వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం పక్కా లెక్క: తాను దొరికితే అందరు చిక్కేలా ప్లాన్, సీడీలు, మరో డెన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మూడు రోజుల్లో సిట్‌ కంట్రోల్‌ రూంకు సుమారు వంద ఫోన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే, స్థానిక పోలీసు స్టేషన్లలోనూ నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో నయీం, అతని గ్యాంగ్‌ సభ్యులపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది.

వీటన్నింటినీ సిట్‌కు బదిలీ చేసి ఒకేచోట విచారిస్తారు. నయీం, అతని అనుచరుల దురాగతాలకు ఇన్నాళ్లూ భయపడి ఫిర్యాదు చేయలేకపోయిన బాధితులు, ఇప్పుడు బయటకు వస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిభట్లలో సర్వే నెం. 158/ఆ, 216, 217, 218/అ, 220/అ, 221, 227లలో గల 24 ఎకరాల రంగప్పతోట (దొడ్డిబావి) భూములను నయీం, అతని అనుచరులు భయపెట్టి బలవంతంగా కాజేశారంటూ బాధితురాలు మల్లమ్మ ఎల్బీన గర్‌ డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Gangster Nayeem's land grab under lens

తన భర్త ముక్కెర నారాయణ పేరున ఉన్న ఈ భూములను నయీం, అతని అనుచరులు సామ సంజీవ రెడ్డి, శ్రీహరి భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. తనను నయీం భయపెట్టి రూ.2 కోట్లు డిమాండ్‌ చేశాడని, చివరికి రూ.50 లక్షలు వసూలు చేశాడని నల్గొండ జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన శ్రీధర్‌ ఆదివారం ఫిర్యాదు చేశారు. నయీం అనుచరులు పాశం శ్రీనివాస్‌, కత్తుల జంగయ్య దీంట్లో ప్రధాన పాత్ర పోషించారన్నారు.

నయీం పక్కా ప్లాన్‌తో..

నయీం తెలివిగా, పక్కా ప్లానింగ్‌తో ఏదైనా చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. నక్సలైట్లతో చేతులు కలుపడంతో మొదలైన అతని నేరచరిత్ర ఎన్‌కౌంటర్‌లో చనిపోయేంతవరకు కొనసాగింది. ఈ మధ్యకాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరి పేరు అతను రికార్డు చేశాడు.

ఒకవేళ తాను పోలీసులకు చిక్కితే లేదా చనిపోతే తన నేరమయ జీవితానికి మద్దతునిచ్చిన వాళ్లకు కూడా శిక్ష పడాలని నయీం అనుకున్నాడని చెబుతున్నారు. సమాజం ముందు, చట్టం ముందు వారిని కూడా దోషులుగా నిలబెట్టాలనుకున్నాడు. అందుకే నిత్యం తాను ఏం చేస్తున్నదీ, ఎవరితో మాట్లాడుతున్నదీ, ఎవరితో కలిసి ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తున్నదీ, అందులో తన వాటా, తనకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల వాటాలతో పాటు ఇలా ప్రతి విషయాన్ని తన డైరీలో రాశాడు.

చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ద్వారా పక్కాగా లెక్కలు వేయించాడు. ప్రత్యేక పోలీసు బృందం (సిట్) దర్యాప్తులో ఈ వివరాలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాను సంపాదించిన ప్రతి పైసాను సీఏ ద్వారా నయీం పక్కాగా లెక్కలు వేయించినా ఆదాయ పన్ను కట్టినట్టు మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది.

సంపాదించిన ఆస్తులను నయీం బినామీల పేరున పెట్టాడు. తనకు వరుసకు సోదరుడయ్యే పహీం పేరుపై రూ.350 కోట్ల వరకు ఆస్తులు బదలాయించినట్టు పోలీసులు గుర్తించారు. ఫర్హానా పేరు మీద దాదాపు రూ.250 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. నయీం చేసే హత్యలకు స్కెచ్ వేసే శేషన్న సంబంధీకుల పేర్ల మీద కూడా మరో రూ.250 కోట్ల ఆస్తులు పెట్టినట్టు తెలుస్తోంది.

నయీం భార్య పేరుపై మాత్రం కొద్ది ఆస్తులే ఉంచాడు. ఆమె పేరున మూడు ఇల్లు, సోదరి పేరు మీద రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించాడని తెలుస్తోంది. తుక్కుగూడలోని 12 ఎకరాల ఫాంహౌజ్‌ను ప్రస్తుతం దుబాయిలో ఉన్న నయీం తన దూరపు బంధువు పేరున రిజిస్ట్రేషన్ చేయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

తనను ఇరవై ఏళ్లు వాడుకొని, గ్యాంగ్‌స్టర్‌గా మార్చిన వారందరి పేర్లు బయటకు వచ్చేలా నయీం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. తనకేదైనా అయితే తన భూదందాలో లబ్ధిపొందిన వారి పేర్లను ఆధారాలతో సహా బయటకు వచ్చేలా చూడడానికి తన మాఫియాలో ఉన్న ముగ్గురు అడ్వకేట్లను ముందే సిద్ధం చేశాడని తెలుస్తోంది.

ఈ విషయాన్ని కూడా నయీం డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు తాను మెయింటెన్ చేస్తున్న అకౌంట్ బుక్, లీగల్‌గా చెల్లుబాటయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా తన న్యాయవాదులకు నయీం సూచించాడని తెలుస్తోంది. తన సహకారంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ల్యాండ్ డాక్యుమెంట్ల సెట్లు తీసుకుని జాగ్రత్తగా దాచి పెట్టాడు. ఇలా భద్రపరిచిన డాక్యుమెంట్లు దాదాపు 650 వరకు ఉంటాయని తెలుస్తోంది.

రికార్డ్ చేశాడు

నయీం తనతో సంబంధాలు నెరపిన అధికారులు, రాజకీయ నాయకుల మాటలను కూడా రికార్డ్ చేశాడు. వాటిని సీడీలుగా కూడా మార్చి, దాచి పెట్టాడు. 2007 నుంచి 2015 చివరి వరకు తనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు, ప్రజాప్రతినిధుల సంభాషణలను, తనతో ఫోన్‌లో మాట్లాడిన మాటలను రికార్డు చేసి సీడీలు రూపొందించాడని తెలుస్తోంది.సీడీ కవర్ల పైన వివరాలను తెలుగులో రాసిపెట్టాడు. వీటిని చూస్తుంటే నయీం ప్రతి విషయంలోను పక్కాగా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

మరో డెన్

నయీం ఆస్తులపై పోలీసుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడలో నయీంకు చెందిన మరో ఇంటిని పోలీసులు తాజాగా గుర్తించారు. ప్రస్తుతం భవనంలో సోదాలు కొనసాగుతున్నాయి.

English summary
The SIT is probing the lands illegally acquired by gangster Nayeemuddin in the last two decades. Fresh allegations of the gangster encroaching and grabbing lands have surfaced in the last two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X