందిన శివశంకర్ రెడ్డి, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగసింధూరెడ్డి భార్యా భర్తలు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడంతో కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. లాండ్ డ్రైవ్ లో తోడు కోసం శివశంకర్‌రెడ్డి స్నేహితుడు జిలానీబాషా కూడా వారితో ప్రయాణించాడు. అయితే, అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద కరోనా టెస్టులు చేసి, హోం క్వారంటైన్ విధిస్తారేమోననే భయంతో హైవేను వదిలి మరో మార్గంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం తలెత్తింది.

మూడు రోజుల ఆపరేషన్..
శని, ఆదివారాల్లో పొద్దు పోయేంత వరకు గాలించి, చర్యలను నిలిపేసిన పోలీసులు.. సోమవారం ఉదయం నుంచి మళ్లీ ఆపరేషన్ మొదలు పెట్టారు. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటం, వాగుకు దగ్గర్లోనే తుంగభద్ర నది ఉండటంతో గాలింపునకు లైఫ్ బోట్లు వాడాలంటూ జిల్లా ఎస్పీ రంజన్ రజత్ కుమార్ ఆదేశించినట్లు సెర్చ్ ఆపరేషన్ కు నేతృత్వం వహిస్తోన్న ఆలంపూర్ సీఐ మీడియాకు తెలిపారు. తుంగభద్ర నదిలో గాలించిన టీమ్ కు ఎట్టకేలకు సింధూ మృతదేహం లభించింది.

రెండు రాష్ట్రాల్లో విషాదం..
అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల వాగులో ప్రవాహ ఉద్ధృతిని తప్పుగా అంచనా వేసి, ముందుకు రావడంతో కారు వరదలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో వెనుక సీటులో నిద్రపోతోన్న సింధును కాపాడేందుకు శివశంకర్, బాషా చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి సింధు చనిపోయిందన్న వార్త రెండు రాష్ట్రాల్లోని వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సింధు గర్భవతి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆమె క్షేమంగా తిరిగి తిరిగిరావాలని కుటుంబీకులు, సన్నిహితులు ప్రార్థనలు చేసినా ఫలితం రాలేదు.